తెలంగాణ

telangana

బిహార్​లో కల్తీ మద్యానికి ఏడుగురు బలి.. చూపు కోల్పోతున్న బాధితులు

By

Published : Jan 23, 2023, 8:21 PM IST

బిహార్​లో కల్తీ మద్యం మరణాలు కలకలం రేపుతున్నాయి. కల్తీ మద్యం తాగి ఏడుగురు మరణించగా.. ఆరుగురు అస్వస్థతకు గురయ్యారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని తెలుస్తోంది. కాగా, చాలా మంది బాధితులకు కంటిచూపు మందగిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.

Bihar Hooch Tragedy
Bihar Hooch Tragedy

బిహార్​లో కల్తీమద్యం మరోమారు తీవ్ర కలకలం రేపింది. సివాన్​ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఏడుగురు వ్యక్తులు మరణించారు. మరో ఆరుగురు కంటిచూపు కోల్పోయారు. అస్వస్థతకు గురైన వారిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉందని.. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరగొచ్చని తెలుస్తోంది. కల్తీ మద్యం కారణంగా అస్పస్థతకు గురైన వారిలో ముగ్గురిని గోరఖ్​పుర్, మరో 11 మందిని పట్నా మెడికల్​ కాలేజీ అస్పత్రికి తరలించారు.

శవపరీక్ష తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఐదుగురు అనుమానాస్పదంగా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఆస్పత్రుల్లో చేరిని బాధితుల్లో చాలా వరకు తమ కంటిచూపు మందగిస్తోందని చెబుతున్నారని డాక్టర్లు అంటున్నారు. కల్తీ మద్యం కారణంగానే వీరంతా చనిపోయారని అధికారులు ఒప్పుకోవడం లేదు. ఈ ఘటన తర్వాత కల్తీ మద్యం అక్రమ రవాణా చేస్తున్న 16 మందిని పోలీసులు అరెస్టు చేశారు.
మృతులను నరేష్​ బీన్​, జనక్​ ప్రసాద్​, రమేశ్​ రౌత్​, సురేంద్ర మాంఝీ, లక్షందేవ్​ రామ్​, జితేంద్ర మాంఝీ, రాజు మాంఝీలుగా గుర్తించారు. ఈ మరణాలకు రూ.50 కల్తీ మద్యం కారణమని మృతుల కుటుంబ సభ్యులు వాపోతున్నారు.

ఆస్పత్రిలో బాధితులు

కంటిచూపు మందగిస్తోందంటూ..
సివాన్‌లోని నబీగంజ్‌లోని బాలా గ్రామానికి చెందిన జనక్ ప్రసాద్, నరేష్ బీన్​లకు.. రాత్రి సమయంలో కడుపునొప్పి ప్రారంభమైంది. దాంతో పాటు వారి కంటి చూపు కూడా మందగించింది. దీంతో వారి బంధువులు సివాన్​లోని సదర్ ఆస్పత్రికి తరలించారు. వారిని పరీక్షించిన వైద్యులు.. అప్పటికే మరణించినట్లు తెలిపారు. ఇదే విధంగా బాలా గ్రామానికి చెందిన జితేంద్ర మాంఝీ అవే వ్యక్తి ఆదివారం రాత్రి కల్తీ మద్యం తాగాడు. సోమవారం ఉదయం లేచి చూస్తే కళ్లు కనబడటం లేదంటూ తన తల్లికి చెప్పాడు. దీంతో వారు ఆస్పత్రికి తరలించారు. చనిపోయిన వాళ్లలో కూడా కంటి చూపు మందగించిందని చెప్పారని వారి బంధువులు తెలిపారు.

చికిత్స పొందుతున్న బాధితుడు

ఇంతకుముందు 2022 డిసెంబర్​లో ఇలాంటి దారుణ ఘటన జరిగింది. కల్తీ మద్యం కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన రాజకీయంగా కూడా పెను దుమారం రేపింది. 2016 ఏప్రిల్‌లో నీతీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం బిహార్‌లో మద్యం అమ్మకాలు, వినియోగంపై నిషేధం విధించారు. అయినప్పటికీ మద్యం విక్రయాలు ఆగడం లేదు. అనేకమంది అక్రమంగా విక్రయిస్తున్నారు. 2021 డిసెంబర్​​లో ఛప్రాలోని సరన్ జిల్లా నకిలీ మద్యం సేవించడం వల్ల 75 మందికి పైగా మరణించారు. ఈ ఘటన అసెంబ్లీలో రాజకీయ దుమారాన్ని రేపింది, నకిలీ మద్యం మరణాలపై బిహార్‌ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌పై ప్రతిపక్ష నాయకులు బలమైన దాడికి దిగారు.

ఆస్పత్రిలో బాధితుడితో అతడి తల్లి

ABOUT THE AUTHOR

...view details