తెలంగాణ

telangana

దిల్లీకి నితీశ్​.. ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా విస్తృత పర్యటన

By

Published : Sep 3, 2022, 7:51 PM IST

Nitish Kumar Opposition : బిహార్​ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్​ కుమార్​ ఈ నెల 5న దిల్లీలో పర్యటించనున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టడమే లక్ష్యంగా పెట్టుకున్న ఆయన.. వివిధ పార్టీలకు చెందిన కీలక నేతలను కలవనున్నారు.

nitish kumar manipur
nitish kumar manipur

Nitish Kumar Opposition : వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టేందుకు బిహార్‌ సీఎం, జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ రంగంలో దిగనున్నారు. ఈనెల 5న దిల్లీలో పర్యటించనున్న ఆయన.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సహా పలు రాజకీయ పార్టీలకు చెందిన ముఖ్య నేతలను కలవనున్నట్లు జేడీయూ వర్గాలు తెలిపాయి. దిల్లీ సీఎం కేజ్రీవాల్​తోపాటు వామపక్ష నేతలతో భేటీ కానున్నట్లు పేర్కొన్నాయి. ఇవాళ మొదలైన జేడీయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఆదివారం ముగియనున్నాయి. భాజపాకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలను కూడగట్టే బాధ్యతను ఈ సమావేశాల్లో నితీశ్‌కుమార్‌కు అప్పగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్షాల తరఫున ప్రధాని అభ్యర్థి రేసులో తాను లేనని నితీశ్‌కుమార్‌ పలుమార్లు స్పష్టంచేసినా.. బిహార్‌ సీఎంగా ఎక్కువకాలం పనిచేసిన అనుభవంతో జాతీయ రాజకీయాల్లో పాల్గొనాలనే డిమాండ్లు జేడీయూలో ఊపందుకున్నాయి

జేడీయూకు చెందిన మణిపుర్​ ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన నేపథ్యంలో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. అంతకుముందు ఐదుగురు ఎమ్మెల్యేలు భాజపాలో చేరారు. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో జేడీయూకు ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఐదుగురు భాజపా తీర్థం పుచ్చుకున్నారు. మూడింట రెండింట మంది ఎమ్మెల్యేలు భాజపాలో చేరిన నేపథ్యంలో.. జేడీయూ శాసనపక్షాన్ని.. భాజపాలో విలీనం చేస్తున్నట్లు ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శి కె. మేఘజిత్ సింగ్ ప్రకటించారు. వీరికి పార్టీ ఫిరాయింపులు చట్టం వర్తించదని అన్నారు.

ఈ ఘటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. తమ పార్టీ శాసనసభ్యులను భాజపాలో చేర్చుకోవడం రాజ్యాంగ విరుద్ధమని జేడీయూ ఆరోపించింది. ఈ ఏడాది మార్చిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ 38 స్థానాల్లో పోటీ చేసి.. ఆరు స్థానాల్లో విజయం సాధించింది. గెలిచిన వారిలో ఒక ఎమ్మెల్యే తప్ప మిగతావారందరూ భాజపాలో చేరారు. పార్టీ ఫిరాయించిన జేడీయూ ఎమ్మెల్యేల్లో కెహెచ్ జోయ్‌కిషన్, ఎన్ సనాతే, మహ్మద్ అచ్చబుద్దీన్, ఏఎం ఖౌటే, తంగ్జామ్ అరుణ్ కుమార్ ఉన్నారు.

ఇవీ చదవండి:గిరిజనుడిపై చిరుత దాడి.. పదునైన కత్తితో హతమార్చి..

దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. అంగన్​వాడీని కాన్వెంట్​లా తీర్చిదిద్ది..

ABOUT THE AUTHOR

...view details