తెలంగాణ

telangana

ఇద్దరు పోలీసులను కాల్చి చంపిన నక్సల్స్.. మరో కానిస్టేబుల్ గొంతు కోసి..

By

Published : Feb 20, 2023, 6:56 PM IST

ఛత్తీస్​గఢ్​లో పోలీసులపై నక్సల్స్ దురాగతాలు కొనసాగుతున్నాయి. రాజ్​నంద్​గావ్ జిల్లాలో ఇద్దరు పోలీసులను నక్సల్స్ కాల్చి చంపారు. బీజాపుర్​లో ఓ కానిస్టేబుల్​ను గొంతు కోసి హత్య చేశారు.

naxal attacks on police in chattisgarh
పోలీసులను హతమారుస్తున్న నక్సలైట్లు

ఛత్తీస్​గఢ్​లో నక్సలైట్లు చెలరేగిపోతున్నారు. అదను చూసుకొని పోలీసులపై దాడికి దిగుతున్నారు. తాజాగా నక్సలైట్ల కాల్పుల్లో ఇద్దరు పోలీసులు మృతి చెందారు. మహారాష్ట్రకు ఆనుకుని ఉన్న రాజ్​నంద్​గావ్ జిల్లాలోని బొర్తలావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య ఈ ఘటన జరిగింది. ఇద్దరు పోలీసులు బైక్​పై వెళుతుండగా నక్సల్స్ కాల్పులు జరిపారని రాజ్‌నంద్‌గావ్ ఎస్పీ అభిషేక్ మీనా తెలిపారు.

జిల్లా ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ రాజేశ్ సింగ్ రాజ్‌పుత్, ఛత్తీస్‌గఢ్ ఆర్మ్‌డ్ ఫోర్స్ కానిస్టేబుల్ అనిల్ కుమార్ సామ్రాట్ బొర్తలావ్ పోలీస్ క్యాంపు నుంచి మహారాష్ట్ర సరిహద్దు వైపు వెళ్తున్నారు. అయితే ఇద్దరి దగ్గర ఆయుధాలు లేవు. నక్సలైట్ల బృందం వారిపై కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో ఒకరు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు ఆస్పత్రికి తరలిస్తుండగా తుది శ్వాస విడిచారని అధికారులు తెలిపారు. అయితే నక్సలైట్లు పోలీసుల బైక్​లను కూడా తగలబెట్టారు.

పోలీసులను కాల్చి చంపిన నక్సలైట్లు
పోలీసుల బైక్​ను కాల్చేసిన నక్సలైట్లు

పెళ్లికి వెళ్లిన కానిస్టేబుల్​ను చంపేసిన నక్సలైట్లు
మరోవైపు, బీజాపుర్​ జిల్లాలో ఓ కానిస్టేబుల్​ను గొంతు కోసి చంపారు నక్సల్స్. మణిరామ్​ వెట్టి అనే కానిస్టేబుల్​.. ఓ వివాహ వేడుకకు హాజరు కాగా.. అక్కడే ఆయనపై దాడి చేసి హత్య చేశారు. దంతేవాడలోని పోలీస్​ స్టేషన్​లో మణిరామ్​ వెట్టి హెడ్ కానిస్టేబుల్​గా పని చేస్తున్నాడు. అయితే తమ బంధువుల పెళ్లి ఉందని 4 రోజులు సెలవు పెట్టాడు. దంతేవాడ జిల్లాకు ఆనుకుని ఉన్న భైరామ్‌గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బెల్చార్ గ్రామంలో వివాహానికి హాజరయ్యేందుకు మణిరామ్ వెట్టి వెళ్లినట్లు సీనియర్ అధికారి తెలిపారు.

అయితే వివాహ ప్రాంతం నక్సల్ ప్రభావం ఉన్న ఏరియా. మణిరామ్ నక్సల్ ప్రభావం ఉన్న ప్రాంతానికి పెళ్లికి వెళుతున్నట్లు ఎవ్వరికీ సమాచారం ఇవ్వకుండా కుటుంబ సమేతంగా వివాహానికి హాజరయ్యారని అధికారులు తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహ వేడుకలో అందరూ బిజీగా ఉన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి మణిరామ్​ వివాహ వేడుకలో ఉండగా దుండగులు అకస్మాతుగా పదునైన ఆయుధాలతో వచ్చారు. వెంటనే కానిస్టేబుల్​ గొంతు కోశారు. మణిరామ్ అక్కడికక్కడే మరణించాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకుని పోలీసు బృందం వెంటనే ఘటనా స్థలానికి చేరుకుంది. దుండగుల జాడ కోసం వెతుకుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details