Street Dog Lover Raghuram in Hyderabad : చుట్టూ పదుల సంఖ్యలో వీధి శునకాలు వాటిని ముద్దుగా పేర్లు పెట్టి పిలుస్తూ నుదిటిపై ప్రేమగా నిమురుతున్న ఈ యువకుడి పేరు రఘురాం. నేటి యువత ఆలోచనలు ఎంత కొత్తగా ఉంటాయో ఇతడిని చూసి చెప్పొచ్చు. వివిధ స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే యానిమల్ రెస్క్యూ ఆపరేషన్‌లో కూడా పనిచేశాడు. ఎన్నో మూగజీవాలను గత పదేళ్లుగా సంరక్షిస్తూ వాటి నేస్తంగా మారాడు రఘురాం.
ఆ వృద్ధురాలికి వీధి కుక్కలే ప్రపంచం
Caring Home for Street Dogs :రఘురాం స్వస్థలం రాజమండ్రి. పుట్టి పెరిగిదంతా హైదరాబాద్. చిన్నప్పటి నుంచి శునకాలు, పక్షులంటే మహా ఇష్టం. తెలిసిన వారి పెంపుడు జంతువులు అనారోగ్యానికి గురైనా లేదా ఆపదలో చిక్కుకున్నా నేనున్నానంటూ ముందుకు వచ్చేవాడు. నగరంలోని ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తూనే ఖాళీ సమయాల్లో రెస్క్యూ ఆపరేషన్లలో కూడా ఈ జంతు ప్రేమికుడు పాల్గొనేవాడు.
"నేను యానిమల్ రెస్క్యూ ఆపరేషన్లలో పది సంవత్సరాల నుంచి పాల్గొంటున్నాను. షెల్టర్‌ను స్థాపించి రెండు సంవత్సరాలైంది. జీవ వాత్సల్య రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశాను. వీధి శునకాలకు మూడు పూటల భోజనంతో పాటు అనారోగ్యం పాలైన వాటికి చికిత్స అందిస్తున్నా. ఇందుకోసం నెలకు దాదాపు లక్షన్నరకుపైగా ఖర్చు అవుతుంది. - రఘురాం, రిహాబిలిటేషన్ నిర్వాహకుడు
కరోనా సమయంలో ఉద్యోగం కోల్పోయినా ఎప్పుడూ నిరుత్సాహపడలేదు రఘురాం. కానీ తన బాధంతా తనతో ఉన్న శునకాల గురించే. దాంతో వాటి పోషణ కోసం నెట్వర్క్ ఇంజినీర్‌గా ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాడు. అయితే ఇలా ఎంతకాలం అని తనను తానే ప్రశ్నించుకున్నాడు. మూగజీవాల సంరక్షణనే వ్యాపారంగా మలుచుకుందామని ప్రయత్నాలు చేశాడు. స్వార్థంతో చేసే వ్యాపారం సత్ఫలితాలను ఇవ్వదని గ్రహించాడు రఘురాం.
దీంతో తన మనసులో ఉన్న ఆలోచనలను స్నేహితులతో రఘురాం పంచుకున్నాడు. వీధి శునకాల కోసం ప్రత్యేకంగా షెల్టర్ ఏర్పాటు చేయాలనుకున్నాడు. మిత్రుల సహకారంతో బాచుపల్లిలో కొంత స్థలాన్ని లీజుకు తీసుకొని జీవ వాత్సల్య రెస్క్యూ రిహాబిలిటేషన్ సెంటర్ (Jeeva Vatsalya Rescue Rehabilitation Centre) పేరుతో కేంద్రాన్ని మొదలు పెట్టాడు. రెస్క్యూ ఆపరేషన్లలో దొరికిన కుక్కలను, రోడ్లపై వదిలేసిన, రహదారి ప్రమాదాల్లో గాయపడ్డ వాటిని అక్కున చేర్చుకుని ఆశ్రయం కల్పించాడు రఘురాం.