ETV Bharat / state

CM Review meeting: క్యాలెండర్‌ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేయాలి: సీఎం జగన్

author img

By

Published : Jun 19, 2023, 9:57 PM IST

CM Jagan Review meeting: సీఎం జగన్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రితో పాటుగా అధికారులను సీఎం అభినందించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న వివిధ ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్యాలెండర్‌ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

Etv Bharat
Etv Bharat

CM Jagan Review meeting on irrigation: క్యాలెండర్‌ ప్రకారం రైతులకు సాగునీరు విడుదల చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గోదావరి, కృష్ణా డెల్టా, తోటపల్లి కింద ప్రాంతాలకు సాగునీరు విడుదల చేశామని స్పష్టం చేసారు. జలవనరుల శాఖపై అధికారులతో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సమీపిస్తున్న కొద్దీ లెఫ్ట్‌ మెయిన్‌ కెనాల్‌పై కూడా దృష్టి పెట్టాలని అధికారలను ఆదేశించారు. ఈసీఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణ ప్రాంతంలో పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు. ఈసీఆర్ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-1లో శాండ్‌ ఫిల్లింగ్‌, వైబ్రోకాంపాక్షన్‌ పనులు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈసీఆర్ఎఫ్‌ డ్యాం గ్యాప్‌-2 వద్ద కూడా ఇదే పనులు చురుగ్గా సాగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలమండలి అధికారులు గైడ్‌ బండ్‌లో కుంగిన ప్రాంతాన్ని పరిశీలించారని అధికారులు తెలిపారు. నేల స్వభావంలో మార్పలు కారణంగా ఇది జరిగి ఉండొచ్చని కమిటీ అనుమానాన్ని వెల్లడించిందన్నారు. దెబ్బతిన్న ప్రాంతాన్ని రాక్‌ డంప్‌తో, సిమెంట్‌ స్లర్రీతో నింపాలని, గేబియన్స్‌తో సపోర్టు ఇవ్వాలని కమిటీ సూచించిందని అధికారులు పేర్కొన్నారు. పూర్తి విశ్లేషణ తర్వాత శాశ్వతంగా చేయాల్సిన మరమ్మతులను సూచిస్తామని కమిటీ చెప్పినట్టు అధికారులు సీఎంకు వెల్లడించారు. పోలవరం తొలిదశను పూర్తి చేయడానికి కేంద్ర ఆర్థికశాఖ 12,911.15 కోట్లు ఇచ్చేందుకు నిర్ణయం తీసుకుందని స్పష్టం చేసారు. కేంద్ర కేబినెట్​లో పెట్టేందుకు కేబినెట్‌ నోట్‌ తయారీపై వివిధ మంత్రిత్వశాఖల మధ్య సంప్రదింపులు కొలిక్కి వస్తున్నాయని అధికారులు సీఎంకు వివరించారు. పోలవరం మొదటి దశ పరిధిలోకి వచ్చే 20,946 ముంపు బాధిత కుటుంబాల్లో 12,658 మందిని ఇప్పటికే తరలించామని, మిగిలిన 8,288 మందిని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నామన్న అధికారులు తెలిపారు.

జలవనరుల శాఖపై సీఎం జగన్ సమీక్ష

ప్రభుత్వం ప్రాధాన్యతగా నిర్దేశించుకున్న ప్రాజెక్టుల పూర్తి ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. వెలిగొండ, వంశధార, అవుకు సహా పలు ప్రాధాన్యతా ప్రాజెక్టుల్లో పరిస్థితులను సీఎం సమీక్షించారు. అవుకు రెండో టన్నెల్‌ నిర్మాణం పూర్తి, చివరిదశలో లైనింగ్‌ కార్యక్రమం ఉందని అధికారులు తెలిపారు. ఆగస్టులో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. అవుకు ద్వారా 20వేల క్యూసెక్కుల సముద్రంలో కలిసే కృష్ణా వరద జలాలను రాయలసీమ దుర్భిక్ష ప్రాంతానికి తరలించేందుకు మార్గం సుగమమైందని స్పష్టం చేసారు. వరదలు సమయంలో సముద్రంలో జార విడువకుండా నీటిని కరవుపీడిత ప్రాంతాలకు తరలించే అవకాశం ఉంటుందని అధికారులు సీఎంకు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు పనులపై పురోభివృద్ధిని అధికారులు సీఎం జగన్​కు వివరించారు. ఇప్పటికే మొదటి టన్నెల్‌ పూర్తయ్యిందని, రెండో టన్నెల్‌ పనులు కూడా కొలిక్కి వస్తున్నాయని తెలిపారు. పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టులో రెండో టన్నెల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు 92.14శాతం పూర్తయ్యాని, ఆగస్టు నాటికి హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు పూర్తి చేస్తామన్న అధికారులు స్పష్టం చేశారు. టన్నెల్‌ తవ్వకం పనులు 18,787 మీటర్లకుగానూ, 17,461 మీటర్లు పూర్తి చేశామని అధికారులు పేర్కొన్నారు. నీటిని తరలించడానికి వీలైనంత తర్వగా మిగిలిన పనులు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. వెలిగొండ ప్రాజెక్టులో భాగంగా గొట్టిపాడు డ్యాం, కాకర్ల డ్యాం, తీగలేరు అప్రోచ్‌ ఛానల్, తీగలేరు హెడ్‌ రెగ్యులేటర్‌, ఈస్ట్రన్‌ మెయిన్‌ కెనాల్‌ హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయని అధికారులు వెల్లడించారు.

ఈ ఏడాది వంశధార స్టేజ్‌-2, ఫేజ్‌-2 కింద డిస్ట్రిబ్యూటరీ నెట్‌వర్క్‌ను కూడా పూర్తి చేస్తున్నామని అధికారులు వంశధార పనులపై సీఎం సమీక్ష లో తెలిపారు. గొట్టా బ్యారేజీ నుంచి కూడా ఎత్తిపోతల ద్వారా హిరమండలం రిజర్వాయర్‌ను నింపే కార్యక్రమం వీలైనంత త్వరగా కార్యరూపం దాల్చాలని సీఎం ఆదేశించారు. తోటపల్లి బ్యారేజీ కింద మిగిలిపోయిన పనులు, తారకరామ తీర్థసాగర్‌, మహేంద్ర తనయ రిజర్వాయర్లపై కూడా సీఎం సమీక్షించారు. కుప్పం బ్రాంచ్‌ కెనాల్‌ పనులు దాదాపుగా పూర్తికావొచ్చాయ అధికారులు సీఎంకు తెలిపారు. ఏపీ నాలుగు జాతీయ జల అవార్డులు (నేషనల్ వాటర్‌ అవార్డ్స్‌ 2022) దక్కించుకోవడంపై మంత్రి, అధికారులను సీఎం అభినందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.