కమలానికి గుడ్ బై చెప్పి కారెక్కిన తుల ఉమ
Tula Uma To Join BRS Party : బీజేపీ నుంచి టికెట్ ఆశించి భంగపడ్డ తుల ఉమ ఎట్టకేలకు బీజేపీ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా పని చేసిన తుల ఉమ.. గతంలో ఈటల రాజేందర్‌తో కలిసి బీజేపీలో చేరారు. ఆ పార్టీ నుంచి వేములవాడ టికెట్ ఆశించిన తుల ఉమకు పార్టీ అధిష్టానం టికెట్టు ప్రకటించినప్పటికీ.. బీఫామ్ మాత్రం చెన్నమనేని వికాస్ రావుకు ఇవ్వడంతో భంగపడి కంటతడి పెట్టారు.
తనకు అన్యాయం జరిగిన పార్టీలో ఉండబోనని స్పష్టం చేసిన తుల ఉమ తన ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ క్రమంలో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ నాయకులు.. తమ పార్టీల్లోకి ఆహ్వానించారు. చివరకు మంత్రి కేటీఆర్‌తో పాటు వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీనరసింహారావు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. తన అనుచరులతో సమావేశమైన తుల ఉమ కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.