తెలంగాణ

telangana

ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు! పోలీసులు హైఅలర్ట్- RBIని పేల్చేస్తామని బెదిరింపులు

By ETV Bharat Telugu Team

Published : Dec 26, 2023, 10:13 PM IST

Israel Embassy Delhi Blast : ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు శబ్దం వినిపించడం కలకలం సృష్టించింది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదని చెప్పారు. మరోవైపు, ముంబయిలో 11 చోట్ల బాంబులు పెట్టినట్లు ఆర్​బీఐకి బెదిరింపు మెయిల్ వచ్చింది.

Israel Embassy Delhi Blast
Israel Embassy Delhi Blast

Israel Embassy Delhi Blast :దిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద పేలుడు సంభవించడం కలకలం రేపింది. మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో ఇజ్రాయెల్ రాయబార కార్యాలయానికి సమీపంలో పేలుడు శబ్దం వినిపించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. వెంటనే రంగంలోకి దిగిన దిల్లీ పోలీసులు తనిఖీలు చేపట్టారు. పేలుడు పదార్థాల జాడ కోసం అన్వేషించారు. గంటల పాటు తనిఖీల అనంతరం పేలుడు పదార్థాలు లభించలేదని పోలీసులు వెల్లడించారు. అయితే, సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని స్పష్టం చేశారు.

రాయబార కార్యాలయానికి వెనక ఉన్న గార్డెన్​లో పేలుడు సంభవించినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఆ ప్రాంతానికి సమీపంలో టైప్ చేసిన లేఖ కనిపించిందని చెప్పారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం అడ్రెస్​తో ఈ లేఖ ఉందని వెల్లడించారు. లేఖ ప్రామాణికతను నిర్ధరించే ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.

"రాయబార కార్యాలయం వెనక పేలుడు సంభవించినట్లు సాయంత్రం 5.45 గంటల సమయంలో మాకు కాల్ వచ్చింది. అగ్నిమాపక శాఖ వెంటనే అక్కడికి రెండు ఫైర్ ఇంజిన్లను పంపించింది. పోలీసులు, అగ్నిమాపక శాఖ అధికారులు ఘటనాస్థలిలో ఉన్నారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది."
- దిల్లీ పోలీసు వర్గాలు

గాజాలో హమాస్​తో ఇజ్రాయెల్ యుద్ధం చేస్తున్న చేస్తున్న నేపథ్యంలో తాజా ఘటన జరగడం గమనార్హం. ఈ ఘటనపై డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్(ఇజ్రాయెల్) ఒహాద్ నకాశ్ కాయ్నార్ స్పందించారు. కార్యాలయంలోని దౌత్యవేత్తలు, ఉద్యోగులు సురక్షితంగానే ఉన్నట్లు స్పష్టం చేశారు. తమ సెక్యూరిటీ బృందాలు దిల్లీ పోలీసులతో సమన్వయంతో పనిచేస్తున్నాయని చెప్పారు.

పేలుడు శబ్దాన్ని తాను విన్నానని సమీపంలో డ్యూటీలో ఉన్న ఓ గార్డు వెల్లడించారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు చెప్పారు. దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ సైతం ఘటనాస్థలానికి చేరుకుంది. ఆ ప్రాంతంలో ప్రతి అంగుళాన్ని తనిఖీ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదని చెప్పారు. బాంబు నిర్వీర్య బృందాలు, సహాయక బృందాలను రంగంలోకి దించినట్లు వివరించారు. హమాస్ యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇజ్రాయెల్ ఎంబసీ వద్ద సెక్యూరిటీ హైఅలర్ట్​లోనే ఉందని అధికారులు స్పష్టం చేశారు.

'నిర్మలా సీతారామన్ రాజీనామా చేయాలి'
మరోవైపు, ముంబయిలో 11 బాంబులు పెట్టినట్లు రిజర్వ్ బ్యాంక్​కు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆర్​బీఐ కేంద్ర కార్యాలయం సహా ఐసీఐసీఐ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకుల కార్యాలయాల్లో బాంబులు అమర్చినట్లు ఈమెయిల్​లో దుండగులు పేర్కొన్నారు. మంగళవారం ఉదయం 10.50 గంటల సమయంలో ఖిలాఫత్ డాట్ ఇండియా(ఎట్ జీమెయిల్) అనే ఐడీ నుంచి మెయిల్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వరుసగా ఒక్కో బాంబు పేలుతుందని దుండగులు మెయిల్​లో హెచ్చరించారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఆర్​బీఐ గవర్నర్ శక్తికాంత దాస్​ తమ పదవులకు రాజీనామా చేయాలని బెదిరించారు. బ్యాంకింగ్ స్కామ్​కు సంబంధించి పూర్తి వివరాలను విడుదల చేయాలని పేర్కొన్నారు. అయితే, సంబంధిత ప్రదేశాల్లో తనిఖీ చేశామని, ఎలాంటి అనుమానిత వస్తువులు దొరకలేదని పోలీసులు స్పష్టం చేశారు.

దేశంలో బాంబు పేలుళ్లకు ఐసిస్ కుట్ర- భగ్నం చేసిన ఎన్ఐఏ- 8 మంది ఉగ్ర ఏజెంట్లు అరెస్టు

భారీ ఉగ్ర కుట్ర.. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్.. ఐదుగురు 'ముష్కరులు' అరెస్ట్

ABOUT THE AUTHOR

...view details