ETV Bharat / bharat

భారీ ఉగ్ర కుట్ర.. బెంగళూరులో పేలుళ్లకు ప్లాన్.. ఐదుగురు 'ముష్కరులు' అరెస్ట్

author img

By

Published : Jul 19, 2023, 10:48 AM IST

Updated : Jul 19, 2023, 12:07 PM IST

భారీ ఉగ్ర కుట్రను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఛేదించారు. బెంగళూరులో పేలుళ్లకు పథకం రచించిన ఐదుగురు అనుమానిత ముష్కరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

plan-to-bomb-blast-in-bengaluru-
plan-to-bomb-blast-in-bengaluru-

బెంగళూరులో బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసిన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను కర్ణాటక సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్(CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను సయ్యద్ సుహేల్, ఉమర్, జానిద్, ముదాసిర్, జాహిద్​లుగా గుర్తించారు. 2017 నాటి ఓ హత్య కేసులో వీరంతా నిందితులని, పరప్పణ అగ్రహార సెంట్రల్ జైలులో ఉగ్రవాదులతో ఏర్పడిన పరిచయంతో పేలుళ్లకు సిద్ధమయ్యారని సీసీబీ తెలిపింది.

నిందితుల వద్ద నుంచి పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఏడు దేశీయ తుపాకులు, 42 లైవ్ బుల్లెట్లు, మందుగుండు, రెండు కత్తులు, రెండు శాటిలైట్ ఫోన్లు, నాలుగు గ్రెనేడ్​లు, 12 ఫోన్లు నిందితుల వద్ద ఉన్నాయని అధికారులు తెలిపారు. ప్రస్తుతం మదివాలా టెక్నికల్ సెల్​లో నిందితులను ప్రశ్నిస్తున్నట్లు చెప్పారు. నిందితుల మొబైల్ ఫోన్లను తనిఖీ చేస్తున్నామని, అందులోని సమాచారంతో మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉందని వివరించారు. ఇదే కేసులో సంబంధం ఉందని భావిస్తున్న మరో ఇద్దరికోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వారి గురించిన సమాచారం తమకు అందిందని, పోలీసు బృందాలు వారిని వెతుకుతున్నాయని చెప్పారు.

"బెంగళూరు నగరంలో విధ్వంసానికి పాల్పడాలనుకున్న వారిని అణచివేయడంలో సీసీబీ విజయవంతమైంది. అరెస్టైన ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు.. 2008 వరుస పేలుళ్ల ఘటనలో నిందితుడైన టీ నజీర్ ద్వారా ప్రభావితమయ్యారు. నజీర్​కు లష్కరే తొయిబాతో సంబంధాలు ఉన్నాయి. నిందితుల వద్ద భారీగా పేలుడు పదార్థాలు లభించాయి. పరారీలో ఉన్న ఓ వ్యక్తి.. వీటన్నింటినీ నిందితులకు సమకూర్చాడు. విధ్వంస కార్యకలాపాలకు వినియోగించేందుకు ఈ ఆయుధాలు అందించాడు."
-బీ దయానంద, బెంగళూరు కమిషనర్

ఈ అరెస్ట్​తో భారీ ఉగ్ర కుట్రను పోలీసులు అడ్డుకున్నట్లైంది. భారీ స్థాయిలోనే నిందితులు బాంబు దాడికి ప్రణాళికలు రచించినట్లు తెలుస్తోంది. పది మందికి పైగా కలిసి నగర వ్యాప్తంగా దాడులకు ప్లాన్ చేసినట్లు సమాచారం. బాంబు తయారీకి అవసరమైన ముడి వస్తువులన్నింటినీ నిందితులు సమకూర్చుకున్నారని తెలిసింది. ఇందుకు సంబంధించి.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి పక్కా సమాచారం అందినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమాచారాన్ని బెంగళూరు సీసీబీ టీమ్​కు చేరవేసినట్లు వెల్లడించాయి. వెంటనే అప్రమత్తమైన బెంగళూరు సీసీబీ బృందాలు.. అనుమానిత ఉగ్రవాదుల లొకేషన్​ను ట్రేస్ చేసి అరెస్ట్ చేశాయి. ఇంటెలిజెన్స్ డిపార్ట్​మెంట్, ఎన్ఐఏ, సీసీబీలు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టాయి.

అరెస్టైన ఐదుగురిలో నలుగురు రౌడీ షీటర్లు. ఆర్తినగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో వీరిపై కిడ్నాప్, హత్య కేసులు నమోదయ్యాయి. ఈ నలుగురికీ జైలులో ఉగ్రవాదులతో సంబంధాలు ఏర్పడ్డాయి. పేలుళ్లకు ఎలా పాల్పడాలో శిక్షణ కూడా తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చాక పేలుళ్లకు ప్లాన్ వేశారు. వీరి పథకంలో మరికొందరు ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Last Updated : Jul 19, 2023, 12:07 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.