తెలంగాణ

telangana

ఈ వారం ఆ రాశుల వారికి ఒత్తిడి తప్పుదు- తొందరపాటు నిర్ణయాలు వద్దు! - Weekly Horoscope

By ETV Bharat Telugu Team

Published : May 12, 2024, 3:26 AM IST

Weekly Horoscope From May 12th to 18th 2024 : 2024 మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

Weekly Horoscope
Weekly Horoscope (ETV Bharat)

Weekly Horoscope From May 12th to 18th 2024 :2024 మే 12వ తేదీ నుంచి మే 18వ తేదీ వరకు మీ రాశి ఫలం ఎలా ఉందంటే ?

మేషం (Aries) :మేష రాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. వారం చివరి నాటికి వృత్తి, వ్యాపారం, పోటీ పరీక్షలకు సంబంధించిన శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులు ఎంతో కాలంగా ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లయితే, ఈ వారం మీ కోరిక నెరవేరవచ్చు. వారం ప్రారంభంలో మతపరమైన, సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. చేతికి అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. అవకాశాలు ఒకసారి చేజారితే మళ్ళీ దొరకడం కష్టం. ఉద్యోగులకు శుభసమయం నడుస్తోంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. సహోద్యోగుల సహకారం ఉంటుంది. వ్యాపారులకు ఆశించిన లాభాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు ఉన్నత పదవి, ప్రశంసలు, సమాజంలో గౌరవం ఉంటాయి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

వృషభం (Taurus) :వృషభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతనోత్తేజంతో కష్టపడి పనిచేసి వ్యాపారాన్ని వృద్ధిలోకి తీసుకొస్తారు. ఉద్యోగులు కెరీర్‌లో దూసుకెళ్తారు. అసూయపరుల పట్ల అప్రమత్తంగా ఉండండి. మీ విజయమే మీ శత్రులవుల ఓటమికి కారణం అవుతుంది. మీ ప్రియమైన వ్యక్తులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఇంట్లో కొన్ని అనుకోని సమస్యలు రావచ్చు. అయితే ఇవి తాత్కాలికమే. వారం చివరలో ఉద్యోగులకు స్థానచలనం ఉండవచ్చు. రాజకీయ నాయకులు ఊహించని విరోధులు కనిపించినప్పుడు సంయమనంతో ప్రవర్తించడం, సమయస్ఫూర్తితో మాట్లాడటం అవసరం. ప్రతిరోజూ శివాష్టకం పఠిస్తే ఆపదలు దరి చేరవు.

మిథునం (Gemini) :మిథునరాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రథమార్ధంలో మీ పోటీదారుల పట్ల, ప్రత్యర్థుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మీ విజయానికి ఆటంకాలు సృష్టించే అవకాశముంది. ఎంతో జాగ్రత్తగా, సంయమనంతో మెలగాలి. మాటలు పొదుపుగా జాగ్రత్తగా మాట్లాడండి. లేకుంటే వివాదాలు రాగలవు. వారం చివరలో వ్యాపారులకు, ఉద్యోగులకు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఆర్ధిక పురోగతి ఉంటుంది. జీవిత భాగస్వామితో కలిసి విహార యాత్రలకు వెళ్తారు. రాజకీయ నాయకులు విజయం దిశగా పయనిస్తున్నారు. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

కర్కాటకం (Cancer) :కర్కాటక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వారం ప్రథమార్ధంలో ఇంటా బయట ఎలాంటి సహకారం లభించదు. ముఖ్యమైన పనులు పూర్తి కావడంలో జాప్యం ఉంటుంది. తీవ్రమైన ఒత్తిడి వల్ల స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా ఉండవచ్చు. వ్యాపారులు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వారం చివరలో అనుకూల ఫలితాలు ఉంటాయి. అన్ని సమస్యలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి. ఉద్యోగులు తోటి ఉద్యోగులతో సత్సంబంధాలు పెంచుకుంటే మంచిది. ధైర్యం, ఉత్సాహంతో పనిచేసి అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. రాజకీయ నాయకులు ప్రత్యర్థులపై విజయాన్ని సాధిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఎదురుచూడని ఆర్ధిక లాభాలు ఉంటాయి.సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కోర్టుకు సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆదిత్య హృదయం పఠిస్తే మెరుగైన ఫలితాలు ఉంటాయి.

సింహం (Leo) :సింహరాశి వారికి ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. అన్ని రంగాల వారికి శుభం, అదృష్టాలు సమృద్ధిగా ఉంటాయి. విజయోత్సాహంతో ఉరకలేస్తూ ఉంటారు. అయితే అత్యుత్సాహం పనికిరాదు. పెద్దలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరి మనసు నొప్పించే విధంగా మాట్లాడవద్దు. పోటీ పరీక్షల కోసం తయారవుతున్న విద్యార్థులు కష్టపడితే అద్భుతమైన విజయాలను పొందగలరు. ఉద్యోగులకు దీర్ఘకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం దొరకడం వల్ల ప్రశాంతంగా ఉంటారు. కొత్త ఆదాయ మార్గాలు లభిస్తాయి. వ్యాపారులకు పెట్టుబడులు, లాభాల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. స్థిరాస్తి రంగం వారికి నూతన ప్రాజెక్టులు మొదలు పెట్టడానికి శుభసమయం. రాజకీయ నాయకులకు అనుకూలమైన సమయం. శని శ్లోకాలు చదివితే మేలు జరుగుతుంది.

కన్య (Virgo) : కన్యారాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. వారం ప్రథమార్ధంలో పని ఒత్తిడి, కుటుంబ సమస్యలు అధికంగా ఉంటాయి. తొందరపాటు నిర్ణయాలు చేటు చేస్తాయి. మీ శ్రేయోభిలాషుల సహకారం తీసుకోండి. అప్పుడే లక్ష్యాలను సాధించగలుగుతారు. ఓర్పుతో సహనంతో ఉండండి. చెడు సమయం తర్వాత మంచి సమయం తప్పకుండా వస్తుంది. వారం చివరలో మీ జీవిత భాగస్వామి చొరవతో అన్ని సమస్యలు తొలగుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. రాజకీయ నాయకులు విజయం కోసం తీవ్రంగా శ్రమించాలి. శివాలయ సందర్శనం శుభకరం.

తుల (Libra) :తులారాశి వారు ఈ వారం అద్భుతమైన అదృష్టాన్ని పొందుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేసి గొప్ప విజయాలను అందుకుంటారు. వ్యాపారులు విపరీతమైన లాభాలను పొందుతారు. విద్యార్థులు మంచి విజయాలను సాధిస్తారు. ఈ వారం రాజకీయ రంగంలోని వారు మంచి పురోగతిని సాధిస్తారు. సమాజంలో గౌరవం కూడా ఉంటుంది. నూతన బాధ్యతలను కూడా స్వీకరిస్తారు. రాజకీయంగా ఉన్నత స్థానానికి ఎదుగుతారు. వారం మధ్యలో గృహంలో కొన్ని సమస్యలు ఆందోళన కలిగించవచ్చు. కానీ మీ ప్రతిభతో వాటిని పరిష్కరిస్తారు. ఈ రాశి వారు ఈ వారం ఆర్థిక పరమైన ప్రయోజనాలను అందుకుంటారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం.

వృశ్చికం (Scorpio) :వృశ్చిక రాశి వారికి ఈ వారం సామాన్యంగా ఉంటుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ఆచి తూచి నడుచుకుంటే మేలు. అవాంతరాలు సృష్టించే వారు మీ పక్కనే ఉంటారు. జాగ్రత్తగా ఉండండి. మాటలు సమయానుకూలంగా మాట్లాడండి. శత్రువులకు వారి దారిలోనే వెళ్లి జవాబు చెప్పండి. కోర్టు సంబంధిత సమస్యలను కోర్టు వెలుపల పరిష్కరించుకుంటే సమయం వృధా కాదు. ప్రయాణాలలో చోరభయం ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు అదుపులో ఉంచుకోండి. రాజకీయ నాయకులు దైవబలం నమ్ముకుంటే విజయావకాశాలు మెరుగవుతాయి. శ్రీ సుబ్రమణ్య స్వామి భుజంగ స్తోత్రం పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

ధనుస్సు (Sagittarius) :ధనుస్సురాశి వారికి ఈ వారం అదృష్టదాయకంగా ఉంటుంది. వృత్తి వ్యాపారం చేసే వారు సానుకూల వార్తలు వింటారు. పెట్టుబడుల రూపంలో ధనప్రవాహం ఉంటుంది. కొత్త పెట్టుబడులు లాభాలను తెచ్చి పెడతాయి. అయితే పెట్టుబడులు పెట్టే ముందు సన్నిహితులు, నిపుణులను సంప్రదిస్తే మేలు. రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు లేదా ముఖ్యమైన బాధ్యతలు దక్కవచ్చు. పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి శుభసమయం. విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇష్ట దేవతారాధన మేలు చేస్తుంది.

మకరం (Capricorn) :మకరరాశి వారికి ఈ వారం చాలా విలక్షణమైన ఫలితాలు ఉంటాయి. వ్యాపారులకు ముఖ్యమైన పనుల్లో తొందరపాటు ఉండకూడదు. తొందరపాటు నిర్ణయాలతో నష్టపోతారు. ఉద్యోగులు క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకోవద్దు. ఓర్పుతో వేచి చూస్తే మీరు ఆశించిన ప్రయోజనాలు ఉంటాయి. ఉద్యోగ మార్పు కోరుకునేవారు ప్రయత్నాలు చేయడానికి అనుకూలమైన సమయం. వాదనలకు దూరంగా ఉండటం ముఖ్యం. రాజకీయ నాయకులకు శ్రమతోనే విజయం దక్కుతుంది. శని స్తోత్రాలు పఠిస్తే అనుకూల ఫలితాలు ఉంటాయి.

కుంభం (Aquarius) :కుంభ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నూతన ఆదాయ వనరులు ఏర్పాటు చేసుకున్నప్పటికిని ఖర్చులు అదుపు తప్పడం వల్ల అశాంతికి లోనవుతారు. ఉద్యోగులకు సహోద్యోగుల సహకారం ఉంటుంది. జీతం పెరుగుదల, ప్రమోషన్ ఛాన్స్ ఉంటుంది. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తి జీవితాన్ని సమన్వయము చేసుకుంటూ ముందుకెళ్లండి. కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. లేకపోతే అపార్ధాలు ఏర్పడవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అందరి సలహా తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నవారు అందరినీ కలుపుకొని ముందుకెళ్తే విజయం ఉంటుంది. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు ఉంటాయి.

మీనం (Pisces) :మీనరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులు తమ పై అధికారుల నుంచి సంపూర్ణ మద్దతుని పొందుతారు. ఉద్యోగంలో కోరుకున్న చోటికి బదిలీ, పదోన్నతి ఉంటాయి. ఆర్ధిక ప్రయోజనాలు కూడా ఉంటాయి. కొత్తగా చేపట్టే ప్రాజెక్టులు మీ స్థాయిని పెంచుతాయి. ఆరోగ్యం సహకరిస్తుంది. విద్యార్థులు తిరుగులేని విజయాలను సాధిస్తారు. వ్యాపారులకు అదృష్టం వరిస్తుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన ధనం సమకూరుతుంది. ఇంట్లో శుభకార్యక్రమాలు నిర్వహిస్తారు. పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. రాజకీయ నాయకులను విజయలక్ష్మి వరిస్తుంది. శ్రీలక్ష్మి అష్టోత్తరం చదివితే రెట్టింపు శుభ ఫలితాలు ఉంటాయి.

ABOUT THE AUTHOR

...view details