తెలంగాణ

telangana

రాహుల్​.. ముందు మీ పార్టీ సంగతి చూసుకోండి: మాయావతి

By

Published : Apr 10, 2022, 3:57 PM IST

Updated : Apr 10, 2022, 8:16 PM IST

Mayawati On Rahul Gandhi: రాహుల్​ గాంధీ.. ఇతర రాజకీయ పక్షాల గురించి కాకుండా తన సొంత పార్టీ గురించి ఆలోచించాలన్నారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఆయన వ్యాఖ్యలు కులతత్వాన్ని, ద్వేషపూరిత భావాన్ని ప్రతిబింబిస్తున్నాయని మండిపడ్డారు. యూపీ ఎన్నికల్లో పొత్తుల విషయమై రాహుల్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు మాయావతి.

mayawati on gandhi
mayawati vs rahul gandhi

Mayawati On Rahul Gandhi: కాంగ్రెస్​ అగ్రనేత రాహుల్​ గాంధీ తనపై చేసిన వ్యాఖ్యల్ని ఖండించారు బీఎస్పీ అధినేత్రి మాయావతి. ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్​ చేసిన పొత్తు ప్రతిపాదనను తానే తిరస్కరించానని చెప్పారు. ఇతర పార్టీల గురించి ఆందోళన చెందకుండా.. తన సొంత పార్టీ కోసం ఆలోచించాలని రాహుల్​కు చురకలు అంటించారు. ఆయన​ వ్యాఖ్యలు.. కులతత్వాన్ని, ద్వేషపూరిత భావాన్ని ప్రతిబింబిస్తున్నాయన్నారు. తమపై ఆరోపణలు చేసే ముందు రాహుల్​ ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు మాయావతి.

"రాహుల్ ​గాంధీ.. చెల్లాచెదురైన తన పార్టీని సరిగ్గా నిర్వహించలేక బీఎస్పీ పనితీరును విమర్శిస్తున్నారు. ఇది బీఎస్పీ పట్ల ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని స్పష్టంగా చూపిస్తుంది. రాహుల్​.. ఇతర పార్టీల సంగతి వదిలిపెట్టి మీ సొంత పార్టీ గురించి ఆలోచించండి. ఇది నా సలహా. 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్​ కలిసి పోటీచేశాయి. అయినా, భాజపాను అధికారంలోకి రాకుండా అడ్డుకోలేకపోయింది. దీనికి కాంగ్రెస్​ సమాధానం చెప్పాలి."

-మాయావతి, బీఎస్పీ అధినేత్రి

దళితులు, అణగారిన వర్గాల ఆర్థికి స్థితిగతుల్ని మెరుగుపరచడానికి.. కాంగ్రెస్​ ఎలాంటి చర్యలు తీసుకోలేదని మాయావతి ఆరోపించారు. కనీసం రిజర్వేషన్ ప్రయోజనాలను కూడా సరిగ్గా అందజేయలేదని విమర్శించారు. కాంగ్రెస్​ వైఖరి కారణంగానే.. అప్పటి ప్రభుత్వంలో న్యాయశాఖ మంత్రిగా ఉన్న అంబేడ్కర్​ తన పదవికి రాజీనామా చేశారని గుర్తు చేశారు.

రాహుల్​ గాంధీపై మాయవతి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లిఖార్జన్ ఖర్గే స్పందించారు. భాజపా వ్యతిరేక కూటమికి నాయకత్వం వహించాలని కాంగ్రెస్ ఆహ్వానించగా.. ఆమె ఒప్పుకోలేదని, అదే విషయాన్ని రాహుల్​ అన్నారని చెప్పారు. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని.. ప్రతిపక్షాలన్నీ కలిసి ఏకమై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతిపక్ష కూటమిలో బీఎస్పీ ఉంటుందా అన్న ప్రశ్నకు.. ఇప్పుడు మాట్లాడి ప్రయోజనం లేదని.. సమయం వచ్చినప్పుడు చూస్తామని బదులిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజలతో మమేకమై ఉంటుందని.. పార్లమెంట్ లోపల, బయట అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు ఖర్గే.

ఉత్తర్​ప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​.. బీఎస్పీ కలిసి పోటీ చేస్తే మాయావతికి ముఖ్యమంత్రి పదవి ఇస్తామనుకున్నట్లు చెప్పారు రాహుల్​ గాంధీ. ​అయితే, ఆమె దీనిపై స్పందించలేదని తెలిపారు. శనివారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇదీ చదవండి:Rahul Gandhi: 'అధికారంలోనే పుట్టాను.. దానిపై ఆసక్తి లేదు'

Last Updated : Apr 10, 2022, 8:16 PM IST

ABOUT THE AUTHOR

...view details