'సీఎం పదవి రాకున్నా వెన్నుపోటు పొడవను.. నా నెక్ట్స్ టార్గెట్ అదే'

author img

By

Published : May 16, 2023, 11:48 AM IST

Updated : May 16, 2023, 12:41 PM IST

congress-leader-d-k-shivakumar-leaves-for-delhi-for-discussions-on-karnataka-govt-formation

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు మంగళవారమే తెరపడనుంది. 18వ తేదీన కన్నడ నాట నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ముఖ్యమంత్రిని ఇవాళ ప్రకటించాలని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్‌ అధిష్టానంతో చర్చల కోసం.. మాజీ సీఎం సిద్ధరామయ్య ఇప్పటికే దిల్లీ చేరుకోగా.. కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు D.K. శివకుమార్‌ కూడా దేశ రాజధానికి పయనమయ్యారు. దిల్లీ వెళ్లేముందు శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోయినా... వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్‌మెయిల్‌ రాజకీయాలు చేయబోనని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో నూతన ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ఎంపిక ఖాయమనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే విషయంలో మంగళవారమే స్పష్టత రానుంది. సీఎల్పీ సమావేశం నిర్వహించి ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించిన పరిశీలకుల బృందం ఆ నివేదికను అధిష్టానానికి సమర్పించింది. ఈ నేపథ్యంలో మంగళవారం కీలక భేటీ జరగనుంది. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న సిద్ధరామయ్య.. డీకే శివకుమార్‌.. కాంగ్రెస్‌ అధిష్టానం, కేంద్ర పరిశీలకులతో సమావేశం కానున్నారు. ఇప్పటికే సిద్ధరామయ్య దిల్లీ చేరుకోగా డీకే శివకుమార్‌ దిల్లీకి బయలుదేరారు. సోమవారమే శివకుమార్‌ దిల్లీ వెళ్లాల్సి ఉండగా.. కడుపులో ఇన్‌ఫెక్షన్‌ కారణంగా ఆయన వెళ్లలేకపోయారు.

మంగళవారం ఉదయం దీనిపై స్పందించిన డీకే శివకుమార్ తన ఆరోగ్యం బాగానే ఉందని.. దిల్లీ వెళ్లి నేతలతో సమావేశమవుతానని.. ప్రకటించారు. ఈనెల 18వ తేదీన కన్నడ నాట నూతన ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో ఇవాళ దిల్లీలో జరిగే కీలక భేటీలో.. ముఖ్యమంత్రిని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది. సోనియా గాంధీ, రాహుల్‌, ప్రియాంకలను సంప్రదించిన తర్వాత కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.. కర్ణాటక సీఎం ఎవరో ప్రకటించనున్నారు. రాబోయే 24 గంటల్లో సీఎంను ప్రకటిస్తామని కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

'వెన్నుపోటు పొడవను'
దిల్లీ బయలుదేరేముందు కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబమని.. గెలిచిన 135 మంది ఎమ్మెల్యేలు అందులో సభ్యులని అందులో ఎవరినీ విభజించడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. తాను బాధ్యతగల మనిషినన్న శివకుమార్‌.. వెన్నుపోటు పొడవబోనని, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేయనని స్పష్టం చేశారు. తనను ఒంటరిగా దిల్లీ రావాలని అదిష్టానం చెప్పిందని పేర్కొన్న శివకుమార్‌.. ఒంటరిగానే దిల్లీ బయలుదేరారు. ఇక తాను మాట్లాడటానికి ఏమీ లేదన్న ఆయన.. ఎలాంటి నిర్ణయం వచ్చినా ఎమ్మెల్యేలంతా కలిసే పని చేస్తామని స్పష్టం చేశారు. దాంతో పాటు "కాంగ్రెస్​ పార్టీయే నా దైవం, దేవాలయం. పార్టీ నాకు అమ్మ లాంటింది. కుమారుడికి ఏం ఇవ్వాలో తల్లికి తెలుసు. నేను దైవాన్ని కలిసేందుకు గుడికి వెళుతున్నాను. దిల్లీకి ఒంటరిగానే బయలుదేరుతున్నాను" అని డీకే శివకుమార్​ అన్నారు.

"లోక్‌సభ ఎన్నికల్లో 18 నుంచి 20 సీట్లు గెలవడం మా తదుపరి సవాల్‌. ఎలాంటి బాధ్యతలు అప్పగించాలి అన్నది పార్టీ నిర్ణయం. ఆ విషయంలో నాకు దిగులు ఎందుకు? నేను అర్హుడిని అని భావిస్తే పార్టీ ఇస్తుంది. నాకు మద్దతుగా ఉన్నా లేకున్నా నేను ఎమ్మెల్యేలను విభజించను. మాది ఒక ఉమ్మడి కుటుంబం. అందులో 135 మందికిపైగా సభ్యులు ఉన్నారు. వారు నన్ను ఇష్టపడినా... ఇష్టపడకపోయినా అందులో ఎవరినీ నేను విభజించను. నేను పార్టీ అధ్యక్షుడిని. నేను బాధ్యతగల వ్యక్తిని. నేను అందరినీ సమానంగా చూస్తాను. అలా చూడటమే కాంగ్రెస్‌ పార్టీ మూల సిద్ధాంతం. మా పార్టీ నిర్ణయాన్ని నేను ఎందుకు ధిక్కరిస్తాను. నేను వెన్నుపోటు పొడవను. బ్లాక్‌ మెయిల్‌ రాజకీయాలు చేయను."
-డీకే శివకుమార్‌, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు

డీకే శివకుమార్‌ వ్యాఖ్యలతో.. కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా మరోసారి సిద్ధరామయ్యకే అవకాశం దక్కనుందని ఊహాగానాలు చెలరేగుతున్నాయి. సిద్ధరామయ్యకు సీఎం పదవి ఇస్తే డీకే శివకుమార్‌కు ఎలాంటి ప్రాధాన్యం ఇస్తారన్న దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. డీకే శివకుమార్ సోదరుడు డీకే సురేష్.. దిల్లీలో మల్లికార్జున ఖర్గేను ఆయన నివాసంలో కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. దిల్లీకి వచ్చినప్పుడల్లా ఖర్గేను కలుస్తానని ఈసారి అలాగే కలిశానని డీకే సురేష్‌ తెలిపారు. కర్ణాటక శాసనసభలో మొత్తం 224 స్థానాలు ఉండగా.. కాంగ్రెస్‌ పార్టీ 135 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా హస్తం పార్టీకి మద్దతు తెలిపారు.

Last Updated :May 16, 2023, 12:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.