తెలంగాణ

telangana

నదుల ఉగ్రరూపం- కొండ చరియలు విరిగి ప్రాణనష్టం

By

Published : Aug 7, 2020, 4:24 PM IST

మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కావేరీ, భీమా, పెరియార్​, హేమావతి, మీనాచిల్​, పంచగంగ వంటి నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కేరళలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. కర్ణాటకలోనూ పలు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి ఐదుగురు గల్లంతయ్యారు.

Heavy rains
ప్రమాదకర స్థాయిలో నదులు.. విరిగిపడుతోన్న కొండచరియలు

వరుణుడి బీభత్సానికి మహారాష్ట్ర, కేరళ, కర్ణాటక గజగజ వణుకుతున్నాయి. భారీ వర్షాలతో ఆయా రాష్ట్రాల్లోని నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. నదీ పరివాహక ప్రాంతాలు నీటమునిగాయి. కొండచరియలు విరిగిపడి పలువురు ప్రాణాలు కోల్పోయారు. రంగంలోకి దిగిన ఎన్​డీఆర్​ఎఫ్​, ఎస్​డీఆర్​ఎఫ్​, స్థానిక అధికారులు సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

కేరళలో 9కి మృతులు..

కేరళలో భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. ఇడుక్కి జిల్లా రాజమాలా ప్రాంతంలో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 9కి చేరింది. ఇంకా 57 మంది ఆచూకీ లభించలేదు. వారి కోసం గాలింపు ముమ్మరం చేశారు అధికారులు.

విరిగిపడిన కొండచరియలు

చాలా చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. 2 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. అళువాలో పెరియార్​ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. అక్కడి శివాలయం పూర్తిగా నీట మునిగింది. కొట్టాయం జిల్లా పూంజర్​ ప్రాంతంలో మీనాచీ నది ఉప్పొంగింది.

ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న సిబ్బంది

రెడ్​ అలర్ట్​..

కేరళలోని ఇడుక్కి, మలప్పురం​, వయనాడ్, పతనంతిట్ట​ జిల్లాల్లో ఆగస్టు 11 వరకు రెడ్​ అలర్ట్​ ప్రకటించారు అధికారులు. కర్వార్​ ప్రాంతంలోని మధుర, పర్నెమ్​ స్టేషన్ల మధ్య ఉన్న సొరంగంలో గోడ కూలిన నేపథ్యంలో 5 రైళ్లను దారి మళ్లించారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కురుస్తోన్న భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు నీటమునిగాయి. జనజీవనం స్తంభించింది. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. కొడగు, చిక్కమంగుళూరు ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. మహారాష్ట్రలో జలాశయాల గేట్లు తెరిచిన నేపథ్యంలో కృష్ణా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో బెళగావి జిల్లాల్లో పలు ప్రాంతాలు నీటమునిగాయి. అలాగే ఉత్తర కన్నడ, శివమొగ్గ జిల్లాల్లోనే ఇదే పరిస్థితి ఉంది.

నదుల్లో ప్రవాహం పెరిగిన నేపథ్యంలో ఆల్​మట్టి, కబిని సహా పలు జలాశయాల గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. కావేరి నది ఉప్పొంగటం వల్ల భాగమండల ఆలయం నీట మునిగింది.

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న నదులు.

బ్రహ్మగిరి హిల్స్​ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు గల్లంతయ్యారు. వారికోసం ఎన్​డీఆర్​ఎఫ్​ బృందాలు గాలింపు చేపట్టాయి. హాసన్​ జిల్లాలో కురుస్తున్న వర్షాలకు హేమావతి నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఓ ఆలయం పూర్తిగా నీటమునిగింది.

మహారాష్ట్రలో..

గత మూడు రోజులుగా మహారాష్ట్రలో కురుస్తోన్న భారీ వర్షాలకు పలు జిల్లాలు నీటమునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. కొల్హాపూర్​ జిల్లాలోని పంచగంగ నది ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. ఈ నదిపై ఉన్న రాజారం బ్యారేజీలో ప్రమాదకస్థాయిని మించి 44.7 అడుగల మేర నీరు చేరింది. ఈ నేపథ్యంలో గేట్లు తెరిచారు. ఇదే జిల్లాలోని భోగవతి నది.. ఉప్పొంగింది.

ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోన్న నదులు.

ఇదీ చూడండి: యువతి కడుపులో 1.5 కిలోల తల వెంట్రుకలు

ABOUT THE AUTHOR

...view details