తెలంగాణ

telangana

'50ఏళ్ల పిల్లాడు రాహుల్.. బిన్​లాడెన్​లా గడ్డం పెంచితే ప్రధాని అవుతారా?'

By

Published : Jun 10, 2023, 3:55 PM IST

Samrat Chaudhary Bihar BJP : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి రాజకీయ అవగాహన లేదని బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి విమర్శించారు. ఆయన్ను 50 ఏళ్ల పిల్లాడిగా భావిస్తుంటామని చెప్పుకొచ్చారు. గడ్డం పెంచితే ప్రధాని అవుతారా అని ఎద్దేవా చేశారు.

Samrat Chaudhary rahul gandhi
Samrat Chaudhary rahul gandhi

Samrat Chaudhary Bihar BJP : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై బిహార్ బీజేపీ అధ్యక్షుడు సామ్రాట్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరారియాలో ఓ బహిరంగ సభలో ప్రసంగించిన ఆయన.. రాహుల్ గాంధీని, కరుడుగట్టిన ఉగ్రవాది ఒసామా బిన్​లాడెన్​తో పోల్చుతూ మాట్లాడారు. బిన్​లాడెన్​లా గడ్డం పెంచినంత మాత్రాన ప్రధాని కాలేరని విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ తనను తాను 50 ఏళ్ల పిల్లాడిలా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

"ఒసామా బిన్​లాడెన్​లా రాహుల్ గాంధీ గడ్డం పెంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీలా తాను కూడా మారిపోతానని అనుకుంటున్నారు. రాహుల్ గాంధీని మేం 50 ఏళ్ల పిల్లాడిగా భావిస్తాం. ఐదు పదుల వయసు వచ్చినా రాజకీయ అవగాహన లేనివారిని చిన్నపిల్లలనే అంటారు."
-సామ్రాట్ చౌదరి, బిహార్ బీజేపీ చీఫ్

సామ్రాట్ చౌదరి ప్రసంగం

ఎప్పుడూ క్లీన్ షేవ్​లో కనిపించే రాహుల్ గాంధీ.. భారత్ జోడో యాత్ర సందర్భంగా గడ్డం పెంచారు. యాత్రలో పూర్తిగా గుబురు గడ్డంతోనే కనిపించారు. హెయిర్ కట్, షేవింగ్ చేయకుండా యాత్ర కొనసాగించారు. ఓ తపస్సులా భావించి యాత్ర చేస్తున్నానని ఆయన చెప్పుకొచ్చారు. ఆ యాత్ర పూర్తైన తర్వాత తన ఆహార్యం మార్చుకున్నారు. గతంలోలా గడ్డాన్ని పూర్తిగా షేవ్ చేసుకోకుండా.. ట్రిమ్ చేశారు. అప్పటి నుంచి కొద్దిపాటి గడ్డంతో ఉంటున్నారు.

ఇటీవలి అమెరికా పర్యటనలో రాహుల్ గాంధీ
శ్రీనగర్​లో భారత్ జోడో యాత్ర సందర్భంగా గుబురు గడ్డంతో రాహుల్

'మూడు నెలలకో ప్రధాని'
మరోవైపు, దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా నిలబడేందుకు విపక్షాలను ఏకం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న బిహార్ సీఎం నీతీశ్ కుమార్​పైనా విమర్శలు గుప్పించారు సామ్రాట్. నీతీశ్ మానసిక పరిస్థితి సరిగా లేదని ఆరోపించారు. 'మహా కూటమిలోకి చాలా పార్టీలను నీతీశ్ కుమార్ ఆహ్వానిస్తున్నారు. అందులో చాలా మంది ప్రధానమంత్రి అభ్యర్థులు ఉన్నారు. ఒక్కరికి మూడు నెలల చొప్పున ప్రధాని బాధ్యతలు అప్పగిస్తారా? నీతీశ్ కుమార్ మానసిక పరిస్థితి సరిగా లేదు. ఆయన పరిస్థితి గజినీ సినిమాలో ఆమీర్ ఖాన్​లా మారిపోయింది' అని వ్యాఖ్యానించారు సామ్రాట్.

ఈ సందర్భంగా లవ్ జిహాద్ అంశాన్నీ ప్రస్తావించారు సామ్రాట్ చౌదరి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే లవ్ జిహాదీలపై చర్యలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. అందరినీ గుర్తించి వెంటనే జైళ్లలో వేస్తామని స్పష్టం చేశారు. గోవులను చంపేవారిని సైతం జైళ్లకు పంపుతామని తెలిపారు. బంగ్లాదేశ్ నుంచి వచ్చిన చొరబాటుదార్లను దేశం నుంచి బయటకు తరిమేస్తామని స్పష్టం చేశారు. బీజేపీ వల్లే లాలూ ప్రసాద్ యాదవ్, నీతీశ్ కుమార్ ముఖ్యమంత్రులు కాగలిగారని వ్యాఖ్యానించారు. మండల్ కమిషన్ సిఫార్సులు బీజేపీ వల్లే అమలయ్యాయని తెలిపారు.

'గతంలో మేడం ఏం చెబితే భారత ప్రధానిగా ఉన్న మన్మోహన్ సింగ్ అది మాట్లాడేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు మన ప్రధాని భారత్​లోనే కాదు.. విదేశాల్లోనూ మాట్లాడుతున్నారు. భారతీయుల నైతికస్థైర్యాన్ని పెంచుతున్నారు. బీజేపీ వల్లే వెనుకబడిన వర్గాలకు మేలు జరిగింది. కర్పూరీ ఠాకూర్ నుంచి లాలూ ప్రసాద్ యాదవ్ వరకు చాలా మంది బీజేపీ మద్దతుతోనే ముఖ్యమంత్రులు అయ్యారు. ఏడు ఎమ్మెల్యేలు ఉన్న నీతీశ్ కుమార్​ను ఐదుసార్లు బీజేపీయే ముఖ్యమంత్రిని చేసింది' అని సామ్రాట్ చౌదరి వ్యాఖ్యానించారు.

ABOUT THE AUTHOR

...view details