ETV Bharat / bharat

మోదీ సభకు 'నో' పర్మిషన్​.. ఆ రాష్ట్ర సర్కార్ నిర్ణయంతో బీజేపీ షాక్

author img

By

Published : Feb 20, 2023, 1:10 PM IST

pm modi rally meghalaya
ప్రధాని నరేంద్ర మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీకి అనుమతిని నిరాకరించింది మేఘాలయ ప్రభుత్వం. ఈ క్రమంలో అధికార పార్టీపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పించారు. మేఘాలయలో కమలదళాన్ని ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. శాసనసభ ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేశారు.

మేఘాలయలో ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ర్యాలీకి అనుమతి నిరాకరించడంపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సొంత నియోజకవర్గమైన సౌత్ తురాలో పీఏ సంగ్మా స్టేడియంలో ప్రధాని నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న ర్యాలీ నిర్వహించాల్సి ఉంది. అయితే రాష్ట్ర క్రీడా శాఖ ఆ ర్యాలీకి అనుమతి ఇవ్వలేదు. ఈ నిర్ణయం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ ఘటనపై జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్ టెంబే స్పందించారు.

"పీఏ సంగ్మా స్టేడియంలో ఇంత పెద్ద ర్యాలీ నిర్వహించడం సరికాదు. స్టేడియంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. అలాగే అక్కడ మైదానంలో నిర్మాణానికి సంబంధించిన మెటీరియల్ ఉంది. అందుకు ప్రధాని మోదీ సభకు అనుమతివ్వలేదు. పత్యామ్నాయ వేదికగా అలోట్‌గ్రే క్రికెట్ స్టేడియం పరిశీలిస్తున్నాం.

-- స్వప్నిల్ టెంబే, జిల్లా ఎన్నికల అధికారి

మోదీ సభకు అనుమతి నిరాకరణను బీజేపీ తీవ్రంగా తప్పుబట్టింది. 'పీఏ సంగ్మా స్టేడియం ప్రారంభోత్సవం జరిగిన రెండు నెలల తర్వాత ప్రధానమంత్రి ర్యాలీకి స్టేడియం అందుబాటులో లేదని ఎలా చెబుతారు. కాన్రాడ్ సంగ్మా, ముకుల్ సంగ్మా బీజేపీని చూసి భయపడుతున్నారు. వారు మేఘాలయలో బీజేపీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మీరు ప్రధాని ర్యాలీని ఆపడానికి ప్రయత్నించవచ్చు.. కానీ మేఘాలయ ప్రజలు బీజేపీకి మద్దతు ఇచ్చేందుకు తమ మనసును మార్చుకున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఇతర బీజేపీ నేతల ర్యాలీలకు ప్రజల నుంచి వచ్చిన స్పందన చూసి ఇతర పార్టీలు భయపడుతున్నాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ(ఎన్​పీపీ), తృణమూల్ కాంగ్రెస్, ఇతర ప్రతిపక్షాలు బీజేపీని రాష్ట్రంలో ఎదగకుండా ఆపేందుకు ప్రయత్నిస్తున్నాయి.' అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రుత్​రాజ్​ సిన్హా విమర్శించారు.

'కచ్చితంగా అధికారంగా మాదే'
మేఘాలయలో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. ఈ సారి జరిగే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ(60) తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన అన్నారు. బంగాల్​ను టీఎంసీ అభివృద్ది చేయలేకపోయిందని, ఇక మేఘాలయను ఆ పార్టీ ఏం అభివృద్ధి పథంలో నడిపిస్తుందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు పాదయాత్రలో కనిపిస్తారని ఎన్నికల్లో సమయంలో కాదని అన్నారు. హిమంత బిశ్వ శర్మ షిల్లాంగ్​లో పార్టీ తరుఫున ప్రచారం చేస్తున్నారు.

మేఘాలయలో కచ్చితంగా ఈ సారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకుండా అడ్డుకునేందుకు ఎన్​పీపీతో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. కానీ ఇప్పడు పరిస్థితి మారింది. అందుకే ఎటువంటి పొత్తు లేకుండానే ఒంటరిగా బరిలోకి దిగుతున్నాం. బీజేపీ సమాజంలోని అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం ఇచ్చే పార్టీ. క్రైస్తవ వ్యతిరేక పార్టీ కాదు. ప్రధాని మోదీ.. పోప్​ను కలిసి భారత్​కు రావాలని ఆహ్వానించారు. అలాంటప్పుడు బీజేపీ క్రైస్తవులకు వ్యతిరేకం ఎలా అవుతుంది.

--హిమంతబిశ్వ శర్మ, అసోం ముఖ్యమంత్రి

మొత్తం 60 స్థానాలకు మేఘాలయలో ఫిబ్రవరి 27న ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 2న ఫలితాలు వెలువడతాయి. ఎన్​పీపీ, కాంగ్రెస్​, బీజేపీ ఒంటరిగా బరిలోకి దిగుతున్నాయి. టీఎంసీ, యూడీపీ ఇంకా పలు పార్టీలు ఎన్నికల బరిలో ఉన్నాయి. 2018 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కేవలం రెండు స్థానాల్లో గెలుపొందింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.