ETV Bharat / business

టీసీఎస్ సీఈఓ జీతం ఎంతో తెలుసా? ఆయన కంటే తక్కువే! - TCS CEO Salary

author img

By ETV Bharat Telugu Team

Published : May 9, 2024, 4:37 PM IST

TCS CEO Salary
TCS CEO Salary (Getty Images)

TCS CEO Salary : టీసీఎస్ కంపెనీ కొత్త సీఈఓ కె.కృతివాసన్‌కు గత ఆర్థిక సంవత్సరం అత్యధికంగా రూ.25.36 కోట్ల వార్షిక స్థూల వేతనం ఆర్జించారు. ఆయనకు లభించిన మొత్తం రూ.25.36 కోట్ల స్థూల వేతనంలో రూ. 21 కోట్లు కంపెనీ ఇచ్చిన కమీషన్లే ఉండటం గమనార్హం.

TCS CEO Salary : టీసీఎస్ కంపెనీ కొత్త చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) కె. కృతివాసన్‌కు గత ఆర్థిక సంవత్సరం(2023-24)లో అత్యధికంగా రూ.25.36 కోట్ల వార్షిక స్థూల వేతనం లభించింది. ఈ విషయాన్ని కంపెనీ గురువారం అధికారికంగా ప్రకటించింది. రాజేశ్ గోపీనాథన్ ఆకస్మిక నిష్క్రమణ తర్వాత 2023 జూన్‌లో టీసీఎస్ సీఈఓ పగ్గాలను ఐదేళ్ల కాలం కోసం కృతివాసన్ చేపట్టారు. కంపెనీ వార్షిక నివేదిక ప్రకారం, కృతివాసన్‌కు లభించిన మొత్తం రూ.25.36 కోట్ల స్థూల వేతనంలో రూ.1.27 కోట్ల నికర వేతనం, రూ. 3.08 కోట్ల ఇతర ప్రయోజనాలు, భత్యాలు, అలవెన్స్, రూ. 21 కోట్ల కమీషన్ ఉన్నాయి. టీసీఎస్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల గ్లోబల్ హెడ్‌ హోదాలో ఉండటం వల్ల అటువైపు నుంచి ఆకర్షణీయమైన కమీషన్ ఆదాయం కృతివాసన్‌కు లభించింది.

శాలరీలో దాగిన లెక్కలివీ
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, టీసీఎస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీఓఓ) ఎన్​జీ సుబ్రమణ్యం కూడా గత ఆర్థిక సంవత్సరంలో రూ.26.18 కోట్ల స్థూల వేతనాన్ని ఆర్జించారు. ఆయన త్వరలోనే పదవీ విరమణ చేయనున్నారు. సుబ్రమణ్యం ఆర్జించిన మొత్తం రూ.26.18 కోట్ల స్థూల వేతనంలో రూ.1.72 కోట్ల నికర వేతనం, రూ.3.45 కోట్ల ఇతర ప్రయోజనాలు, భత్యాలు, అలవెన్సులు, రూ.21 కోట్ల కమీషన్ ఆదాయం ఉన్నాయి. సీఓఓ ఎన్​జీ సుబ్రమణ్యం రెమ్యునరేషన్ గత సంవత్సరం వ్యవధిలో 8.2 శాతం మేర పెరిగిందని టీసీఎస్ వెల్లడించింది.

అయితే ఎన్​జీ సుబ్రమణ్యం, కె. కృతివాసన్‌ సంపాదనలను పోల్చలేమని ఎందుకంటే వారిద్దరి హోదాల్లో తేడా ఉందని టీసీఎస్​ స్పష్టం చేసింది. అంతకుముందు కంపెనీ సీఈఓగా సేవలందించిన రాజేశ్ గోపీనాథన్ కేవలం రెండు నెలల సర్వీసులో రూ. 33.6 లక్షల నికర జీతం, రూ. 76.8 లక్షలు ఇతర ప్రయోజనాలు, అలవెన్సులు, భత్యాలను ఆర్జించారని వెల్లడించింది. 'టీసీఎస్ సీఓఓ వేతనం దాని ఉద్యోగుల మధ్యస్థ వేతనం కంటే 346.2 రెట్లు ఎక్కువగా ఉంటుంది. 2024 మార్చి 31 నాటికి ఇది ప్రతినెలా రూ.6,01,546గా ఉంది' అని తెలిపింది. కంపెనీ మాజీ సీఈఓ రాజేశ్ గోపీనాథన్ 2023 ఆర్థిక సంవత్సరంలో రూ.29.16 కోట్లు ఆర్జించారు. ఇది ప్రస్తుత సీఈఓ కృతివాసన్‌ వేతనం కంటే కొంచెం ఎక్కువే.

ఉద్యోగుల్లో 35.6 శాతం మంది మహిళలే
తమ కంపెనీ ఉద్యోగుల సగటు వార్షిక వేతన పెరుగుదల 5.5 శాతం నుంచి 8 శాతం మధ్య ఉందని టీసీఎస్ ప్రకటించింది. భారతదేశంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచే ఉద్యోగులకు రెండంకెల ఇంక్రిమెంట్లు కూడా ఇస్తున్నామని వెల్లడించింది. గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి టీసీఎస్​ ఉద్యోగుల్లో 35.6 శాతం మంది మహిళలు ఉన్నారని తెలిపింది. కంపెనీ ఉద్యోగులలో దాదాపు 55 శాతం మంది ఆఫీసు నుంచే పని చేస్తున్నారని పేర్కొంది. కంపెనీ రెవెన్యూ వృద్ధి రేటు నెమ్మదించిందని, అదే గతేడాదిలో 17.6 శాతం ఉండగా, ఇప్పుడు 6.8 శాతానికి తగ్గిందని చెప్పింది. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ)కి మంచి భవిష్యత్తు ఉందని, దీనికి సంబంధించిన క్లౌడ్, డేటా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ప్రాసెసింగ్ విభాగాల్లో పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టామని టీసీఎస్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ వెల్లడించారు. జనరేటివ్ ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వల్ల భవిష్యత్తులో మనం అనూహ్య మార్పులను చూస్తామని జోస్యం చెప్పారు.

SBI లాభం 18% జంప్- 3 నెలల్లోనే రూ.21,384 కోట్లు ప్రాఫిట్ - SBI Q4 Results 2024

దలాల్ స్ట్రీట్ ఢమాల్​- సెన్సెక్స్ 1062 పాయింట్లు డౌన్ - Stock Market End Today

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.