ETV Bharat / business

రూ.54వేల కోట్ల టెస్లా షేర్లు విక్రయించిన మస్క్.. కారణం అదే!

author img

By

Published : Aug 10, 2022, 12:46 PM IST

Musk Resla shares sold: టెస్లాలో తనకు ఉన్న షేర్లను ఎలాన్ మస్క్ విక్రయించారు. ఏకంగా 79.2 లక్షల షేర్లు విక్రయించినట్లు మార్కెట్ నియంత్రణ సంస్థ వెల్లడించింది.

Musk Resla shares sold
Musk Resla shares sold

Musk Tesla share sale: ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ టెస్లా షేర్లను విక్రయించారు. ఆగస్టు 5 నుంచి 9 మధ్య 6.88 బిలియన్ డాలర్లు (సుమారు రూ.54,680.52 కోట్లు) విలువ చేసే 79.2లక్షల షేర్లను మస్క్ అమ్మేశారు. ఈ విషయాన్ని అమెరికా సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ కమిషన్(ఎస్ఈసీ) వెల్లడించింది. సంస్థలో తన వాటాను ఇక అమ్మేది లేదని ప్రకటించిన నెలల వ్యవధిలోనే తాజా విక్రయం జరగడం గమనార్హం.

కారణం ట్విట్టర్ డీల్!
టెస్లా షేరు ఈ ఏడాది 30 శాతం మేర పడిపోయింది. మంగళవారం 850 డాలర్ల వద్ద ట్రేడయ్యింది. అయితే, తనకు టెస్లా షేర్లను విక్రయించే ఆలోచన లేదని ఏప్రిల్ 29న మస్క్ వెల్లడించారు. గడిచిన 10 నెలల్లో 32 బిలియన్ డాలర్లు విలువైన టెస్లా షేర్లను మస్క్ విక్రయించారు. తాజా విక్రయానికి మస్క్ కారణం చెప్పారు. ట్విట్టర్ డీల్ కారణంగానే షేర్లు విక్రయించినట్లు వెల్లడించారు. ట్విట్టర్ ఒప్పందాన్ని ముందుకు తీసుకెళ్లాల్సి వస్తే.. అత్యవసరంగా నిధులు సమీకరించాల్సిన పరిస్థితులు తలెత్తకుండా షేర్లు అమ్మేస్తున్నట్లు ట్వీట్ చేశారు.

ప్రస్తుతం మస్క్ ట్విట్టర్​తో న్యాయపోరాటం చేస్తున్నారు. ఏప్రిల్ నెలలోనే ట్విట్టర్ కొనుగోలుకు ఒప్పందం చేసుకున్నారు ఆయన. 44 బిలియన్ డాలర్లు చెల్లించేందుకు ఒప్పుకున్నారు. అనంతరం డీల్​ను రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ట్విట్టర్​లో స్పామ్/బాట్స్ ఖాతాలు 5శాతం కన్నా తక్కువ ఉన్నాయని సంస్థ నిరూపించలేకపోయిందని మస్క్ వాదిస్తున్నారు.

కాగా, కొనుగోలు ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం వల్ల ఎలాన్‌ మస్క్‌పై ట్విట్టర్‌ అమెరికాలోని డెలావర్‌ కోర్టులో దావా వేసింది. దీనిపై మస్క్‌ కూడా కౌంటర్‌ దావా వేశారు. తనను మభ్యపెట్టి, మోసం చేసి ట్విట్టర్‌ను కొనుగోలు చేసేలా ఒప్పందంపై సంతకం పెట్టించారని మస్క్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా భారత ప్రభుత్వంతో ట్విట్టర్‌ ఎదుర్కొంటోన్న న్యాయపరమైన వివాదాన్ని కూడా మస్క్‌ తన కౌంటర్ దావాలో ప్రస్తావించారు. ట్విట్టర్ వేసిన ఈ 'ప్రమాదకర' వ్యాజ్యాన్ని ఆ సంస్థ ఒప్పందంలో బయటపెట్టలేదని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.