తెలంగాణ

telangana

ఓవైపు తుఫాన్​.. మరోవైపు భూప్రకంపనలు.. గుజరాత్ ప్రజల్లో ఆందోళన

By

Published : Jun 14, 2023, 7:35 PM IST

Updated : Jun 14, 2023, 8:05 PM IST

Earthquake In Kutch Today : తుపాను ముప్పును ఎదుర్కొంటున్న గుజరాత్​లోని కచ్​ జిల్లాలో బుధవారం మధ్యాహ్నం 3.5 తీవ్రతతో భూమి కంపించింది. అయితే ఈ భూప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మరోవైపు.. బిపోర్​జాయ్ తుపాన్​ భారీ విధ్వంసం సృష్టించనుందన్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. తీర ప్రాంతంలోని 55 వేల మందిని తాత్కాలిక శిబిరాలకు తరలించారు.

biporjoy cyclone news
biporjoy cyclone news

Earthquake In Kutch Today : గుజరాత్​ను ఓ వైపు బిపోర్​జాయ్​ తుపాన్​ వణికిస్తుండగా.. మరో వైపు భూమి కంపించడం అక్కడి ప్రజల్ని తీవ్ర ఆందోళనకు గురిచేసింది. కచ్​ జిల్లాలో బుధవారం సాయంత్రం 3.5 తీవ్రతతో భూమి కంపించిది. జిల్లాలోని భచౌకు 5 కిలోమీటర్ల దూరంలో భూమి కంపించినట్లు గాంధీనగర్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సిస్మోలాజికల్ రీసెర్చ్ పేర్కొంది. అయితే ఈ భూప్రకంపనల వల్ల ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

Biporjoy Cyclone News : మరోవైపు.. అతి తీవ్ర తుపాన్‌బిపోర్‌జాయ్‌ భారీ విధ్వంసం సృష్టించనుందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గుజరాత్‌ సహా పలు రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాణ, ఆస్తి నష్టం చాలా వరకు తగ్గించేందుకుగానూ ముందస్తు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే సౌరాష్ట్ర-కచ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. 54 తాలుకాల పరిధిలో 10 మిల్లీమీటర్ల వర్షం కురిసినట్లు.. గుజరాత్‌ అత్యవసర కార్యకలాపాల కేంద్రం ప్రకటించింది. దేవభూమి ద్వారక, రాజ్‌కోట్‌, జామ్‌నగర్‌, పోరుబందర్‌, జునాగఢ్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నట్లు అధికారులు తెలిపారు.

సముద్ర తీరంలో పహారా కాస్తున్న పోలీస్

దేవభూమి ద్వారక జిల్లా పరిధిలోని ఖంభాలియా తాలుకాలో అత్యధికంగా 121 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు చెప్పారు. ద్వారకలో 92 మిల్లీమీటర్లు, కల్యాణ్‌పుర్‌లో 72 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. తుపాన్‌ గుజరాత్‌ తీరానికి సమీపించేకొద్దీ వర్ష తీవ్రత పెరుగుతుందని అధికారులు హెచ్చరించారు. కచ్‌, దేవభూమి ద్వారక, జామ్‌నగర్‌ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.

బిపోర్​జాయ్ తుపాన్ నేపథ్యంలో అప్రమత్తమైన సిబ్బంది

సౌరాష్ట్ర, కచ్‌కు పక్కనే ఉన్న మాండ్వి, పాకిస్థాన్‌లోని కరాచీల మధ‌్య జఖౌ ఓడరేవు సమీపంలో గురువారం సాయంత్రం అతి తీవ్ర తుపాన్‌గాబిపోర్‌జాయ్‌ తీరం దాటనున్నట్లు అధికారులు చెప్పారు. ఈ సమయంలో గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని తెలిపారు. తుపాను ప్రస్తుతం కచ్‌కు 290 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు చెప్పారు. పోరుబందర్‌, రాజ్‌కోట్‌, మోర్బీ, జునాగఢ్‌, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌ ప్రాంతాల్లో గురువారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం హెచ్చరించింది. శుక్రవారం ఉత్తర గుజరాత్‌ జిల్లాలతోపాటు దక్షిణ రాజస్థాన్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు చెప్పారు.

సముద్ర తీరంలో అధికారులు

పోరుబందర్‌, దేవభూమి ద్వారకలో బుధవారం మధ్యాహ్నం నుంచి 65 నుంచి 75కి.మీ వేగంతో గాలులు వీస్తున్నట్లు తెలిపారు. క్రమంగా 125 నుంచి 135 కి.మీ. వేగానికి పెరగనున్నట్లు చెప్పారు. సౌరాష్ట్ర, కచ్‌ తీరాల్లో గురువారం సాయంత్రం వరకు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. తీరందాటే సమయంలో అలలు 2నుంచి 3 మీటర్లు, మరికొన్నిచోట్ల 3 నుంచి 6 మీటర్ల ఎత్తుకు ఎగసిపడనున్నట్లు అధికారులు హెచ్చరించారు.

సముద్ర తీరంలో పోలీసులు పహారా

బిపోర్​జాయ్ తుపాను నేపథ్యంలో.. తీర ప్రాంతంలో ఉన్న 55 వేల మంది ప్రజలను తాత్కాలిక శిబిరాలకు తరలించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు వీలుగా 33 NDRF బృందాలను మోహరించారు. గుజరాత్‌లో 18, డయ్యులో ఒక NDRF బృందాన్ని సిద్ధంగా ఉంచారు. మహారాష్ట్రలో 14 NDRF బృందాల్లో ఐదు ముంబయిలో మోహరించారు. 12 SDRF, 115 రోడ్లు, భవనాల శాఖ, 397 విద్యుత్తు విభాగానికి చెందిన బృందాలను గుజరాత్‌ తీర ప్రాంతాల్లో మోహరించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించేందుకు తగిన ఏర్పాట్లు చేశారు.

రాజ్​నాథ్ సింగ్ సమీక్ష..
బిపోర్​జాయ్​ తుపాన్​ తీవ్రత నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్​.. త్రివిధ దళాధిపతులతో సమావేశం అయ్యారు. బిపోర్​జాయ్​ తుపాన్​ను ఎదుర్కొనేందుకు సాయుధ బలగాల చేస్తున్న సన్నాహాలను అడిగి తెలుసుకున్నారు. తుపాన్ తీవ్రంగా మారి.. ఇబ్బందికర పరిస్థితులు ఎదురైతే పౌరులను సాయం చేసేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన త్రివిధ దళాధిపతులకు సూచించారు.

ఆస్పత్రులు పరిశీలించిన మన్​సుఖ్ మాండవీయ..
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్​సుఖ్ మాండవీయ.. బిపోర్​జాయ్​ తుఫాన్​ను ఎదుర్కొనేందుకు కచ్ జిల్లా అధికారులు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. కచ్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రులు, ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రులలో ఆక్సిజన్, వెంటిలేటర్లు, బెడ్​ల​ లభ్యతను గురించి ఆయన అధికారులను అడిగి తెలుసుకున్నారు. తుఫాన్​ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన అధికారులకు సూచించారు.

Last Updated :Jun 14, 2023, 8:05 PM IST

ABOUT THE AUTHOR

...view details