'సర్జికల్ స్ట్రైక్స్ అంతా ఫేక్!'.. కాంగ్రెస్ నేత వివాదాస్పద వ్యాఖ్యలు.. భాజపా ఫైర్

author img

By

Published : Jan 23, 2023, 7:14 PM IST

Digvijaya Singh questions surgical strikes

సర్జికల్ స్ట్రైక్స్​ విషయంలో కేంద్రం ఎలాంటి రుజువులు ఇవ్వడం లేదని కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దాడుల విషయంలో కేంద్రం అబద్ధాలు చెబుతోందని అన్నారు. అయితే, భాజపా ఈ వ్యాఖ్యలను ఖండించింది. కాంగ్రెస్ పార్టీకి సైన్యంపై గౌరవం లేదని వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చింది.

సర్జికల్ స్ట్రైక్స్​పై కాంగ్రెస్ అగ్రనేత దిగ్విజయ్ సింగ్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. లక్షిత దాడుల విషయంలో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోందంటూ వ్యాఖ్యానించారు. దీనిపై భాజపా తీవ్రంగా స్పందించింది. మోదీపై ద్వేషం పెంచుకున్న కాంగ్రెస్ పార్టీకి కళ్లు మూసుకుపోయాయంటూ మండిపడింది. దిగ్విజయ్ వ్యాఖ్యలు సైనిక దళాలను అవమానం కలిగించేలా ఉన్నాయని ధ్వజమెత్తింది.

డిగ్గీ ఏమన్నారంటే?
జమ్ము కశ్మీర్​కు చేరుకున్న భారత్ జోడో యాత్రలో పాల్గొన్న దిగ్విజయ్ సింగ్.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఓ బహిరంగ సభలో మాట్లాడిన ఆయన.. అనంతరం ట్విట్టర్​లోనూ ఓ వీడియో పోస్ట్ చేశారు. సీఆర్​పీఎఫ్ జవాన్లను శ్రీనగర్ నుంచి దిల్లీకి వాయుమార్గంలో పంపడానికి కేంద్రం అంగీకరించలేదని వీడియోలో చెప్పారు. ఈ ఫలితంగానే 40 మంది జవాన్లు పుల్వామా ఉగ్రదాడిలో అమరులయ్యారని అన్నారు.

"వారు సర్జికల్ స్ట్రైక్స్ గురించి మాట్లాడతారు. చాలా మంది ఉగ్రవాదులను హతమార్చినట్లు చెప్పుకుంటారు. కానీ ఇందుకు తగిన రుజువులు ఇవ్వరు. అధికార పార్టీ అబద్ధాలను ప్రచారం చేస్తోంది. పుల్వామా ఘటనలో ఉగ్రవాదులకు 300 కిలోల ఆర్​డీఎక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? దీనిపై ప్రభుత్వం ఎందుకు సమాధానం చెప్పలేకపోతుంది? ఉగ్రవాదులతో పట్టుబడ్డ డీఎస్పీ దవీందర్ సింగ్​ను ఎందుకు విడుదల చేశారు? ఆయనపై దేశద్రోహం కేసు ఎందుకు నమోదు చేయలేదు? పాకిస్థాన్ ప్రధానమంత్రి, భారత ప్రధానమంత్రి ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటున్నారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి?"
-దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ నేత

సర్జికల్ స్ట్రైక్స్​పై దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు

దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్​పై భాజపా ఎదురుదాడికి దిగింది. "పేరుకే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారు. నిజానికి ఆయన, ఆయన పార్టీ నేతలు దేశాన్ని విడగొట్టాలని పనిచేస్తున్నారు. అది భారత్ తోడో (విభజించే) యాత్ర. సైన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే దేశం ఊరుకోదు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ.. ప్రధాని మోదీని ద్వేషిస్తాయి. ఈ ద్వేషంతో వారి కళ్లు మూసుకుపోయాయి. దేశం పట్ల అంకితభావాన్ని పోగొట్టుకునే స్థాయికి దిగజారారు" అని భాజపా ప్రతినిధి గౌరవ్ భాటియా మండిపడ్డారు.

"బాలాకోట్ దాడులు చేశామని వాయుసేన ప్రకటించిన వెంటనే దీనిపై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు లేవనెత్తారు. రాహుల్​కు, కాంగ్రెస్ పార్టీకి సైన్యంపై విశ్వాసం లేదు. ప్రతిసారి సైన్యాన్ని ప్రశ్నిస్తూ.. దేశ ప్రజలను, సైనిక దళాలను అవమానిస్తున్నారు. ఘటన జరిగిన తర్వాత పాకిస్థాన్​ నుంచి దృష్టిమరల్చే పని చేశారు. దేశంలోని ఉగ్రవాదమే ఇందుకు కారణమని ఆరోపించారు. పాక్​కు క్లీన్​చిట్ ఇచ్చేందుకు యత్నించారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసినప్పుడు పాకిస్థాన్ తీవ్రంగా కలత చెందింది. భారత్​లో కాంగ్రెస్ పార్టీ అదే బాధ అనుభవించింది."
-గౌరవ్ భాటియా, భాజపా ప్రతినిధి

బాలాకోట్ దాడుల అనంతరం జరిగిన 2019 లోక్​సభ ఎన్నికల్లో భాజపా ఘన విజయం సాధించింది. 2014 సార్వత్రికంలో వచ్చిన సీట్ల కంటే అధిక నియోజకవర్గాల్లో గెలుపొందింది. 543 నియోజకవర్గాల్లో 300కు పైగా స్థానాలు కైవసం చేసుకుంది. ఈ ఎన్నికల ఫలితాలతో ప్రజలు ఎవరివైపు ఉన్నారో తెలిసిపోయిందని భాజపా నేత భాటియా పేర్కొన్నారు. సైన్యంపై ప్రశ్నలు సంధించిన పార్టీల ఉనికే ప్రశ్నార్థకమైపోయిందని అన్నారు.

"2008లో ముంబయి 26/11 ఉగ్ర దాడుల తర్వాత పాకిస్థాన్​ లక్ష్యంగా దాడులు చేయాలన్న సైన్యం ప్రతిపాదనకు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం అడ్డుచెప్పింది. అవినీతి, అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వానికి ధైర్యం లేక ఉగ్రదాడులకు బదులు ఇవ్వలేకపోయింది. కానీ, మోదీ సర్కారు.. ఉరీ, పుల్వామా దాడులకు గట్టిగా బదులిచ్చింది. ఉగ్రవాద క్యాంపులను లక్ష్యంగా చేసుకొని దాడి చేసింది. ప్రజాస్వామ్యంలో ప్రజల ఆశీర్వాదమే అన్నింటి కన్నా ముఖ్యం. 2019 ఎన్నికల్లో ప్రజలు భాజపా, సైనిక దళాల పక్షాన ఉన్నారని స్పష్టంగా తెలిసింది. ప్రశ్నలు లేవనెత్తినవారి అస్తిత్వమే సంక్షోభంలో పడింది."
-గౌరవ్ భాటియా, భాజపా ప్రతినిధి

'మాకు సంబంధం లేదు'
డిగ్గీ వ్యాఖ్యలు సంచలనమైన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. దిగ్విజయ్ సింగ్ చేసిన వ్యాఖ్యలు వ్యక్తిగతమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ స్పష్టం చేశారు. అవి కాంగ్రెస్ పార్టీ వైఖరిని సూచించవని అన్నారు. 2014కు ముందు యూపీఏ సర్కారు సైతం సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించిందని తెలిపారు. దేశ హితం కోసం నిర్వహించే అన్ని సైనిక చర్యలనూ కాంగ్రెస్ పార్టీ సమర్థించిందని, ఇకపైనా సమర్థిస్తుందని తేల్చిచెప్పారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.