తెలంగాణ

telangana

Chandrababu Fires on CM Jagan: 'వైనాట్‌.. పులివెందుల'.. సీఎం ఇలాకాలో చంద్రబాబు గర్జన!

By

Published : Aug 3, 2023, 7:11 AM IST

Updated : Aug 3, 2023, 7:30 AM IST

Chandrababu Pulivendula Tour: ప్రాజెక్టుల సందర్శన కార్యక్రమంలో భాగంగా.. సీఎం జగన్ ఇలాకలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు చేపట్టిన రోడ్ షో కు పులివెందుల వాసులు బ్రహ్మరథం పట్టారు. లక్షల్లో బాబు రోడ్ షో కు ప్రజలు తరలిరావడంతో.. వచ్చే ఎన్నికల్లో 'వైనాట్‌.. పులివెందుల' అని బాబు నినదించారు. జగన్ ప్రస్తావించిన తన వయస్సు.. ఒక అంకే మాత్రమేనని, సింహం ఎప్పుడు సింహమే అని చంద్రబాబు గర్జించారు. రోడ్​ షో లో వివేకా హత్య కేసు, షర్మిలా, సునీత, కోడికత్తి అంశాలను ప్రస్తావించినప్పుడు.. ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. ఇక ఏపీ రాజధాని అమరావతే అన్న చంద్రబాబు ప్రకటనపై పులివెందుల వాసుల నుంచి హర్షధ్వానాలు వ్యక్తమైయ్యాయి.

Chandrababu Fires on CM Jagan
Chandrababu Fires on CM Jagan

Chandrababu Pulivendula Tour: సీఎం జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల నడిబొడ్డున తెలుగుదేశం అధినేత చంద్రబాబు రణన్నినాదం చేశారు. "వైనాట్‌ పులివెందుల" అంటూ గర్జించారు. దుష్టశక్తుల్ని మట్టికరిపించి, వచ్చే ఎన్నికల్లో పసుపు పతాక ఎగురవేయాలని పిలుపునిచ్చారు. తానెప్పుడూ సింహాన్నే అని, రెచ్చగొడితే కొదమసింహంలా జూలు విదులుస్తానని... వైసీపీ నాయకులను హెచ్చరించారు. బాబాయ్‌పై గొడ్డలి వేటు వేసి... ఇప్పుడు నంగనాచుల్లా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతున్న సునీతను.. పులివెందుల పులి అంటూ ప్రశంసించారు.

తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు పులివెందుల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరిలో భాగంగా రాయలసీమలో పర్యటిస్తున్న చంద్రబాబు.. పులివెందుల పూల అంగళ్ల సెంటర్‌లో భారీ బహిరంగ సభ నిర్వహించారు. అంతకముందు.. పులివెందుల ముఖద్వారం వద్ద చంద్రబాబుకు తెలుగుదేశం నేతలు ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి పూల అంగళ్ల సెంటర్ వరకూ... తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అశేష ప్రజానీకంతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. తెలుగుదేశం జెండాలు, ఫ్లెక్సీలతో పులివెందులను పసుపుమయం చేశారు. సైకో పోవాలి - సైకిల్ రావాలి పాటకు కేరింతలు కొడుతూ యువత నృత్యాలు చేశారు.

"నేనూ రాయలసీమ బిడ్డనే. నాకు వయసైపోయిందని ఈ ముఖ్యమంత్రి ప్రచారం చేస్తున్నారు. నా విషయంలో వయసు ఒక అంకె మాత్రమే. సింహం ఎప్పటికీ సింహమే. నాతో మర్యాదగా ఉంటే నేనూ అలాగే ఉంటాను. తక్కువ అంచనా వేసినా, రెచ్చగొట్టినా కొదమసింహంలా విరుచుకుపడి అణచివేస్తాను"-చంద్రబాబు, టీడీపీ అధినేత

బహిరంగ సభకు అశేషంగా తరలివచ్చిన పులివెందుల ప్రజానీకాన్ని ఉత్సాహపరుస్తూ చంద్రబాబు ప్రసంగించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు గోదావరి జలాలిచ్చి, శ్రీశైలం నుంచి రాయలసీమకు కృష్ణా నీళ్లిచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని గుర్తు చేశారు. మళ్లీ అధికారంలోకి వస్తే బనకచర్ల ద్వారా నీళ్లు తీసుకొచ్చి రాయలసీమను సస్యశ్యామలం చేస్తామని హామీ ఇచ్చారు. సీమకు, మరీ ముఖ్యంగా పులివెందులకు ఎంతో చేసిన తెలుగుదేశాన్ని ఈసారి గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైనాట్‌ పులివెందుల అంటూ గర్జించారు.

"వైఎస్‌ ఒక మాట చెబితే వివేకా జవదాటడని చెప్పేవారు. అలాంటి బాబాయిపై గొడ్డలి వేటు వేసిన వారికి మీరూ, మేమూ ఒక లెక్కా?. వివేకా హత్య జరిగిన వెంటనే దానికి నేనే బాధ్యుణ్నని ఆరోపిస్తూ, ‘నారాసుర రక్తచరిత్ర’ అంటూ సాక్షిలో కథనాలు రాశారు. సీబీఐ దర్యాప్తు జరపాలన్నారు. ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి.. వివేకా హత్యకు బీటెక్‌ రవి తదితరులు కారణమన్నారు. వివేకా కుమార్తె సునీత పులివెందుల పులి. తన తండ్రిని చంపినవాళ్లు ఎవరో ప్రపంచానికి తెలియజేయకపోతే, ఆయన ఆత్మకు శాంతి కలగదు కాబట్టి ఆడబిడ్డయినా ప్రాణాలకు తెగించి ధైర్యంగా పోరాడుతోంది"-చంద్రబాబు, టీడీపీ అధినేత

తన వయసుపై జగన్‌ చేస్తున్న వ్యాఖ్యల్ని చంద్రబాబు తిప్పికొట్టారు. ఇలాగే రెచ్చగొడితే కొదమసింహంలా విరుచుకుపడతానని హెచ్చరించారు. వివేకానందరెడ్డిని చంపేసి నంగనాచి కబుర్లు చెబుతున్న వారికి... ప్రజలు గట్టిగా గుణపాఠం చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. కోడి కత్తి డ్రామాలు ఆడే వ్యక్తి పులివెందులకు ఎమ్మెల్యే, రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. రాష్ట్ర రాజధాని అమరావతి అంటూ.. పూలంగళ్ల సెంటర్‌ వేదికగా పులివెందుల ప్రజలతో చంద్రబాబు జై కొట్టించారు.

రాష్ట్రాభివృద్ధి మరిచి దోపిడీ పాలన సాగిస్తున్న జగన్‌.. వ్యవస్థలను సర్వనాశనం చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. నాసిరకం మద్యంతో భారీగా దోచేస్తున్నారని ఆరోపించారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయిస్తూ వ్యక్తిగత గోప్యతకు జగన్ భంగం కలిగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. నాలుగేళ్లుగా జగన్ కరెంట్‌ ఛార్జీల మోత మోగిస్తున్నారని... తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మాటిచ్చారు. సూపర్‌ సిక్స్‌ పక్కాగా అమలుచేసి అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి పాటుపడతామని హామీ ఇచ్చారు.

Last Updated :Aug 3, 2023, 7:30 AM IST

ABOUT THE AUTHOR

...view details