1999 తుపాను సమయంలో మిస్సింగ్.. 23 ఏళ్ల తర్వాత ఇంటికి చేరిన వృద్ధుడు

author img

By

Published : Nov 21, 2022, 11:26 AM IST

cyclone

23 ఏళ్ల క్రితం తప్పిపోయిన ఓ వృద్ధుడు ఇన్నాళ్లకు తన కుటుంబాన్ని చేరుకున్నాడు. ఈ ఘటన ఒడిశాలో జరిగింది. అసలేమైందంటే?

ఒడిశాకు చెందిన కృతిచంద్ర బరాల్‌(80) అనే వృద్ధుడు 23 ఏళ్ల క్రితం తప్పిపోయి.. ఇన్నాళ్లకు తన కుటుంబాన్ని చేరుకున్నాడు. 1999లో ఒడిశా తీరాన్ని తాకిన సైక్లోన్ కారణంగా పది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ తుపానులో చిక్కకున్న కృతిచంద్ర బరాల్ మతిస్థిమితాన్ని కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం ఓడరేవుకు చేరుకున్నాడు. అక్కడే ఫుట్​పాత్​పై జీవనం సాగించడం మొదలుపెట్టాడు. గ్రేటర్ విశాఖ కార్పొరేటర్ ఏజే స్టాలిన్ అనే వ్యక్తి.. వృద్ధుడి పరిస్థితిని గమనించారు. వృద్ధుడిని చూసి జాలిపడి రోజూ కారులో వచ్చి ఫుడ్ ప్యాకెట్స్ అందించేవారు. కారు హారన్ చేయగానే ఆ వృద్ధుడు ఫుట్​పాత్​పై ఏ మూల ఉన్నా, అక్కడికి వచ్చి ఆహారాన్ని తీసుకునేవాడు. చాలా సంవత్సరాలపాటు ఇలానే కొనసాగింది.

ఎప్పటిలానే ఓరోజు కార్పొరేటర్ వృద్ధుడి కోసం ఆహారాన్ని తీసుకుని వచ్చాడు. అయితే ఈసారి ఎన్నిసార్లు కారు హారన్​ కొట్టినా, ఆ వృద్ధుడు మాత్రం రాలేదు. వృద్ధుడి కోసం కార్పొరేటర్ వెతికి అనారోగ్యంతో ఉన్నాడని తెలుసుకున్నాడు. ఆ తర్వాత స్టాలిన్, మిషనరీస్ ఆఫ్ ఛారిటీ (ఎంఓసీ)ని సంప్రదించి, కృతిచంద్రను జాగ్రత్తగా చూసుకోమని అభ్యర్థించాడు. పోలీసు క్లియరెన్స్ తర్వాత ఎంఓసీ, కృతిచంద్ర బాధ్యతలను స్వీకరించింది. క్రమంగా అతని ఆరోగ్య పరిస్థితి మెరుగుపడటం ప్రారంభించింది. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, అతనికి గతం మాత్రం గుర్తుకురాలేదు. కృతిచంద్ర అప్పుడప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం అనే పదాన్ని పదేపదే అంటుండేవాడు. ఇది చూసి వృద్ధుడిని ఎంఓసీ శ్రీకాకుళం సమీపంలోని కేంద్రానికి తరలించారు. మిషనరీలతో గ్రామాలకు వెళ్లేటప్పుడు ఆయనను వెంట తీసుకెళ్లేవారు. అక్కడ ఎవరైనా అతన్ని గుర్తిస్తారనుకున్నారు. కానీ అలా జరగలేదు.

ఈ పరిస్థితుల్లో బంగాల్ రేడియో క్లబ్ (డబ్ల్యూబీఆర్​సీ) కృతిచంద్ర కుటుంబం ఆచూకీని కనుగొనేందుకు ప్రయత్నించింది. "ఆ వృద్ధుడి కుటుంబాన్ని కనుగొనేందుకు మా నెట్‌వర్క్‌ ద్వారా విస్తృతమైన పరిశోధన చేశాం. మా బృందం చివరకు కృతిచంద్ర బరాల్ కుటుంబాన్ని పాటిగ్రామ్, బమ్నాల, పూరిలో గుర్తించింది. బరాల్‌కు ముగ్గురు కుమారులు ఉన్నారు. వారిలో ఒకరికి కంటి చూపు పోయింది. మరో ఇద్దరు తమ తండ్రిని చూసి ఆశ్చర్యపోయారు. ఏడవటం ప్రారంభించారు. తమది సంపన్న కుటుంబమని, తుఫాను తర్వాత తమ తండ్రి ఎలా తప్పిపోయారో చెప్పారు. ఎంత వెతికినా దొరక్కపోవడం వల్ల మృతి చెంది ఉంటాడని అనుకున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు" అని అంబ్రిష్ నాగ్ వివరించారు. బరాల్ కుమారులు ఒడిశాలోని బ్రహ్మపుర్‌లో ఉన్న ఎంఓసీ కేంద్రానికి చేరుకున్నారు. అవసరమైన ఫార్మాలిటీస్​ను పూర్తిచేసి ఆ వృద్ధుడిని ఇంటికి పంపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.