తెలంగాణ

telangana

Jagan Illegal Assets Case: జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం.. డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు

By

Published : Jul 1, 2023, 11:20 AM IST

Jagan Illegal Assets Updates:సీఎం జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సీబీఐ కోర్టులో వేగం పుంజుకుంది. సుమారు పదకొండేళ్ల తర్వాత డిశ్చార్జి పిటిషన్లు కొలిక్కి వస్తున్నాయి. సీబీఐ, ఈడీ కేసుల్లో నిందితులందరూ డిశ్చార్జి పిటిషన్లపై ఈ నెల 31 నాటికి వాదనలు ముగించాలని సీబీఐ కోర్టు ఆదేశించింది. డిశ్చార్జి పిటిషన్లు తేలితే నిందితులపై అభియోగాల నమోదు ప్రక్రియ మొదలు కానుంది.

Etv Bharat
Etv Bharat

జగన్‌ అక్రమాస్తుల కేసుల విచారణ వేగవంతం

Jagan Cases Investigation Expedite: జగన్‌ అక్రమాస్తులపై సీబీఐ దాఖలుచేసిన 11 కేసులతో పాటు ఈడీ నమోదుచేసిన 9 కేసుల్లో 8 కేసులు శుక్రవారం విచారణకు వచ్చాయి. శుక్రవారం పెన్నా, దాల్మియా సిమెంట్స్‌ కేసుల్లోని నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు జరగాల్సి ఉండగా సీబీఐతో పాటు పిటిషనర్ల తరఫు న్యాయవాదులు గడువు కోరారు. వీటిపై జడ్జి సీహెచ్‌. రమేశ్‌బాబు స్పందిస్తూ జగన్‌ అక్రమాస్తులకు సంబంధించి సీబీఐ, ఈడీ నమోదు చేసిన కేసుల్లోని నిందితుల్లో ఇంకా ఎవరైనా డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేయాలనుకుంటే చేయొచ్చని ఆదేశించారు. ఒకవేళ పిటిషన్లు దాఖలు చేసినా జులై 31లోగా వాదనలు పూర్తిచేయాల్సి ఉందని తెలిపారు.

ప్రస్తుతం డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేసిన వారికి రాతపూర్వక వాదనలు ఉంటే వాటినీ సమర్పించవచ్చని సూచించారు. ఇప్పటికే సీబీఐ నమోదు చేసిన 8 కేసుల్లోని నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తయింది. ఇంకా పెన్నా, దాల్మియా ఇందూ-హౌసింగ్‌ బోర్డులకు చెందిన కేసుల్లో నిందితుల డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగుతోంది. ఈడీ నమోదు చేసిన 9 కేసుల్లో వాన్‌పిక్‌తో పాటు హెటెరో-అరబిందో కేసుల్లోని డిశ్చార్జి పిటిషన్లపై విచారణ కొనసాగాల్సి ఉంది. దాదాపు అన్ని కేసుల్లోని నిందితులు దాఖలు చేసిన డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు పూర్తి అయినందున సీబీఐ కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. జగన్‌ అక్రమాస్తుల కేసులో భారతి సిమెంట్స్, దాల్మియా సిమెంట్స్‌ వ్యవహారంలో ఈడీ ఇంకా అభియోగ పత్రాలు దాఖలు చేయాల్సి ఉంది.

అరబిందో, హెటిరోకు భూముల కేటాయింపునకు సంబంధించిన సీబీఐ తొలి ఛార్జిషీటు 2012లో దాఖలయింది. విచారణ ప్రక్రియలో భాగంగా ఛార్జిషీట్ నుంచి తమ పేరు తొలగించాలని వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి సహా పలువురు నిందితులు డిశ్చార్జి పిటిషన్లు వేశారు. అయితే పదకొండేళ్లుగా కేసులు డిశ్చార్జి పిటిషన్ల దశను దాటడం లేదు. డిశ్చార్జ్ పిటిషన్లపై కొందరి వాదనలు కొలిక్కి రాగానే జడ్జీలు బదిలీ కావడంతో మళ్లీ మొదటికొస్తున్నాయి. అదే విధంగా పలు కేసుల్లో హైకోర్టు స్టే ఉండటం వివిధ పిటిషన్లు దాఖలు కావడంతో ముందుకు సాగలేదు.

సీబీఐ కోర్టు న్యాయమూర్తి సీహెచ్.రమేష్ బాబు కొన్ని నెలలుగా రోజువారీ విచారణ జరుపుతున్నారు. వాదనలు వేగంగా జరిగేలా చొరవ తీసుకున్నారు. దీంతో సీబీఐకి సంబంధించిన ఎనిమిది కేసుల్లో, ఈడీకి సంబంధించిన ఏడు కేసుల్లో డిశ్చార్జి పిటిషన్లపై వాదనలు ముగిశాయి. నిందితులతో పాటు సీబీఐ న్యాయవాదులు కూడా వాదనలు వినిపించారు. సీబీఐ ఛార్జిషీట్లలో పెన్నా, దాల్మియా, హౌజింగ్ బోర్డు కేసుల్లో డిశ్చార్జ్ పిటిషన్లు మాత్రమే మిగిలాయి. ఈడీ చార్జిషీట్లలో వాన్‌పిక్, అరబిందో ఛార్జిషీట్లలో కొందరి డిశ్చార్జి పిటిషన్లు మిగిలాయి. వాటన్నింటినీ ఈ నెల 31నాటికి పూర్తి చేయాల్సిందేనని నిందితులకు, సీబీఐకి న్యాయస్థానం స్పష్టం చేసింది.

జగన్, విజయసాయిరెడ్డి అన్ని ఛార్జిషీట్లలోనూ డిశ్చార్జి పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు వివిధ ఛార్జిషీట్లలో నిందితులు డిశ్చార్జి పిటిషన్లు వేశారు. నిందితుల్లో పారిశ్రామిక వేత్త ఎన్.శ్రీనివాసన్, ఐఏఎస్ అధికారి మురళీధర్ రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ అధికారులు రత్నప్రభ, ఎస్.ఎన్.మొహంతి, ఇండియా సిమెంట్స్ కంపెనీని కేసుల నుంచి హైకోర్టు తొలగించగా సజ్జల దివాకర్ రెడ్డి, అరబిందో ఆడిటర్ పీఎస్ చంద్రమౌళి మరణించారు. సీబీఐ కోర్టు ఆదేశాల మేరకు ఈనెల 31నాటికి డిశ్చార్జి పిటిషన్ల వాదనలు ముగిస్తే ఆగస్టులో తీర్పులు వెల్లడించి ఆ తర్వాత అభియోగాల నమోదు ప్రక్రియ ప్రారంభించే అవకాశం ఉంది.

ABOUT THE AUTHOR

...view details