తెలంగాణ

telangana

కస్టమ్స్​ ఆఫీసర్​ పేరుతో 250మంది మహిళలకు గాలం- పెళ్లి పేరుతో మోసం- చివరకు చిక్కాడిలా!

By ETV Bharat Telugu Team

Published : Feb 29, 2024, 1:56 PM IST

Man Cheated More Than 250 Women : మ్యాట్రిమోనీ వెబ్​సైట్​ ద్వారా పరిచయమై 250పైగా మహిళలను మోసం చేశాడు ఓ కేటుగాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి వారి దగ్గరి నుంచి డబ్బులు వసూలు చేశాడు. చివరకు పోలీసులకు చిక్కి కటకటాలపాలయ్యాడు. ఇంతకీ నిందితుడు ఎలా పట్టుబడ్డాడంటే?

Man Cheated More Than 250 Women
Man Cheated More Than 250 Women

Man Cheated More Than 250 Women :మ్యాట్రిమోనీ వెబ్​సైట్​ ద్వారా పరిచయమై 250పైగా మహిళలను మోసం చేశాడు ఓ వ్యక్తి. ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న వారిని టార్గెట్​ చేసి, తాను కస్టమ్స్​ ఆఫీసర్​ను అని నమ్మించాడు. అనంతరం పెళ్లి చేసుకుంటానని వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి జెండా ఎత్తేశాడు. చివరకు పోలీసులకు దొరికి కటకటాలపాలయ్యాడు. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది.

కస్టమ్స్​ ఆఫీసర్​నంటూ!
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం, నిందితుడిని రాజస్థాన్​కు చెందిన నరేశ్ పూరి(45). అతడు​ ఇంతకుముందు బెంగళూరు కాటన్​పేట్​లోని ఓ క్లాత్​ షాప్​లో పనిచేసేవాడు. ఆ సమయంలో పెద్ద సంఖ్యలో ప్రీ-యాక్టివ్ సిమ్​ కార్డులను కొనుగోలు చేశాడు. న్యూస్​ పేపర్లలోని వివాహ ప్రకటనల్లో కనిపించిన మహిళల నంబర్లకు ఈ సిమ్​ కార్డులతో ఫోన్ చేసి మాట్లాడేవాడు. తన పేరు పవన్​ అగర్వాల్​ అని, తాను విమానాశ్రయంలో కస్టమ్స్​ ఆఫీసర్​గా పనిచేస్తున్నట్లు ఫేక్​ బయోడేటా, తప్పుడు ఫొటోలను వారికి పంపేవాడు.

వాట్సాప్​లో టార్గెట్ చేసి!
అంతేకాకుండా నరేశ్​ 'అగర్​సెంజీ వివాహిక్ మంచ్' అనే వాట్సాప్​ గ్రూప్​లో కూడా జాయిన్ అయ్యాడు. అందులో ఉన్న ఒంటరి మహిళలు, విడాకులు తీసుకున్న వాళ్లను గుర్తించి వారితో ఫోన్లో మాట్లాడేవాడు. పెళ్లి చేసుకుంటానని వారిని నమ్మించేవాడు. ఆ తర్వాత పెళ్లి సంబంధం మాట్లాడుకుందామని వారిని బెంగళూరుకు పిలిపించేవాడు. బాధితులను కలవడానికి ముందు డబ్బులు తీసుకునేవాడు. దీని కోసం వేరే నంబర్​ ఉపయోగించేవాడు. ఆ తర్వాత నంబర్​ బ్లాక్​ చేసి ప్లేట్​ ఫిరాయించేవాడు. అయితే నిందితుడు కేవలం రాత్రి సమయాల్లోనే మహిళలతో మాట్లాడేవాడని పోలీసుల దర్యాప్తులో తేలింది.

చివరికి పట్టుబడ్డాడిలా!
న్యూస్​పేపర్​, వాట్సాప్​ల్లోనే కాకుండా మ్యాట్రిమోనీ వెబ్​సైట్​ ద్వారా కూడా మహిళలను మోసం చేశాడీ కేటుగాడు. వెబ్​సైట్​లో కూడా పవన్​ అగర్వాల్ పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అనంతరం కొయంబత్తూర్​కు చెందిన విడాకులు తీసుకున్న మహిళను పరిచయం చేసుకున్నాడు. ఆమెతో మాట్లాడి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. వివాహ సంబంధం మాట్లాడుకుందామని మహిళతో సహా ఆమె తల్లిదండ్రులను బెంగళూరుకు పిలిపించాడు. ఆపై బెంగళూరుకు వచ్చిన మహిళ తల్లిదండ్రులకు ఫోన్ చేసి 'మా మామయ్య మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు' అని చెప్పి ఒక వ్యక్తిని పంపించాడు.

ఆ తర్వాత ఆ వ్యక్తి, టికెట్​ రిజర్వేషన్ చేసుకోవాలని, తన పర్సు ఇంటి వద్ద మరిచిపోయానని చెప్పి వారి దగ్గరి నుంచి రూ.10వేలు తీసుకున్నాడు. ఇంటికి వెళ్లిన వెంటనే డబ్బులు తిరిగి ఇస్తానన్నాడు. టికెట్​ రిజర్వేషన్ చేసుకున్నాక ఫోన్​ స్విచ్​ ఆఫ్​ చేసి అక్కడి నుంచి పరారయ్యాడు. తాము మోసపోయామని గ్రహించిన మహిళ తల్లిదండ్రులు రైల్వే పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు.

అయితే నిందితుడు 250పైగా మహిళలను ఇలా మోసం చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల్లో రాజస్థాన్‌(56 మంది), ఉత్తరప్రదేశ్‌(32 మంది), దిల్లీ (32), కర్ణాటక (17), మధ్యప్రదేశ్‌(16), మహారాష్ట్ర(13), గుజరాత్‌(11), తమిళనాడు(6), ఝార్ఖండ్(5), ఆంధ్రప్రదేశ్(2)కు చెందిన మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇలా మోసపోయిన వారు తమ ఫిర్యాదులను సంబంధిత స్టేషన్లలో ఇవ్వాలని రాష్ట్ర రైల్వే శాఖ డీఐజీపీ డాక్టర్ ఎస్ డి శరణప్ప వెల్లడించారు.

అమెరికాలో డాక్టర్‌నంటూ.. అందినకాడికి దోచేశాడు

భార్య నిత్యలక్ష్మి.. భర్త 'నిత్య' పెళ్లి కొడుకు!

ABOUT THE AUTHOR

...view details