ETV Bharat / crime

అమెరికాలో డాక్టర్‌నంటూ.. అందినకాడికి దోచేశాడు

author img

By

Published : Apr 20, 2022, 10:37 AM IST

Matrimony Crimes
Matrimony Crimes

Matrimony Fraud : ఒంటరి మహిళలకు మేమున్నామంటూ నమ్మిస్తూ సైబర్ కేటుగాళ్లు వల వేస్తున్నారని సైబర్ క్రైమ్ పోలీసులు చెబుతున్నారు. వివాహం చేసుకుంటామని, విదేశాల్లో ఉన్నామని, బహుమతులు పంపించామంటూ ఇలా రకరకాల కారణాలతో అమాయక మహిళలకు మాయమాటలు చెప్పి వారి నుంచి డబ్బు గుంజుతున్నారని అన్నారు. ఆశల వల వేసి నగదు కాజేస్తున్న సైబర్ నేరగాళ్ల విషయంలో అమ్మాయిలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఇలా సైబర్ మాయగాళ్ల వలలో పడి మోసపోయిన ఓ మహిళ నుంచి ఆ కేటుగాళ్లు.. రూ.40 లక్షలు కాజేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.

Matrimony Fraud : భర్త నుంచి విడిపోయి ఒంటరిగా ఉంటున్న ఓ మహిళ(40) భాగ్యనగరంలోని కార్పొరేట్‌ సంస్థలో ఉద్యోగం చేస్తున్నారు. గతేడాది మార్చిలో జీవిత భాగస్వామి కోసం డైవోర్సీ మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేశారు. నవంబరులో ఆ వెబ్‌సైట్‌ను పరిశీలిస్తుండగా ఓ వ్యక్తి (రవి మనీష్‌) వివరాలు ఆకట్టుకున్నాయి. అతడి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి వివరాలు సేకరించి వాట్సప్‌ నంబరుతో ఆమె మాట కలిపారు. ఒకరి గురించి మరొకరు తెలుసుకున్నారు.

అమెరికాలో డాక్టర్‌నంటూ.. : తాను అమెరికాలో ఆర్థోపెడిక్‌ సర్జన్‌గా పనిచేస్తున్నట్టు తెలిపాడు. ప్రత్యేక విధుల్లో భాగంగా టర్కీ మిలటరీ బేస్‌మెంట్స్‌లో విధులు నిర్వర్తిస్తున్నట్టు నమ్మించాడు. ఇద్దరి అభిరుచులు, ఆలోచనలు కలవటంతో పెళ్లి చేసుకుని కొత్త జీవితం ప్రారంభిద్దామంటూ ఆశ చూపాడు. అసోంలోని గువాహటిలో తన బంధువులున్నారంటూ ఓ వ్యక్తి (ప్రియ మహేంద్ర) వాట్సాప్‌ నంబరు ఆమెకు పంపాడు. టర్కీ నుంచి వచ్చేందుకు 1500 అమెరికన్‌ డాలర్లు అక్కడ చెల్లించాల్సి ఉంటుందంటూ తెలివిగా బాధితురాలిని బుట్టలో పడేశాడు. అక్కడ నుంచి రాగానే పెళ్లి చేసుకుందామని, తన వద్ద చాలా డబ్బు ఉందని మాయమాటలతో నమ్మించాడు. బాధితురాలు వివిధ బ్యాంకుల 12ఖాతాల్లో దఫాల వారీగా మొత్తం రూ.34,12,005 జమ చేసింది. మార్చి 23న పెళ్లి చేసుకుంటానన్నాడు.

రూ.40 లక్షలు స్వాహా : అదే నెల 24న బాధితురాలి మొబైల్‌ నంబరుకు ఒక మహిళ ఫోన్‌ చేశారు. దిల్లీ విమానాశ్రయంలో రవి మనీష్‌ పట్టుబడ్డాడని, అతడి వద్ద రూ.8 కోట్లు (అమెరికన్‌ డాలర్లు) దొరికాయంటూ ఫోన్‌ ద్వారా వివరించారు. ఆ డబ్బుకు సంబంధించిన పత్రాలు లేకపోవటం వల్ల డీడీ ఛార్జెస్‌, కస్టమ్స్‌ డ్యూటీ కింద రూ.6,07,005 వెంటనే చెల్లించాలంటూ బాధితురాలి వాట్సాప్‌ నంబరుకు బ్యాంకు ఖాతా వివరాలు పంపారు. అప్పటికిగానీ బాధితురాలికి అసలు విషయం బోధపడలేదు. తాను మోసపోయినట్టు గ్రహించిన ఆమె సైబరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వివాహం, బహుమతులు వచ్చాయంటూ సైబర్‌ మాయగాళ్లు మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ఆశల వల వేసి పెద్దఎత్తున డబ్బు కొట్టేస్తున్న సైబర్‌ నేరస్థుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.