తెలంగాణ

telangana

మందు బాబులకు షాక్​.. బాటిల్​పై రూ.10 'మిల్క్​ సెస్'.. స్కూటీపై రూ.25వేలు సబ్సిడీ​

By

Published : Mar 17, 2023, 1:42 PM IST

Updated : Mar 17, 2023, 7:09 PM IST

himachal pradesh budget
himachal pradesh budget ()

ఇక ఆ రాష్ట్రంలో మద్యం బాబులకు షాక్ తగలనుంది. మద్యం బాటిల్​పై రూ.10 'మిల్క్ సెస్​' విధిస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీపై రూ.25 వేలు సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఇంతకీ ఈ పథకాలు ఏ రాష్ట్రంలో అంటే?

హిమాచల్​ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు ఆ రాష్ట్ర అసెంబ్లీలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి గానూ రూ. 53,413 కోట్ల బడ్జెట్​ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులపై వరాల జల్లు ప్రకటించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 20 వేల మంది బాలికలకు ఎలక్ట్రిక్ స్కూటీ కొనుగోలుపై ఒక్కొక్కరికి రూ.25,000 సబ్సిడీని అందిస్తామని ప్రకటించారు. అలాగే మహిళలకు సామాజిక భద్రతా పింఛన్​ కింద 2,31,000 మంది మహిళలకు నెలకు రూ.1,500 నగదు ఇస్తామని సుఖ్విందర్ సుఖు తెలిపారు. దీని కోసం ఏడాదికి ప్రభుత్వానికి రూ.416 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు.

మద్యం అమ్మకాలపై 'మిల్క్ సెస్'​ను విధిస్తున్నట్లు హిమాచల్ ప్రదేశ్​ సీఎం ప్రకటించారు. మద్యం సీసాపై అదనంగా రూ.10 'పాల సుంకం' వసూలు చేస్తామని వెల్లడించారు. ఈ సెస్ ద్వారా ఏడాదికి రూ.100 కోట్లు ప్రభుత్వ ఖజానాకు వచ్చేటట్లు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మిల్క్ సెస్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని.. పాడి రైతుల నుంచి ఆవు, గేదె పాల కొనుగోలుకు ఖర్చు చేస్తామని పేర్కొన్నారు. బడ్జెట్​లో మరికొన్ని ప్రజాకర్షక పథకాలు ప్రకటించారు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సుఖు.

కాంగ్రాను పర్యటక రాజధానిగా అభివృద్ధి చేస్తాం. ఏడాదిలో మొత్తం 12 జిల్లాలకు హెలిపోర్ట్ సౌకర్యాన్ని తీసుకొస్తాం. అన్ని వైద్య కళాశాలల్లోని క్యాజువాలిటీ వార్డులను ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగానికి అప్‌గ్రేడ్ చేస్తాం. వైద్య సేవల్లో రోబోటిక్ టెక్నాలజీని ప్రవేశపెడతాం. దళారుల నుంచి కాపాడేందుకు కొత్త హార్టికల్చర్ పాలసీని తీసుకొస్తాం.

--సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రి

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద రోజువారి వేతనం రూ.212 నుంచి 240కు పెంచుతున్నట్లు హిమాచల్ సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. అలాగే శిమ్లా శివారులోని జటియాదేవి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హిమాచల్‌ ప్రదేశ్​ను ఎలక్ట్రికల్ వాహనాల హబ్​గా మారుస్తామని ప్రకటించారు. రూ.1,000 కోట్లతో 1500 డీజిల్ బస్సులను ఎలక్ట్రిక్​గా మార్చుతామని పేర్కొన్నారు. దాదాపు 30,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని సుఖు తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే ఫండ్ రూ.2 కోట్ల నుంచి రూ.2.10 కోట్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు.

గతేడాది నవంబరులో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ నుంచి కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. రాష్ట్రంలో మొత్తం 68 స్థానాలకుగానూ 40 స్థానాల్లో కాంగ్రెస్ కైవసం చేసుకుంది. బీజేపీ కేవలం 25 స్థానాల్లో గెలుపొందింది. స్వతంత్రులు మరో నాలుగు స్థానాల్లో విజయం సాధించారు. అనంతరం జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ అధిష్ఠానం ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుఖ్విందర్ సింగ్ సుఖును ఎంపిక చేసింది. ఆయన డిసెంబరు 9న హిమాచల్​ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

Last Updated :Mar 17, 2023, 7:09 PM IST

ABOUT THE AUTHOR

...view details