తెలంగాణ

telangana

'భారత్​లో థర్డ్​ వేవ్​- ఫిబ్రవరిలో గరిష్ఠానికి కేసులు!'

By

Published : Dec 25, 2021, 6:02 AM IST

Third Covid Wave in India: ఒమిక్రాన్ వ్యాప్తి ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. భారత్​లోను ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే దేశంలో ఫిబ్రవరి కల్లా మూడో వేవ్ ముప్పు వచ్చే ప్రమాదముందని ఐఐటీ కాన్పుర్ తాజా అధ్యయనం వెల్లడించింది.

covid
కొవిడ్

Third Covid Wave in India: కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్‌ వేరియంట్‌తో చాలా దేశాల్లో కొవిడ్‌ ఉద్ధృతి మరోసారి పెరుగుతోంది. కొన్ని చోట్ల మూడు, మరికొన్ని దేశాల్లో నాలుగో వేవ్‌ రూపంలో ప్రభావాన్ని చూపుతోంది. ఇదే సమయంలో భారత్‌లోనూ ఒమిక్రాన్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే మనదేశంలో ఫిబ్రవరి తొలివారానికి మూడో వేవ్‌ గరిష్ఠానికి చేరుకోవచ్చని ఐఐటీ కాన్పూర్‌ తాజా అధ్యయనం వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌తో పెరుగుతోన్న తీవ్రతను పరిగణనలోకి తీసుకొని భారత్‌లో ఈ అంచనాలను రూపొందించినట్లు తెలిపింది.

దేశంలో థర్డ్‌వేవ్‌ను అంచనా వేసేందుకు గసియన్‌ మిశ్రమ మోడల్‌ అనే గణాంక పద్ధతి ద్వారా ఐఐటీ కాన్పూర్‌ నిపుణులు ఓ అంచనా వేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే థర్డ్‌వేవ్‌ ప్రభావాన్ని చవిచూస్తోన్న అమెరికా, బ్రిటన్‌, జర్మనీతోపాటు రష్యా దేశాల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకొన్నారు. వీటితోపాటు భారత్‌లో తొలి, రెండోవేవ్‌ సమయంలో నమోదైన కేసుల సంఖ్యనూ వినియోగించారు. వీటిని క్రోడీకరించిన నిపుణులు.. 2022 ఫిబ్రవరి తొలివారం నాటికి దేశంలో థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకోవచ్చని అంచనా వేశారు. అయితే, వ్యాక్సినేషన్‌ను పరిగణనలోకి తీసుకోనందున ఆ సమయం నాటికి ఎన్ని కేసులు వస్తాయనే విషయాన్ని మాత్రం అంచనా వేయలేదని స్పష్టం చేశారు.

Omicron Cases in India:

డిసెంబర్‌ 15, 2021 నుంచి కేసులు పెరుగుతాయని.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3 నాటికి గరిష్ఠానికి చేరుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనం పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న కొవిడ్‌ పోకడలను అనుసరించి భారత్‌లో థర్డ్‌ వేవ్‌పై అంచనాలు కట్టామని అధ్యయనానికి నేతృత్వం వహించిన పరిశోధకులు పేర్కొన్నారు. సమీక్ష కోసం ఓ జర్నల్‌లో ఉంచిన ఈ అధ్యయనానికి ఐఐటీ కాన్పూర్‌లోని మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టికల్‌ విభాగానికి చెందిన సరాబా పర్షాద్‌ రాజేశ్‌భాయ్‌, సుభ్రాశంకర్‌ ధర్, శలభ్‌లు ఈ అధ్యయనం చేపట్టారు.

ఇక దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం చేపట్టిన కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సంతృప్తి వ్యక్తం చేసిన ఈ బృందం.. 100శాతం అర్హులకు పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉందన్నారు. అమెరికా, బ్రిటన్‌, జర్మనీ, రష్యా దేశాల్లో మెజారిటీ ప్రజలకు వ్యాక్సిన్‌ అందినప్పటికీ అక్కడ థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొంటున్నట్లు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఇదివరకు వేవ్‌లో చూసిన నష్టాలు పునరావృతం కాకుండా ఉండేందుకు భారత్‌తోపాటు ఇతర దేశాలు పూర్తి సన్నద్ధతతో ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.

మరోవైపు.. వచ్చే ఏడాది తొలివారాల్లోనే దేశంలో థర్డ్‌వేవ్‌ గరిష్ఠానికి చేరుకుంటుందని జాతీయ కొవిడ్-19 సూపర్‌మోడల్‌ కమిటీ అంచనా వేసింది. అయితే, సెకండ్‌ వేవ్‌తో పోలిస్తే దీని తీవ్రత తక్కువగానే ఉండనుందని పేర్కొంది.

ఇదీ చదవండి:

బూస్టర్ డోసు అవసరమేనా? కేంద్రం ఏం చేయనుంది?

మహారాష్ట్రలో మళ్లీ కఠిన ఆంక్షలు- కొత్త మార్గదర్శకాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details