తెలంగాణ

telangana

లైకా ప్రొడక్షన్స్​పై ఈడీ నజర్.. మనీలాండరింగ్ కేసులో సోదాలు

By

Published : May 16, 2023, 12:06 PM IST

Updated : May 16, 2023, 1:03 PM IST

lyca productions raid

Lyca productions raid : సినీ నిర్మాణ కంపెనీ 'లైకా ప్రొడక్షన్స్​'పై ఈడీ దాడులు చేస్తోంది. మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో సోదాలు జరుపుతోంది. మరోవైపు, ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణం కేసులో ఆర్జేడీ నేత కిరణ్ దేవి, రాజ్యసభ సభ్యుడు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన స్థలాల్లో సీబీఐ సోదాలు నిర్వహించింది.

Lyca productions raid : తమిళనాడుకు చెందిన ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్​పై ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ దాడులు చేపట్టింది. కంపెనీకి చెందిన స్థలాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని త్యాగరాజనగర్​, అడయార్, కారపక్కం సహా 8 ప్రాంతాల్లో సోదాలు చేపట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మనీలాండరింగ్​కు సంబంధించిన కేసులో సోదాలు చేపట్టిన్నట్లు సమాచారం. లైకా సీఈఓ తమిళకుమారన్ ఇంట్లోనూ ఈడీ సోదాలు నిర్వహించింది. చెన్నైలోని ఎంఆర్​సీ నగర్​లో ఉన్న సత్యదేవ్ అవెన్యూలోని తమిళకుమారన్ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. సోదాల్లో స్వాధీనం చేసుకున్న ఆధారాలను బట్టి దర్యాప్తు చేయనున్నట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. సోదాలపై లైకా నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

లైకా సంస్థ నిర్మించిన 'పొన్నియిన్ సెల్వన్' సిరీస్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ఆ సిరీస్​లో వచ్చిన రెండు చిత్రాలు భారీగా కలెక్షన్లు కొల్లగొట్టాయి. దీనిపైనే ఈడీ అధికారులు ప్రధానంగా పరిశీలన చేపట్టినట్లు సమాచారం. నటీనటులకు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చారు? అందులో ఏదైనా అక్రమ నగదు రవాణా జరిగిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిసింది. ఇందుకు సంబంధించి పత్రాలు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

లైకా సంస్థ ఈ మధ్య కాలంలో భారీ తారాగణంతోనే చిత్రాలు తెరకెక్కిస్తోంది. పెద్ద నటులతో హై బడ్జెట్ సినిమాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో గతంలో ఈ ప్రొడక్షన్ హౌస్​కు వచ్చిన ఆదాయం గురించీ ఈడీ ఆరా తీస్తోంది. భారత్​ నుంచి విదేశాలకు జరిగిన లావాదేవీలపై కన్నేసింది. విదేశాల్లో ఆస్తుల అమ్మకాలు సైతం జరిగినట్లు సమాచారం.

స్టార్ నటులు, హైబడ్జెట్ చిత్రాలు
ఇటీవల బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిన పొన్నియిన్ సెల్వన్ 1, 2 చిత్రాలను లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది. వీటితో పాటు కత్తి, రోబో 2.0, దర్బార్ చిత్రాలు సైతం ఈ సంస్థ నుంచి వచ్చాయి. కమల్ హాసన్ నటిస్తున్న ఇండియన్-2, రజినీకాంత్ నటిస్తున్న లాల్ సలామ్ చిత్రాలను లైకానే నిర్మిస్తోంది.

ఎంపీ స్థలాల్లో సీబీఐ సోదాలు
Land for job scam case : మరోవైపు, ల్యాండ్‌ ఫర్‌ జాబ్‌ కుంభకోణంలో ఆర్జేడీ నేత కిరణ్ దేవి, రాజ్యసభ సభ్యుడు ప్రేమ్ చంద్ గుప్తాకు చెందిన పలు రాష్ట్రాల్లోని తొమ్మిది చోట్ల సీబీఐ సోదాలు నిర్వహించింది. ఈ కుంభకోణంలో ఈ ఇద్దరు నేతల పాత్ర ఉన్నట్లు తేలిన నేపథ్యంలో.. సోదాలు నిర్వహించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. బిహార్‌, దిల్లీ, హరియాణా, ఉత్తరప్రదేశ్‌లోని ఈ ఇద్దరు నేతలకు సంబంధించిన పలు ప్రాంతాల్లో సోదాలు చేశారు.

Land for job scam in Bihar : యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా ఉన్న ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌.. రైల్వే ఉద్యోగాలకు నియామక ప్రక్రియలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. కొందరు అభ్యర్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు వారి నుంచి భూములు, ఇతర ఆస్తులను లంచంగా తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై సీబీఐ గతంలో కేసు నమోదు చేసింది.

Last Updated :May 16, 2023, 1:03 PM IST

ABOUT THE AUTHOR

...view details