తెలంగాణ

telangana

కేంద్రం కీలక నిర్ణయం.. విమాన టికెట్ ధరలకు ఇక రెక్కలు!

By

Published : Aug 10, 2022, 6:38 PM IST

Airfare bands: దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది కేంద్ర ప్రభుత్వం. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31న అమల్లోకి రానుందని తెలిపారు.

Etv Bharat
Etv Bharat

విమాన టికెట్ ధరలపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ మార్గాల్లో విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించింది. ఈ మేరకు పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఈ నిర్ణయం ఆగస్టు 31న అమల్లోకి రానుంది. అంటే ఇకపై, ప్రయాణికుల ఛార్జీలపై విమానయాన సంస్థలే స్వేచ్ఛగా నిర్ణయం తీసుకోవచ్చు.

విమాన ఇంధన ధరలు, రోజువారీ ప్రయాణికుల డిమాండ్‌ వంటి అంశాలను విశ్లేషించిన అనంతరం విమాన ఛార్జీలపై పరిమితులను తొలగించాలని నిర్ణయించినట్లు పౌరవిమానయాన మంత్రి సింధియా తెలిపారు. పౌరవిమానయాన రంగంలో స్థిరీకరణ మొదలైందని, రానున్న రోజుల్లో దేశీయంగా ఈ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కొవిడ్‌ కారణంగా రెండు నెలలు లాక్‌డౌన్‌ తర్వాత 2020 మే నెలలో దేశీయ విమాన సేవలు తిరిగి ప్రారంభమైనప్పుడు.. దేశీయ మార్గాల్లో ఛార్జీలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులను విధించిన విషయం తెలిసిందే. తక్కువ ఛార్జీల వల్ల విమానయాన సంస్థలు నష్టపోకుండా, గిరాకీకి అనుగుణంగా సంస్థలు భారీగా ఛార్జీలు పెంచకుండా చూడటం ద్వారా ప్రయాణికులకు ఊరట కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణ సమయాన్ని బట్టి వీటిని నిర్ణయించారు. 40 నిమిషాల్లోపు వ్యవధి ఉండే ప్రయాణాలకు రూ.2,900-8800 (జీఎస్‌టీ మినహాయించి) ఛార్జీ నిర్ణయించారు.

అయితే, ఇప్పుడు విమానయాన రంగం క్రమక్రమంగా కోలుకుంటోంది. ప్రయాణికుల సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఛార్జీలపై పరిమితులను ఎత్తివేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ ప్రకటించింది. కొత్త నిర్ణయం ఆగస్టు 31 నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. అయితే, విమానయాన సంస్థలు, ఎయిర్‌పోర్టు యాజమాన్యాలు కొవిడ్‌ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేసింది. ప్రయాణ సమయాల్లో ప్రజలు నిబంధనలు పాటించేలా చూసుకోవాలని ఆదేశించింది.

గత కొంతకాలంగా, విమాన ఇంధన ధరలు విపరీతంగా పెరిగాయి. 2019-20 లో ఏటీఎఫ్‌ ధర కిలో లీటరుకు రూ. 53,000 కాగా.. ప్రస్తుతం రూ. 1.20 లక్షలకు చేరింది. కొవిడ్‌ ముందుతో పోలిస్తే ఈ ధర రెట్టింపు కావడంతో విమాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఛార్జీలపై పరిమితులు ఎత్తివేయడంతో ఎయిర్‌లైన్లు ప్రయాణికులను పెంచుకునేందుకు టికెట్లపై భారీ డిస్కౌంట్లు ప్రకటించుకునే అవకాశముందని కొందరు అభిప్రాయపడుతున్నారు.

ఇవీ చదవండి:బడ్జెట్ లెక్కలు తారుమారైనా బేఫికర్ ఉండాలా? ఇలా చేయండి!

రూ.54వేల కోట్ల టెస్లా షేర్లు విక్రయించిన మస్క్.. కారణం అదే!

ABOUT THE AUTHOR

...view details