తెలంగాణ

telangana

'జర్నలిస్టులకు నగదు పంపలేదు.. ఇదంతా కాంగ్రెస్ టూల్​కిట్ ప్రచారమే'

By

Published : Oct 30, 2022, 2:20 PM IST

దీపావళి కానుకగా జర్నలిస్టులకు నగదు పంపినట్లు తనపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై స్పందించారు. జర్నలిస్టులకు తాను ఎటువంటి నగదును పంపించలేదని స్పష్టం చేశారు. ఇందంతా కాంగ్రెస్ పార్టీ సృష్టించిన బూటకంగా కొట్టిపారేశారు.

Karnataka CM
ముఖ్యమంత్రి

జర్నలిస్టులకు దీపావళి కానుకగా లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు, స్వీట్ బాక్సులు పంపారన్న ఆరోపణలపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఈ ఆరోపణలను కొట్టిపారేసిన ఆయన.. జర్నలిస్టులకు తాను ఎలాంటి గిఫ్టులు పంపలేదని స్పష్టం చేశారు. ఇందతా కాంగ్రెస్ పార్టీ సృష్టించిన బూటకంగా పేర్కొన్నారు. ఈ విషయంపై ఆదివారం పలువురు జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ముఖ్యమంత్రి సమాధానమిచ్చారు. కొందరు ఈ విషయంపై లోకాయుక్తలో ఫిర్యాదు చేశారని, దర్యాప్తులో నిజానిజాలు తెలుస్తాయన్నారు.

"ఇదంతా కాంగ్రెస్ టూల్​కిట్ ఫలితమే. వారు అబద్ధాలను ప్రచారం చేయాలని అనుకుంటున్నారు. గిఫ్టులు ఇవ్వాలని నేనెలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి, ఎలాంటి కానుకలు ఇచ్చారో నాకు తెలుసు. ఐఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, బంగారు నాణేలను ఇచ్చినట్లు మీడియాలోనూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఏ నైతికతతో మీరు(కాంగ్రెస్​ను ఉద్దేశించి) మాట్లాడుతున్నారు."
-బసవరాజ్ బొమ్మై, కర్ణాటక సీఎం

జర్నలిస్టులకు నగదు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని జనాధికార సంఘాష పరిషత్ అనే ఎన్​జీఓ సంస్థ ముఖ్యమంత్రిపై కర్ణాటక లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. కాగా వివిధ మీడియా సంస్థలకు చెందిన జర్నలిస్టులు ఆర్.ఆదర్శ్ అయ్యర్, బికే.ప్రకాష్ బాబు, వీబీ విశ్వనాథ్​లు తమకు సీఎం సన్నిహితుల నుంచి బహుమతులు అందినట్లు చెప్పారు. పైఅధికారులకు సమాచారం అందించి వాటిని తిరిగిచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో విపక్షాలు ఈ అంశంపై తీవ్రంగా స్పందిస్తున్నాయి. దీనిపై న్యాయ విచారణ చేపట్టాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది.

ABOUT THE AUTHOR

...view details