తెలంగాణ

telangana

CM Jagan with MLAs: ఎమ్మెల్యేల గుండెల్లో బాంబు పేల్చిన జగన్​.. ఆ 18 మందికి అక్టోబరు వరకే డెడ్‌లైన్‌

By

Published : Jun 21, 2023, 4:33 PM IST

Updated : Jun 22, 2023, 8:06 AM IST

CM Jagan Focus on MLAs: వైసీపీ ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి జగన్‌ టికెట్ పరీక్ష పెట్టారు. ఇప్పటికీ 18 మంది ఎమ్మెల్యేలు చాలా వెనుకబడి ఉన్నారంటూ.. సరిదిద్దుకునేందుకు వారికి అక్టోబరు వరకు డెడ్లైన్ పెట్టారు. సర్వేల్లో గ్రాఫ్ బాగుంటేనే ఏ ఎమ్మెల్యేకైనా టికెట్ ఇస్తామని తేల్చిచెప్పేశారు. 'ఏపీకి జగనే ఎందుకు కావాలి' అంటూ అక్టోబరు తర్వాత ప్రజల్లోకి వెళ్తామని సీఎం జగన్‌ ప్రకటించారు.

jagan
జగన్

ఎమ్మెల్యేల గుండెల్లో బాంబు పేల్చిన జగన్​.. ఆ 18 మందికి అక్టోబరు వరకే డెడ్‌లైన్‌

CM Jagan Focus on MLAs Performance: గడప గడపకు మన ప్రభుత్వం, జగనన్న సురక్ష సదస్సులో భాగంగా వైసీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల బాధ్యులు, ఆ పార్టీ ప్రాంతీయ సమన్వయకర్తలతో సీఎం జగన్ సమావేశం నిర్వహించారు. ఇప్పటికీ 18 మంది ఎమ్మెల్యేలు వెనుకబడి ఉన్నారని.. సరిదిద్దుకునేందుకు వారికి అక్టోబరు వరకు డెడ్‌లైన్‌ పెట్టారు. ఆ 18 మంది ఎవరనేది వారికి తెలుసని.. గడప గడపకు కార్యక్రమంలో ఎన్నిసార్లు చెప్పినా వారు సరిగా తిరగలేదని.. వారు ఎంతమేర తిరిగారో, వారి పనితీరు ఎలా ఉందో వ్యక్తిగతంగా నివేదికలు పంపుతామని జగన్ చెప్పారు. ఇతర ఎమ్మెల్యేలు కూడా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సీరియస్‌గా తీసుకోవాలని స్పష్టం చేశారు. ఇప్పటి నుంచే పార్టీ ఎమ్మెల్యేలందరి పనితీరుపై సర్వేలు చేపడతామని.. ప్రజల్లో గ్రాఫ్‌ బాగుందని వచ్చే వారికే టికెట్ ఉంటుందని.. గ్రాఫ్ లేనివారికి టికెట్ ఇచ్చేది లేదన్నారు. పనితీరు బాగా లేని ఎమ్మెల్యేలకు తిరిగి టికెట్ ఇవ్వడం వారికి, పార్టీకి నష్టమేనని తేల్చిచెప్పారు. అక్టోబరు నుంచి నియోజకవర్గ బాధ్యుల్లో మార్పులు, చేర్పులు చేపడతామని వెల్లడించారు.

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం..వాలంటీర్లు, గృహ సారథులు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యేలందరికీ చాలా కీలకం అవుతారని జగన్ చెప్పారు. గృహ సారథుల్ని ఇప్పటికే జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ద్వారా ఒకసారి ఇంటింటికీ తిప్పి పరిచయం చేశామని తెలిపారు. ఇప్పుడు జగనన్న సురక్షతో వచ్చే ఎన్నికల్లోపు ఆరేడుసార్లు వీరిని ఇంటింటికీ తిప్పి ఆ ఇళ్లలోని వారితో పరిచయం పెంచేలా చేయాలని సూచించారు. చాలాచోట్ల ఎమ్మెల్యేలు గృహ సారథులను నియమించలేదని.. వెంటనే ఆ గ్యాప్​లన్నింటినీ పూర్తి చేయాల్సిందేనని జగన్‌ స్పష్టం చేశారు.

ప్రతి ఇంటికీ వెళ్లి పథకాలు, ధ్రువీకరణ పత్రాల జారీ లాంటి వాటిలో ఏ సమస్యలు ఉన్నా కనుక్కుని వాటికి పరిష్కారం చూపించేందుకే జగనన్న సురక్ష చేపడుతున్నామని.. జూన్ 23 నుంచి ఇది ప్రారంభమవుతుందని జగన్ వెల్లడించారు. జగనన్న సురక్షలో.. లక్షన్నర మంది సచివాలయం సిబ్బంది, 2లక్షల 60వేల మంది వాలంటీర్లు, ఏడున్నర లక్షల మంది గృహ సారథులు 28 మంది ఐఏఎస్​ అధికారులు, 3వేల మంది మండల స్థాయి సిబ్బంది పాల్గొంటారని సీఎం తెలిపారు.

మరో కొత్త కార్యక్రమం..ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే కొత్త కార్యక్రమాన్ని చేపట్టబోతున్నట్లు జగన్ ప్రకటించారు. ఈ నాలుగేళ్ల పాలనలో దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలబడేలా ఎలాంటి పనులు చేశామన్న విషయాలపై ఆధారాలతో సహా అవగాహన కల్పించే కార్యక్రమం ఇదని తెలిపారు. ఇంత మంచి చేశామని చెప్పుకొనే పరిస్థితుల్లో ఉన్న మనం.. 175 స్థానాల్లో ఎందుకు గెలవలేమని జగన్ అన్నారు.

సమావేశంలో ఉపసభాపతి కోలగట్ల వీరభద్రస్వామి.. రాష్ట్ర పొరుగు సేవల కార్పొరేషన్ ద్వారా 18వేలు జీతం పొందుతున్న ఉద్యోగుల తల్లిదండ్రులకు పింఛను కోత పెడుతున్నారని.. బయట లక్షల జీతం తీసుకుంటున్న పిల్లల తల్లిదండ్రులకూ మాత్రం పింఛను వస్తోందని.. దీనికి పరిష్కారం చూడాలని అడిగినట్లుగా తెలిసింది. దీనిపై సీఎం స్పందిస్తూ ఒక విధాన నిర్ణయం మేరకు వాటిపై చర్యలు తీసుకుంటారని.. మైకు దొరికింది కదా అని ఏది పడితే అది మాట్లాడతామంటే ఎలా అన్నట్లు సమాచారం. ఇంతలో మాజీ మంత్రి పేర్ని నాని కల్పించుకుని రేషన్ కార్డుల విభజనలో భాగంగా ఆ ఉద్యోగులు వారి తల్లిదండ్రుల కార్డుల్లోంచి వారి పేర్లను తీయించేస్తే అప్పుడు వారి తల్లిదండ్రులకు పింఛను వస్తుంది కదా అని చెప్పడంతో.. చర్చ ముగిసినట్లు తెలిసింది.

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డికి పార్టీ అనుబంధ విభాగాల నిర్వహణ.. డెడ్‌లైన్‌ పెట్టిన 18 మంది ఎమ్మెల్యేలు ఎవరనే దానిపై వైసీపీలో విస్తృత చర్చ మొదలైంది. సమావేశం ముగిశాక బయటకొస్తూ వారు దానిపైనే చర్చించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఒక మంత్రి, కోస్తాంధ్రలో ఇద్దరు మాజీ మంత్రులు, ఒక మంత్రి, రాయలసీమలో ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నట్లు చర్చ జరిగింది. 18 మందిలో కొందరిని ఇప్పటికే ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా పిలిచి మాట్లాడారని, సర్దుకోవాలని వారికి స్పష్టం చేసినట్లు చెబుతున్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని ఉద్దేశించి.. విజయసాయిరెడ్డికి ప్రియ శిష్యుడని సీఎం జగన్‌ అన్నారు. పార్టీ అనుబంధ విభాగాల నిర్వహణపై శిక్షణ తీసుకుంటున్నాడని...తర్వాత ఆయనే వాటి బాధ్యతలను చూస్తాడని సాయన్న ముసలాయన అయ్యాడు కదా, అన్నీ ఆయన చూసుకోలేరుని సీఎం జగన్‌ అన్నట్లు విశ్వసనీయ సమాచారం.

Last Updated :Jun 22, 2023, 8:06 AM IST

ABOUT THE AUTHOR

...view details