తెలంగాణ

telangana

ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకున్న 8 నెలల చిన్నారి.. కరెంట్ షాక్​తో మృతి.. అక్క పుట్టిన రోజునే..

By

Published : Aug 2, 2023, 6:30 PM IST

Karnataka Phone charger shock death : మొబైల్ ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకున్న చిన్నారి.. కరెంట్ షాక్​కు గురై ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగింది. ఇదే రాష్ట్రంలో కలుషిత నీరు తాగి ఇద్దరు మరణించారు.

phone charger shock death
phone charger shock death

Karnataka Phone charger shock death : మొబైల్ ఛార్జర్ పిన్​ను నోట్లో పెట్టుకున్న సమయంలో కరెంట్ షాక్ కొట్టి ఎనిమిది నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలో బుధవారం జరిగింది. కర్వార్ తాలుకా సిద్ధార్ ప్రాంతంలో నివసించే సంతోష్ కల్గుట్కర్, సంజనా కల్గుట్కర్​ దంపతుల ఎనిమిది నెలల కుమార్తె.. బుధవారం ఛార్జర్ పిన్​తో ఆడుకుంది. పిన్​ను నోట్లో పెట్టుకుంది. మొబైల్ ఛార్జర్.. సాకెట్​కే ఉండటం, దాని స్విచ్ ఆఫ్ చేయకపోవడం వల్ల అందులో నుంచి కరెంట్ పాస్ అయింది. దీంతో కరెంట్ షాక్​కు గురై చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. చిన్నారిని తల్లిదండ్రులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు ధ్రువీకరించారు.

కుప్పకూలిన తండ్రి!
బాలిక తండ్రి సంతోష్ కల్గుట్కర్.. హుబ్బళ్లి విద్యుత్ సరఫరా కంపెనీ (హెస్కామ్)లో కాంట్రాక్ట్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. చిన్నారి మరణ వార్త తెలియగానే అతడు కుప్పకూలిపోయాడు. అతడిని కుటుంబ సభ్యులు ప్రైమరీ హెల్త్ సెంటర్​కు తీసుకెళ్లారు. అతడు అనారోగ్యానికి గురయ్యాయడని వైద్యులు తెలిపారు.

మృతి చెందిన చిన్నారి పేరు సంధ్య అని పోలీసులు తెలిపారు. సంతోష్ కల్గుట్కర్, సంజనా కల్గుట్కర్​కు మొత్తం ముగ్గురు సంతానం అని వెల్లడించారు. సంధ్య మూడో కుమార్తె అని తెలిపారు. బుధవారం మరో కుమార్తె పుట్టిన రోజని వివరించారు. 'కుమార్తె పుట్టిన రోజు కాబట్టి అంతా సంతోషంగా ఉన్నారు. ఆ లోపే ఈ విషాద ఘటన జరిగింది' అని పోలీసులు వివరించారు. దీనిపై స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్​లో కేసు నమోదైందని తెలిపారు.

కలుషిత నీరు తాగి..
ఇదే రాష్ట్రంలోని చిత్రదుర్గ జిల్లాలో కలుషిత నీరు తాగి ఇద్దరు మరణించారు. 60 మంది అస్వస్థతకు గురయ్యారు. నీటిలో విష పదార్థాలు కలిశాయన్న ఆరోపణలపైనా అధికారులు విచారణ జరుపుతున్నారు. 'కావడిగరహట్టి గ్రామంలో చాలా మంది ఆస్పత్రిలో చేరుతున్నారని సోమవారం సాయంత్రం సమాచారం అందింది. వాంతులు, డయేరియా లక్షణాలు వీరిలో కనిపించాయి. వెంటనే సిటీ మున్సిపాలిటీ ఆ ప్రాంతానికి నీటి సరఫరా నిలిపివేసింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. నీరు కలుషితం కావడం వల్లే ఇలా జరిగిందని గ్రామంలోని ప్రజలు ఆరోపిస్తున్నారు' అని అధికారులు వివరించారు. కొద్ది రోజులుగా వాటర్ ట్యాంకులను మున్సిపల్ సిబ్బంది శుభ్రం చేయలేదని స్థానికులు ఆరోపిస్తున్నారని పోలీసులు తెలిపారు. నీరు సరఫరా చేసే వ్యక్తి కావాలనే విష పదార్థాలు నీటిలో కలిపాడా అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details