ETV Bharat / state

CBN satires on CM Jagan in pulivendula: పులివెందులలో తిరుగుబాటు కనిపిస్తోంది.. జగన్ పతనం ఖాయం: చంద్రబాబు

author img

By

Published : Aug 2, 2023, 10:47 PM IST

Updated : Aug 3, 2023, 6:18 AM IST

TDP Chief Chandrababu Naidu satires CM Jagan: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పులివెందుల ప్రజలకు సంచలనమైన హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాయలసీమను రతనాల సీమ చేస్తామన్నారు. హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామన్నారు. రైతులను పాత పంటలబీమాతో ఆదుకుంటామన్నారు. ప్రతి ఎకరాకి నీరు అందిస్తామన్నారు.

CBN
CBN

పులివెందులలో తిరుగుబాటు కనిపిస్తోంది..జగన్ పతనం ఖాయమైంది: చంద్రబాబు

TDP Chief Chandrababu Naidu satires CM Jagan: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన 'సాగునీటి ప్రాజెక్టుల సందర్శన' పర్యటన వైయస్సార్ జిల్లా పులివెందులలో అట్టహాసంగా జరిగింది. పులివెందుల పూల అంగళ్లు సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభకు వేలాది మంది కార్యకర్తలు, ప్రజలు, యువత తరలిరావడంతో.. ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది. దీంతో బహిరంగ సభకు పోలీసులు అనుమతిని నిరాకరించారు. అయినా కూడా కార్యకర్తల కోరిక మేరకు చంద్రబాబు నాయుడు పూల అంగళ్ల సర్కిల్‌లో ఏర్పాటు చేసిన సభలో పాల్గొని.. ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోంది.. పులివెందుల బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..''పులివెందులకు గతంలో చాలాసార్లు వచ్చాను. ఇప్పుడూ పులివెందుల ప్రజల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. చేసిన పాపాలు ఎక్కడికీ పోవు..అవే శాపాలుగా మారతాయి. ఈ ప్రజలను చూసైనా తాడేపల్లిలో ఉన్న నేతలో మార్పు రావాలి. ఇక్కడి టీడీపీ నేతలు వై నాట్ పులివెందుల అంటున్నారు. రాయలసీమ ఆశాజ్యోతి.. ఎన్టీఆర్‌. రాయలసీమకు నీళ్లు ఇచ్చాకే చెన్నైకు వెళ్లాలని ఆనాడే ఎన్టీఆర్ చెప్పారు. ఎస్‌ఆర్‌బీసీ ప్రారంభించిన వ్యక్తి..ఎన్టీఆర్‌. నేను వచ్చాక ముచ్చుమర్రిలో లిఫ్ట్‌లు పూర్తి చేశాను. జీడిపల్లి నుంచి 2 టీఎంసీలు నీరు తెచ్చి పంటలు కాపాడాను. గండికోట ప్రాజెక్టుకు నీరు తెచ్చిన ఘనత మాదే. పైడిపాలెంకు నీరు తీసుకెళ్లాం. పులివెందులకు నీళ్లు తెచ్చిన ఘనత మాదే. పులివెందులలో టన్నెల్ అంటున్నారు.. ఇది మోసం కాదా..?. పట్టిసీమ నుంచి నీళ్లు తెచ్చి రాయలసీమకు నీళ్లు ఇచ్చాం. మేం దూరదృష్టితో నీళ్లు తేవడం వల్లే రైతులు బాగున్నారు'' అని ఆయన అన్నారు.

రాయలసీమను రతనాల సీమ చేస్తాం.. గోదావరి నుంచి బనకచర్లకు నీళ్లు తేవడమే తన జీవిత ఆశయమని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక గండికోటలో రాయల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. నల్లమలలో 32 కి.మీ. టన్నెల్‌ ద్వారా బనకచర్లకు నీరు ఇస్తామన్నారు. దాంతో బనకచర్ల ద్వారా రాయలసీమ అన్ని ప్రాంతాలకు నీళ్లు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాయలసీమను రతనాల సీమ చేస్తామని.. హార్టీకల్చర్ హబ్‌గా మారుస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. రాయలసీమలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలని తపించామని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టులకు నిధులు కేటాయించలేదని మండిపడ్డారు. పులివెందులకు హైవే వస్తుందంటే అందుకు కారణం తెలుగుదేశం పార్టీ ఘనతేనని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.

పాత పంటలబీమాతో.. రైతులను ఆదుకుంటాం.. రాష్ట్ర ప్రజలు, యువత వలస వెళ్లకూడదని తాను ఆలోచించానని.. పులివెందుల ప్రజల స్పందనను జగన్‌ చూడాలంటూ చంద్రబాబు నాయుడు హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టును జగన్ మోహన్ రెడ్డి నాశనం చేసి.. కేంద్రం ఇచ్చిన పోలవరాన్ని గోదావరిలో కలిపేశారని ఆగ్రహించారు. రాయలసీమలోని ప్రతి ఎకరానికీ నీరిచ్చే బాధ్యత తనదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. పులివెందుల రైతులను జగన్‌ మోహన్ రెడ్డి దారుణంగా మోసం చేశారన్నారు. పాత పంటల బీమా విధానం తెచ్చి.. రైతులను ఆదుకుంటామన్నారు. పులివెందులలో 90శాతం రాయితీపై మైక్రో ఇరిగేషన్ సామగ్రి ఇస్తామన్నారు. ప్రాజెక్టుల పేరుతో రూ.5 వేల కోట్లు దోచుకునేందుకు జగన్‌ యత్నం చేశారని చంద్రబాబు మండిపడ్డారు. నాసిరకం మద్యం తెచ్చి.. ప్రజల ప్రాణాలతో జగన్ మోహన్ రెడ్డి చెలగాటం ఆడుతున్నారన్నారు. మద్యం ధర ఎంత పెంచినా పరవాలేదని అనుకుంటున్నారన్న చంద్రబాబు.. తాను మాట్లాడితేనే పులివెందులలో బస్టాండు కట్టారని గుర్తు చేశారు. పులివెందులలో 8వేల ఇళ్లు అన్నారు కట్టారా తమ్ముళ్లు..? అంటూ ప్రశ్నించారు. పులివెందులలో ఫిష్ మార్ట్‌ అన్నారు.. వచ్చిందా..? అని అడిగారు.

కోడికత్తి డ్రామా ఆడే వ్యక్తి మనకు కావాలా..?.. రియల్ ఎస్టేట్ పేరుతో పులివెందుల ప్రజలను ముంచేస్తున్నారని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ వస్తుందని నమ్మకం ఉందా..? అంటూ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చాక పులివెందులకు పరిశ్రమలు తెచ్చి.. యువతకు ఉపాధి కల్పిస్తామన్నారు. టీడీపీ వచ్చాక కరెంట్ ఛార్జీలు తగ్గిస్తామన్నారు. జగన్ వచ్చాక నిత్యావసరాల ధరలు పెంచి, ప్రజల నడ్డి విరగ్గొట్టారని చంద్రబాబు గుర్తు చేశారు. ఇక, కోడికత్తి డ్రామా ఆడే వ్యక్తి మనకు కావాలా..? అని ఆయన ప్రశ్నించారు. మహాశక్తి కార్యక్రమం ద్వారా మహిళలను ఆదుకుంటామన్నారు. నిరుద్యోగ భృతి కింద యువతకు రూ.3 వేలు ఇస్తామన్నారు. టీడీపీ వచ్చాక ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీరు ఇవ్వడమే కాకుండా పులివెందుల, వేములకు పరిశ్రమలు తీసుకువస్తామన్నారు. వాలంటీర్లతో తప్పుడు పనులు చేయిస్తున్నారన్న చంద్రబాబు నాయుడు.. ప్రజల వ్యక్తిగత వివరాలు ఎందుకు సేకరిస్తున్నారు..? ప్రజల గోప్యతకు ప్రమాదకరంగా మారేవారిని వదిలిపెట్టామని హెచ్చరించారు.

''వైఎస్ మాట వివేకా ఎప్పుడూ వినేవారని అందరూ అనేవారు. బాబాయిపై గొడ్డలి వేటు వేసింది ఎవరు..?. వివేకా హత్య కేసులో అనేక నాటకాలు ఆడారు. తండ్రి హత్య కేసుపై సునీత పోరాటం చేస్తోంది. వివేకాను ఎవరు చంపారో మీ ఎంపీకి తెలియదా..?. ధర్మాన్ని మనం కాపాడితేనే అది మనల్ని కాపాడుతుంది. రేపటి ఎన్నికల్లో మీ శక్తి ఏమిటో పులివెందుల ప్రజలు చూపించాలి. పులివెందుల ప్రజలు మిమ్మల్ని వదిలిపెట్టరు. పులివెందుల ఆడబిడ్డ షర్మిలకు న్యాయం జరిగిందా..? సైకిల్‌కు ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ పోతాం. వై నాట్ పులివెందుల అని మిమ్మల్ని అడుగుతున్నా. పులివెందులలో బుల్లెట్ లాంటి బీటెక్ రవిని గెలిపించాలి. పులివెందులలో తెదేపా జెండా ఎగరాలి. పులివెందులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత నాది''-నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ అధినేత

Last Updated :Aug 3, 2023, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.