తెలంగాణ

telangana

హెల్త్​ ఇన్సూరెన్స్​ తీసుకుంటారా?.. ఈ విషయాలు మస్ట్​గా తెలుసుకోండి!

By

Published : Jul 29, 2023, 7:42 AM IST

Health Insurance Benefits In Telugu : నాకేమైంది? ఏమౌతుంది? బాగానే ఉన్నా కదా!.. నాకెందుకు ఇన్సూరెన్స్​ పాలసీలు? అనే వారు చాలా మందే ఉన్నారు. ఈ మైండ్​సెటే మారాలని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీంతో భవిష్యత్​లో వచ్చే అనారోగ్య సమస్యల కోసం అప్పులు చేసి మరీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి పరిస్థితి రాకూడదంటే ప్రతి వ్యక్తి హెల్త్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. మరి ఓ ఆరోగ్య బీమా తీసుకునే ముందు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.

Know These Points Before Taking Health Insurance
ఆరోగ్య బీమా.. ఇవన్నీ తెలుసుకున్నాకే..

Health Insurance Benefits : భవిష్యత్​లో ఆరోగ్యపరమైన ఇబ్బందులు వచ్చినప్పుడు ఆర్థికంగా వాటిని ఎదుర్కొనేందుకు చాలా మంది హెల్త్​ ఇన్సూరెన్స్​లను తీసుకుంటుంటారు. ఏ చిన్నపాటి జబ్బు చేసినా ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకోవాలంటే వేలల్లో ఖర్చు అవుతుంది. అయితే వేలల్లో, లక్షల్లో వైద్య ఖర్చులు భరించలేని మధ్య తరగతి కుటుంబాల కోసమే మార్కెట్​లో అనేక రకాల ఆరోగ్య బీమా పాలసీలు అందుబాటులో ఉన్నాయిు. సీజన్​కు తగ్గట్టుగా మనతో పాటు మన కుటుంబం మొత్తానికి వర్తించేటట్టు ఒక సమగ్ర ఆరోగ్య బీమా పాలసీ ప్లాన్​ను తీసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కొచ్చు.

Health Insurance Plans For Family : ఒక ఆరోగ్య బీమా తీసుకునే ముందు సగటు వ్యక్తి ఈ కింది విషయాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇవి పాటిస్తే ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా ఆర్థికపరంగా ఇబ్బందుల్లేకుండా సులువుగా బయటపడతాడు. అయితే ఆరోగ్య బీమా ఎంత మొత్తానికి ఉండాలి అనేది మీరు ఎక్కడ నివసిస్తున్నారు, అక్కడ ఉన్న వైద్య సదుపాయాలు, వాటి ఖర్చులు, కుటుంబ పరిమాణం వంటి అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది.

అన్ని ఖర్చులకు వర్తించేలా..
అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినప్పుడు చికిత్స ఖర్చులనే కాకుండా, ఔట్‌ పేషెంట్‌ చికిత్స ఖర్చులకు కూడా పాలసీ వర్తించేలా చూసుకోండి. ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నప్పుడూ క్లెయిమ్​ చేసుకునే పాలసీలను అనేక ఆరోగ్య బీమా సంస్థలు అందిస్తున్నాయి. వీటిని ఓసారి పరిశీలించాలి. బీమా మొత్తం వైద్య ద్రవ్యోల్బణానికి అనుగుణంగా సర్దుబాటు అయ్యేలా చూసుకోవాలి.

విదేశాల్లోనూ వర్తించేలా..
ఇప్పుడు వైద్య చికిత్సల కోసం ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికైనా వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కేవలం మనం ఉంటున్న ప్రాంతంలోని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లోనే నగదు రహిత చికిత్స అందించే పాలసీలను ఎంచుకోవడం సరికాదు. కాబట్టి, వైద్యం కోసం విదేశాలకు వెళ్లినా వైద్య చికిత్సలకు అంగీకరించే వైద్య బీమా పాలసీలను ఎంచుకునే ప్రయత్నం చేయండి. అయితే ఈ రకం పాలసీలు కనీసం రూ.25 లక్షలకు మించి తీసుకోవాల్సి ఉంటుంది.

పెంచుకుంటూ ఉండాలి..
ఇప్పటికే మీరు ఆరోగ్య బీమా ప్లాన్​ను తీసుకుంటే గనుక అది ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా ఉందా లేదా చూసుకోండి. అలా లేకపోతే పాలసీ మొత్తం లిమిట్​ను పెంచుకునే అవకాశం ఉన్నందున దాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అయితే ప్రాథమిక బీమా పాలసీ మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రీమియం చెల్లింపులు కాస్త భారం కావచ్చు. దీనికి ప్రత్యామ్నాయంగా సూపర్‌ టాపప్‌ పాలసీలను ఎంచుకోవచ్చు. దీంతో మీకు అదనపు రక్షణ లభించడమే కాకుండా సులువుగా ప్రీమియాలను కట్టొచ్చు.

దీర్ఘకాల వ్యాధులకూ వర్తించేలా..
Health Insurance Plans Comparison : గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటీస్​, పక్షవాతం, క్యాన్సర్​ వంటి దీర్ఘకాల వ్యాధులతో బాధపడుతున్న వారు వీటికీ పరిహారం అందించే పాలసీలను తీసుకోండి. ఇందుకోసం ప్రత్యేకంగా క్రిటికల్‌ ఇల్‌నెస్‌ పాలసీలూ అందుబాటులో ఉన్నాయి. ఇవి తీసుకుంటే వ్యాధిని గుర్తించిన వెంటనే పరిహారాన్ని పొందొచ్చు. అయితే ఈ రకమైన కవరేజీలను తీసుకునే ముందు అందే పరిహారం మీ వార్షికాదాయానికి కనీసం 10 రేట్లు వరకూ ఉండేలా చూసుకోండి. కొన్ని పాలసీలు నెలవారీ చెల్లింపులు కూడా వినియోగదారులకు అందిస్తున్నాయి. వీటిని ఓ సారి పరిశీలించండి.

ఆ విషయాల్లో అస్సలు రాజీ వద్దు..
కొన్ని బీమా సంస్థలు అందించే ఆరోగ్య బీమా పాలసీల్లో గది అద్దె, ఆపరేషన్​లు, ఇతర ఖర్చులపై షరతులు ఉంటాయి. దీన్నే కో-పేమెంట్‌ అని అంటారు. అయితే ప్రీమియం తక్కువగా ఉంటుంది కదా అని వీటిని తీసుకోవడం మంచిది కాదు. పాలసీలు కొనుగోలు చేసే సమయంలో ప్రీమియాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. అలా అని వచ్చే ప్రయోజనాలపై ఎటువంటి రాజీ పడకూడదు. ముఖ్యంగా కో-పేమెంట్స్​, పరిమితుల విషయంలో. దీనివల్ల ఆసుపత్రిలో చేరినప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ఉదాహరణకు ఆస్పత్రి రూం అద్దె విషయంలో గనుక పరిమితులతో కూడిన ప్లాన్​ను ఎంచుకుంటే సింగిల్​ రూంకి బదులు షేరింగ్​ రూంలో చికిత్స పొందాల్సి రావచ్చు. క్లెయిం చేయని సంవత్సరంలో అందించే నో క్లెయిం బోనస్‌, ప్రీమియంలో తగ్గింపు, పునరుద్ధరణ ప్రయోజనాలు వంటివి కూడా తెలుసుకోండి.

ఆ విషయాలు ముందే తెలుసుకోండి..
Points To Be Followed Before Buying Health Insurance : ఆరోగ్య బీమా తీసుకునేముందు అది వేటికి వర్తిస్తుంది. దేంట్లో మినహాయింపులు ఉన్నాయి అనే విషయాలను ముందే తెలుసుకోండి. అయితే ముందస్తు వ్యాధులకు కనీసం రెండు, మూడేళ్లపాటు వేచి ఉండే కాలవ్యవధి ఉంటుంది. కాబట్టి తక్కువగా వేచి ఉండే వ్యవధి ఉన్న పాలసీలను ఎంచుకుంటే మంచిది. దీంతో పాటు మినహాయింపులు ఎంత కాలం తర్వాత రద్దు అవుతాయనేది ముందే అడిగి తెలుసుకోండి.

చివరగా గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయం ఏంటంటే.. ఆరోగ్య బీమా పాలసీ దరఖాస్తు ఫారమ్​ నింపేటప్పుడు మీ ఆరోగ్య వివరాల్లో ఎలాంటి తప్పులు లేకుండా సమర్పించండి. ఇలా చేస్తే పరిహారం అందే విషయంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తవు.

ABOUT THE AUTHOR

...view details