ETV Bharat / business

బడ్జెట్ లెక్కలు తారుమారైనా బేఫికర్ ఉండాలా? ఇలా చేయండి!

author img

By

Published : Aug 10, 2022, 5:17 PM IST

పొదుపు, పెట్టుబడుల గురించి ఒకప్పుడు కుటుంబంలోని పెద్దలే చర్చించుకునే వారు. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. కుటుంబ సభ్యులందరూ కలిసి నిర్ణయాలు తీసుకుంటున్నారు. వచ్చిన ఆదాయం, అయ్యే ఖర్చుల గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉంటోంది. దీనివల్ల బడ్జెట్‌ తలకిందులు కాకుండా.. సంపదను పెంచుకునేందుకు వీలవుతోంది. ఆర్థిక స్థిరత్వం సాధించే దిశగా.. ఎలాంటి వ్యూహాలు పాటించాలో తెలుసుకుంటేనే ఇది సాధ్యం అవుతుంది.

personal finance planning
బడ్జెట్ లెక్కలు తారుమారైనా బేఫికర్ ఉండాలా? ఇలా చేయండి!

ఒక లక్ష్యం నిర్ణయించుకొని, దానికి అనుగుణంగా పెట్టుబడులు ప్రారంభించడమే ఆర్థిక స్థిరత్వ సాధనలో తొలి అడుగు. మీరు అనుకుంటున్న లక్ష్యాన్ని, అందుకు అయ్యే మొత్తం, వ్యవధిని ముందు గుర్తించండి. స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాల జాబితాను తయారు చేయండి. అనుకోవడం తేలికే. కానీ, దాన్ని సాధించేందుకు ఎంతో క్రమశిక్షణ అవసరం. స్వల్పకాలిక అవసరాలు ఉన్నవారు.. పెట్టుబడి మొత్తాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకునే వెసులుబాటు ఉండాలి. ఇలాంటి వారు మదుపు చేసేందుకు డెట్‌ ఫండ్లను పరిశీలించాలి. మార్కెట్‌ ఇచ్చే అవకాశాలను అందుకుంటాం.. కాస్త నష్టభయం ఉన్నా ఇబ్బంది లేదు అనుకుంటే.. హైబ్రీడ్‌ ఫండ్లు లేదా పాసివ్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. దీర్ఘకాలిక లక్ష్యాలుండి, కాస్త నష్టం వచ్చినా భరించే శక్తి ఉన్నవారు ఈక్విటీ ఫండ్లను ఎంచుకోవాలి. వివిధ ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడుల ప్రణాళిక వ్యూహాత్మకంగా ఉండాలి. లేకపోతే అనుకున్న లక్ష్యం చేరేందుకు ఆలస్యం అవుతుంది.

కష్టంలో ఆదుకునేలా..
పెట్టుబడులను ఎప్పుడూ మధ్యలోనే వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయొద్దు. అవసరం వచ్చినప్పుడల్లా.. భవిష్యత్‌ లక్ష్యాల కోసం దాచుకున్న మొత్తాన్ని తీస్తుంటే.. ఎప్పటికీ ఆర్థిక స్థిరత్వం సాధించలేం. కాబట్టి, ప్రతి కుటుంబానికీ కొంత అత్యవసర నిధి అందుబాటులో ఉండాలి. కుటుంబం ఖర్చులు, ఇతర అవసరాలను దృష్టిలో పెట్టుకొని, ఈ నిధిని ఏర్పాటు చేసుకోవాలి. పొదుపు మొత్తాన్ని ముట్టుకోకుండా మన అవసరాలు తీరేందుకు ఇది ఉపయోగపడుతుంది. కనీసం 3-6 నెలలకు సరిపోయే మొత్తం లిక్విడ్‌ ఫండ్లలో మదుపు చేయొచ్చు. సులువుగా డబ్బును వెనక్కి తీసుకునేలా ఉండటమే ఇక్కడ ప్రధానం.

వైవిధ్యంగా..
మార్కెట్‌ పనితీరు ఎప్పుడూ మారుతూనే ఉంటుంది. పెట్టుబడి పెట్టేవారు ఈ విషయాన్ని గమనించాలి. మార్కెట్‌ గమనం ఎలా ఉన్నా పెట్టుబడులు సాధ్యమైనంత వరకూ లాభాలను పంచేలా ఉండాలి. అందుకు అనుగుణంగా పెట్టుబడుల్లో వైవిధ్యం ఉండేలా చూసుకోవాలి. ఈక్విటీ, డెట్‌, బంగారం, స్థిరాస్తులు, డిపాజిట్లు ఇలా మదుపరులు వివిధ పథకాలను ఎంచుకోవాలి. ఒక పథకం పనితీరు బాగాలేకపోయినా మిగతావి పోర్ట్‌ఫోలియోలో నష్టాన్ని పరిమితం చేస్తాయి.

నష్టాన్ని భరించగలరా..
పెట్టుబడి పథకాలను ఎంచుకునే ముందు.. మీ కుటుంబం ఎంత మేరకు నష్టాన్ని తట్టుకోగలదు అనేది అంచనా వేసుకోండి. ఆర్జించే వ్యక్తుల్లో వయసులో పెద్దవారు కాస్త తక్కువ నష్టభయాన్ని భరించగలరు. చిన్నవారు అధిక నష్టం వచ్చినా తట్టుకోగలరు. పదవీ విరమణకు దగ్గరగా ఉన్నవారు సురక్షిత పథకాలను ఎంచుకోవడం మంచిది. ఇదీ వ్యక్తుల అవసరాలను బట్టి ఆధారపడి ఉంటుందని మర్చిపోవద్దు. చిన్న వయసులో ఉన్నవారు.. ఈక్విటీల్లో దీర్ఘకాలం పెట్టుబడులను కొనసాగించగలిగే అవకాశం ఉంటుంది. దీనివల్ల నష్టాలు వచ్చే ఆస్కారం తగ్గుతుంది. పెట్టుబడుల్లో వైవిధ్యంతోపాటు, సమతౌల్యం పాటిస్తూ ఉన్నప్పుడే.. నష్టాలను పరిమితం చేసుకుంటూ.. మార్కెట్‌ లాభాలను కళ్లచూడగలరు.

సమీక్షించుకుంటూ..
పెట్టుబడులు ఎప్పుడూ దీర్ఘకాలం కొనసాగాలి. అంటే, మదుపు చేసి, మర్చిపోవడం కాదు. సమయానుకూలంగా వాటిని సమీక్షించుకుంటూ ఉండాలి. మారుతున్న అవసరాలకు తగ్గట్టుగా మన పెట్టుబడులు ఉన్నాయా చూసుకోవాలి. కొత్త లక్ష్యాలకు అనుగుణంగా పథకాల ఎంపిక మారాలి. లేకపోతే ఆర్థికంగా వెనుకబడిపోతాం.

కుటుంబం ఆర్థికంగా స్థిరంగా మారాలంటే.. ఒక్కరితోనే సాధ్యం కాదు. సభ్యులందరూ తమ వంతుగా ఆర్థిక క్రమశిక్షణ పాటించాలి. వేసుకున్న బడ్జెట్‌కు కట్టుబడి ఉండాలి. అప్పుడే ఆ కుటుంబ ఆర్థిక ప్రయాణం సాఫీగా సాగుతుంది.
- రాఘవ్‌ అయ్యంగార్‌, సీబీఓ, యాక్సిస్‌ ఏఎంసీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.