తెలంగాణ

telangana

కుక్కలకు గుడి.. రోజూ ప్రత్యేక పూజలు.. గ్రామదేవతే ఆదేశించిందట!

By

Published : Jul 23, 2023, 9:56 AM IST

Dog Temple Karnataka : సాధారణంగా అందరూ దేవుడిని పూజిస్తే.. ఈ గ్రామంలో కుక్కలకు గుడి కట్టి పూజిస్తున్నారు. గ్రామ దేవతకు ముందు ఈ శునకాలకే తొలి పూజ నిర్వహిస్తున్నారు. కర్ణాటకలో ఉన్న ఈ అరుదైన ఆలయం నిర్మించడానికి ఓ కారణం కూడా ఉంది. అదేంటంటే?

Dog Temple Karnataka
Dog Temple Karnataka

కుక్కలకు గుడి.. రోజూ ప్రత్యేక పూజలు

Dog Temple Karnataka : ఎక్కడైనా దేవుడికి గుడి కట్టడం, పూజలు చేయడం సర్వసాధారణం. కానీ కర్ణాటక.. రామనగర జిల్లాలోని ఓ గ్రామంలో మాత్రం కుక్కలకు ఆలయం నిర్మించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గ్రామ దేవత కన్నా ముందు కుక్కలకే తొలి పూజ నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ గ్రామస్థులంతా వచ్చి కుక్కలను దర్శించుకుంటున్నారు.

జిల్లాలోని అగ్రహార వలగెరెహళ్లి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. కుక్కలకు ఆలయం నిర్మించడానికి ఓ కారణం ఉంది. సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కాపరులు.. గొర్రెలను రక్షించుకోవడానికి కుక్కలను పెంచుతుంటారు. అదే తరహాలో అగ్రహార వలగెరెహళ్లి గ్రామానికి చాలా ఏళ్ల క్రితం గొర్రెల కాపరులు ఏదో పని మీద వచ్చారు. ఆ గొర్రెలతో పాటు కుక్కలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ఆ శునకాలు కనిపించకుండా పోయాయట.

అయితే కుక్కలు కనిపించకపోవడం వల్ల ఆందోళనకు గురైన గ్రామస్థులు.. తమ గ్రామ దేవత అయిన వీరమస్తి కెంపమ్మ ఆలయానికి వెళ్లారట. అప్పుడు అడవిలోని కెంపమ్మ ఆలయానికి ద్వారపాలకులు కావాలని ఆ దేవత చెప్పిందట. ఆలయానికి సమీపంలో కుక్కల కోసం ద్వారపాలకులుగా ఆలయాన్ని నిర్మించాలని దేవత ఆదేశించిందట. దీంతో గ్రామస్థులు పాలరాతితో రెండు కుక్కల విగ్రహాలను తయారు చేసి.. ఆలయంలో ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఈ రెండు కుక్కలు గ్రామానికి కాపలాగా ఉంటూ.. దుష్టు శక్తుల నుంచి తమను కాపాడతాయని గ్రామస్థులు నమ్ముతున్నారు. గ్రామ దేవతకు కొలిచే ముందు.. ఈ కుక్కలకే పూజలు చేస్తామని గ్రామస్థులు చెబుతున్నారు.

కర్ణాటకలో ఎక్కడా లేని అరుదైన కుక్కల దేవాలయం ఇది. శునకాలకు పూజిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ ప్రజలు నమ్ముతుంటారు. దీంతో ఏడాదికి ఒకసారి ఈ గ్రామంలో జరిగే జాతరకు.. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తుంటారు. భక్తులు ముందుగా కుక్కలకు తొలి పూజ నిర్వహించి అనంతరం వీరమస్తి కెంపమ్మ దర్శనం చేసుకుంటారు. అయితే, విశ్వాసానికి మారుపేరైన కుక్కలకు.. వలగెరెహళ్లి గ్రామంలో విశేష ప్రాధాన్యం లభించిందనడానికి ఈ గుడి నిదర్శనంగా నిలిచింది!

ABOUT THE AUTHOR

...view details