తెలంగాణ

telangana

'చాలామంది వృద్ధులు జైల్లో ఉన్నారు.. ఆయన బయటెందుకు?'

By

Published : Dec 20, 2021, 5:43 PM IST

Varavara Rao NIA: అనారోగ్యకారణాల దృష్ట్యా విరసం నేత వరవరరావు(83)కు బాంబేహైకోర్టు పలుమార్లు బెయిల్​ పొడిగించడాన్ని జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) వ్యతిరేకించింది. వైద్య చికిత్స అవసరం ఉన్న చాలామంది వృద్ధులు ప్రస్తుతం జైళ్లలో ఉన్నారని స్పష్టం చేసింది. వరవరరావును జైలుకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరింది ఎన్​ఐఏ.

varavara rao nia
వరవరరావు ఎన్​ఐఏ

Varavara Rao NIA: ఎల్గార్​ పరిషద్​ కేసులో అరెస్టయిన విరసం నేత వరవరరావు(83) ప్రస్తుతం అనారోగ్య కారణాలతో బెయిల్​పై ఉన్నారు. అయితే వరవరరావు జైలుకు తరలించేందుకు ఆదేశాలు ఇవ్వాలని ఈ కేసును విచారిస్తున్న జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ).. బాంబే హైకోర్టును కోరింది. వైద్యచికిత్స అవసరం ఉన్న అనేక మంది వృద్ధులు జైల్లో ఉన్నారని ఎన్​ఐఏ స్పష్టం చేసింది.

జస్టిస్ నితిన్ జామ్​దార్, జస్టిస్​ ఎస్​వీ కొత్వాల్​తో కూడిన ధర్మాసనం.. వైద్యకారణాల దృష్ట్యా వరవరరావుకు 2022 జనవరి 7వరకు బెయిల్ పొడిగించింది. అయితే.. అనారోగ్యం కారణంగా ఆరునెలల క్రితం షరతులతో మంజూరు చేసిన మధ్యంతర బెయిల్​ను ఇలా అనేక సార్లు బెయిల్ పొడిగించడాన్ని ఎన్​ఐఏ వ్యతిరేకించింది.

" వరవరరావు ఆరోగ్యంపై నానావతి ఆస్పత్రి నివేదికను విశ్లేషించడానికి మేము నిపుణులం కాదు. వరవరరావు డిశ్ఛార్జ్ అవ్వొచ్చని ఆస్పత్రి చెప్తే.. ఇంకా గడువు పొడిగించాలి అనే ప్రశ్నే లేదు. వైద్య చికిత్స అవసరం ఉన్న చాలా మంది వృద్ధులు జైల్లో ఉన్నారు. వారికి అవసరం అయినప్పుడు చికిత్స చేస్తారు. ముందు ఆయన సరెండర్ అయ్యేందుకు ఆదేశాలు ఇవ్వండి. వయసు దృష్ట్యా ఆయన బెయిల్ గడువు పొడిగించొద్దు." అని ఎన్​ఐఏ తరఫున అదనపు సోలిసిటర్ జనరల్ అనిల్​ సింగ్ కోర్టును కోరారు.

మరోవైపు.. నానావతి ఆస్పత్రి నివేదికను కోర్టుకు ఎన్ఐఏ సమర్పించినా.. ఆయన జైలుకు వచ్చే స్థితిలో ఉన్నారా? లేరా? అన్న విషయాన్ని తెలుసుకోవడంపై అఫిడవిట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని వరవరరావు కౌన్సిల్​ ఆనంద్ గ్రోవర్ విజ్ఞప్తి చేశారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు.. డిసెంబరు 28లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని గ్రోవర్​ను ఆదేశించింది. తదుపరి విచారణను 2022, జనవరి 4కు వాయిదా వేసింది.

ఎల్గార్‌ పరిషద్‌ కేసు ఏంటి?

మహారాష్ట్రలోని బీమా-కోరేగావ్‌లో 2018 జనవరిలో జరిగిన అల్లర్లలో మావోయిస్టుల కుట్ర ఉందని పుణెలో పోలీసులు కేసు నమోదు చేశారు. 2017 డిసెంబరు 31న ఎల్గార్‌ పరిషద్‌ అనే సంస్థ పుణెలో నిర్వహించిన కార్యక్రమం వెనుక మావోయిస్టులు ఉన్నారని, ఇక్కడ జరిగిన ప్రసంగాలే మర్నాడు బీమా కోరేగావ్‌ అల్లర్లకు కారణమయ్యాయని పేర్కొన్నారు. దీనికి సంబంధించి 2018 జూన్‌లో దేశవ్యాప్తంగా ఆరుగుర్ని అరెస్టు చేశారు.

ఇందులో దిల్లీకి చెందిన పౌరహక్కుల నేతలు రోనా విల్సన్‌, రోనా జాకొబ్‌, దళిత హక్కుల నాయకుడు ఎల్గార్‌ పరిషద్‌కు చెందిన సుధీర్‌ ధవాలె, షోమ సేన్‌, మహేష్‌ రౌత్‌, న్యాయవాది సరేంద్ర గాడ్లింగ్‌ ఉన్నారు.

ఇదీ చూడండి:ప్రభుత్వానికి రాహుల్​ సవాల్​.. వాటిపై చర్చకు డిమాండ్​!

ABOUT THE AUTHOR

...view details