తెలంగాణ

telangana

కర్ణాటక బాంబు దాడి కేసులో.. అంతర్జాతీయ ఉగ్రసంస్థల హస్తం!

By

Published : Nov 21, 2022, 4:41 PM IST

Mangaluru autorickshaw blast case
మంగళూరు బాంబు దాడి ()

మంగళూరు ఆటోరిక్షాలో పేలుడు వెనక.. అంతర్జాతీయ ఉగ్రసంస్థ ప్రభావం ఉందని కర్ణాటక పోలీసులు గుర్తించారు. మంగళూరు, మైసూరు, శివమొగ్గల్లో.. విధ్వంసానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. ఆటో పేలుడులో గాయపడిన మహమ్మద్‌ షరీఖ్‌.. సూత్రధారి అని వివరించారు. దేశంలో ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్ర సంస్థ స్థావరం ఏర్పాటు చేసేందుకు.. షరీఖ్‌ ప్రయత్నిస్తున్నాడని వెల్లడించారు. అతడు కోలుకుంటే.. మరిన్ని వివరాలు బయటకొచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

మంగళూరు శివారులో ఆటోలో పేలిన ప్రెజర్‌కుక్కర్ బాంబు వెనక.... ఉగ్రమూకల కుట్ర బహిర్గతమైంది. ఐఎస్​ఐఎస్​ ఉగ్రవాద సంస్థతో ప్రభావితమైన మహమ్మద్‌షరీఖ్‌.. కర్ణాటకలో పలు చోట్ల పేలుళ్లకు కుట్ర పన్నినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ప్రమాదవశాత్తూ బాంబు పేలడంతో తీవ్రంగా గాయపడిన షరీఖ్‌.. ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతడి వద్ద ఉన్న ఆధార్ కార్డు.. నకిలీదని గుర్తించిన పోలీసులు.. మైసూరులో అతడు అద్దెకు ఉంటున్న ఇంటిలో తనిఖీలు చేయగా.. కుట్ర కోణం వెలుగుచూసింది. అతడి నివాసంలో బాంబు తయారీకి అవసరమైన.. సల్ఫర్‌, పాస్ఫరస్‌, బ్యాటరీలు, సర్క్యూట్, నట్టులు, బోల్టులు, ఇతర సామాగ్రిని గుర్తించినట్లు.. కర్ణాటక అదనపు డీజీపీ అలోక్‌ కుమార్‌ వెల్లడించారు. నకిలీ ఆధార్‌కార్డుతో వేరే పేరు చెప్పి ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు వివరించారు.

ఉగ్రదాడికి పాల్పడిన మహమ్మద్‌ షరీఖ్‌
మహమ్మద్‌ షరీఖ్‌ ఇంట్లో దొరికిన బాంబు తయారీకి అవసరమైన సామగ్రి

యాప్​లో చూసి బాంబు తయారి..
24ఏళ్ల షరీఖ్‌ శివమొగ్గ జిల్లా తిర్థనహల్లికి చెందినవాడని.. పోలీసులు గుర్తించారు. దేశంలో ఐఎస్​ఐఎస్​ ఉగ్రసంస్థ స్థావరం ఏర్పాటు సహా భారత్‌లో ఖలీఫా రాజ్యం తేవాలనేది షరీఖ్‌ లక్ష్యమని పోలీసులు వివరించారు. ఒక యాప్‌ద్వారా సిరియాలోని ఐఎస్​ ఉగ్రసంస్థతో.. షరీఖ్‌కు సంబంధాలు ఏర్పడ్డాయని దర్యాప్తులో గుర్తించారు. బాంబు ఎలా తయారు చేయాలో ఆ యాప్‌ద్వారా షరీఖ్‌కు ఒక పీడీఎఫ్ అందిందని తేల్చారు. అలా తయారు చేసిన బాంబులను తుంగ నదీ తీరాన పరీక్షించినట్లు పోలీసులు కనిపెట్టారు. మైసూరు నుంచి.. ఆటోలో ప్రెజర్‌కుక్కర్ బాంబు తీసుకుని వస్తుండగా మంగళూరు శివారులో.. అది పేలిపోయిందని చెప్పారు. పేలుడులో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న అతడు.. ప్రస్తుతం మాట్లాడే స్థితిలో లేడని, కుటుంబ సభ్యులు.. అతడిని గుర్తుపట్టారని పోలీసులు వివరించారు.

మహమ్మద్‌ షరీఖ్‌ ఇంట్లో దొరికిన బాంబు తయారీకి అవసరమైన సామాగ్రి

షరీఖ్‌పై ఇప్పటికే అనేక కేసులు..
మంగళూరు, శివమొగ్గ, మైసూరు, తీర్థనహల్లి సహా ఏడు ప్రాంతాల్లో.. సోదాలు చేసిన పోలీసులు.. షరీఖ్‌పై అసాంఘిక కార్యకాలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. షరీఖ్‌పై ఇప్పటికే అనేక కేసులు ఉన్నట్లు.. అదనపు డీజీపీ అలోక్ కుమార్‌ చెప్పారు. శివమొగ్గ, మంగళూరు, మైసూరుల్లో పేలుళ్లకు.. షరీఖ్‌ కుట్ర పన్నినట్లు వివరించారు. షరీఖ్‌ను బెంగళూరులోని సుద్దగుంటెపాల్యాకు చెందిన అబ్దుల్ మతీన్‌తాహా వెనకుండి నడిపిస్తున్నట్లు చెప్పారు. తాహాపై ఐదులక్షల రివార్డు కూడా ఉందని.. పోలీసులు వివరించారు.

షరీఖ్‌కు కర్ణాటక వెలుపల నుంచి సహకరిస్తున్నవారి వివరాలను.. తెలుసుకునేందుకు పోలీసులు నిమగ్నమయ్యారు. జాతీయ దర్యాప్తు సంస్థతో కలిసి ఉగ్ర కుట్రను చేధించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు వివరించారు. శివమొగ్గ అల్లర్ల తర్వాత పారిపోయిన షరీఖ్‌కు ఎవరు ఆశ్రయమిస్తున్నారో తెలుసుకునేందుకు.. ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. నిందితుడు కోలుకుంటే.. మరిన్ని కుట్రలు వెలుగుచూసే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details