ETV Bharat / state

ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌.. పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు

author img

By

Published : Dec 2, 2022, 7:35 AM IST

Updated : Dec 2, 2022, 1:06 PM IST

పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు
పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ చోరీ వ్యవహారంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సెల్‌ఫోన్‌ పోయిందంటూ ఆయన వ్యక్తిగత సహాయకుడు గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసి పది రోజులు గడుస్తున్నా దానిపై.. ఇంతవరకు కేసూ నమోదు చేయలేదు.. దర్యాప్తూ చేపట్టలేదు. ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి ఆ తర్వాత చర్యలు వద్దని కోరారంటున్న పోలీసులు.. అందుకే ముందుకు వెళ్లలేదని చెబుతున్నారు..దిల్లీ మద్యం కుంభకోణం అనుమానితుల సెల్‌ఫోన్లు ధ్వంసం అయినట్లు ఈడీ చెబుతున్న వేళ.. విజయసాయి ఫోన్‌ చోరీ వ్యవహారం మరోసారి చర్చకు దారితీసింది

దిల్లీ మద్యం కుంభకోణంలో కింగ్‌పిన్‌గా పేర్కొంటూ పెనాక శరత్‌చంద్రారెడ్డిని నవంబరు 10న ఈడీ అరెస్టుచేసింది. ఆయన్ను కస్టడీకి తీసుకుని నవంబరు 21 వరకూ విచారించింది. అదే రోజు వైకాపా ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి కోర్టు ప్రాంగణంలో శరత్‌చంద్రారెడ్డిని కలిశారు. తర్వాత నవంబరు 21న విజయసాయిరెడ్డి ఫోన్‌ కనిపించకుండా పోయిందని, చోరీకి గురైందని భావిస్తున్నామంటూ, రెండు రోజుల తర్వాత ఆయన వ్యక్తిగత సహాయకుడు లోకేశ్వరరావు తాడేపల్లి పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. చోరీకి గురైన సెల్‌ఫోన్‌ను ప్రస్తుతం విజయసాయిరెడ్డి వినియోగించట్లేదు. ఆయన వ్యక్తిగత సహాయకుడు వాడుతున్నారు. ఆయనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. తొలుత సెల్‌ఫోన్‌ పోయిందని ఫిర్యాదిచ్చి, తర్వాత చర్యలు వద్దనడంలో ఆంతర్యంపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. అయినా పోయిన ఫోన్‌ ఎక్కడుందో కనుక్కోవటం పోలీసులకు పెద్ద కష్టం కాదు. టవర్‌ లొకేషన్‌, I.M.E.I. నంబరు సహా ఇతర సాంకేతికతల ఆధారంగా ఆ ఫోన్‌ ఎక్కడున్నా పట్టేయొచ్చు. అధికార పార్టీ ఎంపీ ఫోనే పోతే పోలీసులు ఎంతలా స్పందిస్తారో చెప్పాల్సిన పనిలేదు. కానీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌ వ్యవహారంలో పోలీసుల తీరుపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


దిల్లీ మద్యం కుంభకోణంలో తాజాగా అమిత్‌ అరోడాను అరెస్టుచేసిన ఈడీ.. ఈ కేసులో అనుమానితులు, భాగస్వాములు 36 మంది గతేడాదిలో 170 సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని రిమాండు రిపోర్టులో పేర్కొంది. ఇదే కేసులో ఇప్పటికే అరెస్టయిన విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్‌చంద్రారెడ్డి తొమ్మిది సెల్‌ఫోన్లు ధ్వంసం చేశారని వెల్లడించింది. ఈ కేసులో విలువైన సాక్ష్యాధారాలు, ముడుపుల వివరాలున్న డిజిటల్‌ డేటాను ధ్వంసం చేశారని, సాక్ష్యాల చెరిపివేతకు ప్రయత్నించారని వివరించింది. ఈ నేపథ్యంలో ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్‌ పోయిందంటూ ఫిర్యాదు అందడంపై ప్రతిపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘దిల్లీ మద్యం కుంభకోణం నుంచి తప్పించుకోవటానికే ఫోన్‌ పోయిందంటూ విజయసాయిరెడ్డి నాటకం ఆడారని తెదేపా నేతలు అంటున్నారు.

ఎంపీ విజయసాయిరెడ్డి సెల్‌ఫోన్‌.. పోలీసులు కేసు ఎందుకు నమోదు చేయలేదు

ఇవి చదవండి:

Last Updated :Dec 2, 2022, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.