తెలంగాణ

telangana

పార్లమెంట్ సమావేశాలు సమాప్తం- పనితీరుపై వెంకయ్య అసంతృప్తి

By

Published : Dec 22, 2021, 11:06 AM IST

Updated : Dec 22, 2021, 2:13 PM IST

parliament-winter-session-live
parliament-winter-session-live

11:12 December 22

Parliament adjourned: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగిశాయి. అజెండాలో చాలా వరకు అంశాలు పూర్తయిన నేపథ్యంలో షెడ్యూల్​కు ఒకరోజు ముందుగానే ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి. సమావేశాలకు సంబంధించిన పేపర్లు, నివేదికలను సమర్పించిన అనంతరం.. రాజ్యసభను వాయిదా వేస్తున్నట్టు ఛైర్మన్ వెంకయ్య నాయుడు ప్రకటించారు. విపక్షాల నిరసనలతో అనుకున్నదాని కంటే సభ తక్కువ సమయం చేయడంపై వెంకయ్య తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనిపై సభ్యులంతా ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.

"ఈ సమావేశాలు మరింత ఉత్తమంగా నిర్వహించే అవకాశం ఉండేదేమోనని సభ్యులు ఆత్మపరిశీలన చేసుకోవాలి. దీనిపై నేను పెద్దగా మాట్లాడాలని అనుకోవడం లేదు. నిబంధనలను సభ్యులు సక్రమంగా పాటించాలి. సభామర్యాదను కాపాడాలి. తప్పు జరిగిన విషయాన్ని సభ్యులు గ్రహించాలి. దేశ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాత్మక, సానుకూల వాతావరణం కోసం మనమంతా కృషి చేయాలి."

-వెంకయ్య నాయుడు, రాజ్యసభ ఛైర్మన్

అంతకుముందు లోక్​సభ సైతం నిరవధికంగా వాయిదా పడింది. మొత్తంగా 18 రోజులు భేటీ అయిన లోక్​సభ.. 83 గంటల 12 నిమిషాల పాటు వివిధ అంశాలపై చర్చించింది. ఈ సమావేశాల్లో లోక్​సభ పనితీరు 82 శాతంగా నమోదైందని స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. విపక్షాల నిరసనలతో ఈ సమావేశాల్లో 18 గంటల 48 నిమిషాల సమయం వృథా అయిందని స్పష్టం చేశారు. డిసెంబర్ 2న సాధారణంతో పోలిస్తే 204 శాతం ఎక్కువగా పనిచేసిందని వెల్లడించారు. ఆరోజు కరోనాపై జరిగిన 12 గంటల 26 నిమిషాల సుదీర్ఘ చర్చలో 99 మంది ఎంపీలు పాల్గొన్నారని తెలిపారు. కరోనా సమయంలో చేసిన పనులను సభ్యులు వివరించారని చెప్పారు.

parliament winter session schedule

నవంబర్ 29న పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 23 వరకు ఇవి కొనసాగాల్సి ఉంది. అయితే కరోనా పరిస్థితులు, ఇతర అంశాల దృష్ట్యా ఒకరోజు ముందుగానే ముగించారు. ఈ సమావేశాలకు సోమవారం వరకు హాజరైన బీఎస్పీ ఎంపీ కున్వార్‌ డానిష్‌ అలీ మంగళవారం కరోనా బారిన పడ్డారు. ఇది కూడా సమావేశాల ముగింపునకు కారణమై ఉండొచ్చని తెలుస్తోంది. సాగు చట్టాల రద్దు, ఎన్నికల చట్టాల సవరణ సహా పలు కీలక బిల్లులకు ఈ సమావేశాల్లో పార్లమెంట్ ఆమోదం లభించింది.

వాయిదాల పర్వం

సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే రాజ్యసభలో 12 మంది విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడటం.. సభలో ఆందోళనలకు దారి తీసింది. ఎంపీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలంటూ ప్రతిరోజు ప్రతిపక్షాలు ఆందోళనకు దిగడం వల్ల సభలో నిరంతరం వాయిదాల పర్వం కొనసాగింది. లఖింపుర్ ఖేరి హింస, ధరల పెరుగుదల వంటి అంశాలపైనా విపక్ష పార్టీల ఎంపీలు నిరసనలు చేశారు. లోక్‌సభలోనూ దాదాపు అదే పరిస్థితి కన్పించింది. లఖింపుర్‌ ఖేరీ ఘటన, ఇతర అంశాలపై విపక్ష సభ్యులు పదేపదే ఆందోళనలు చేపట్టారు. వారి నిరసనల నడమే పలు బిల్లులు ఎలాంటి చర్చ లేకుండా ఆమోదం పొందాయి.

11:09 December 22

లోక్​సభ నిరవధికంగా వాయిదా పడింది.

11:00 December 22

పార్లమెంట్ లైవ్

పార్లమెంట్ సమావేశాలు నేటితో ముగియనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో సీనియర్ మంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు. వివిధ అంశాలతో పాటు పార్లమెంట్​లో ప్రభుత్వం అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు.

కేంద్ర మంత్రులు రాజ్​నాథ్ సింగ్, ప్రహ్లద్ జోషి, పీయూష్ గోయల్, కిరెన్ రిజిజు, అనురాగ్ సింగ్ ఠాకూర్, నితిన్ గడ్కరీలు.. మోదీ మీటింగ్​కు హాజరయ్యారు.

కావాలనే సస్పెన్షన్: ఖర్గే

మరోవైపు, ప్రభుత్వం కావాలనే 12 మంది ఎంపీలపై సస్పెన్షన్ విధించిందని రాజ్యసభలో విపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. బిల్లులను సులభంగా ఆమోదింపజేసుకునేందుకే ఇలా చేసిందని అన్నారు. సభ సజావుగా జరిగేందుకు సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరినా ప్రభుత్వం వినిపించుకోలేదని పేర్కొన్నారు.

Last Updated :Dec 22, 2021, 2:13 PM IST

ABOUT THE AUTHOR

...view details