అసెంబ్లీ ఎన్నికల బరిలో సర్పంచ్ నవ్య - స్టేషన్ ఘన్‌పూర్ నుంచి ఇండిపెండెంట్‌గా నామినేషన్
Sarpanch Navya Nomination as Station Ghanpur Independent : జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జానకిపురం సర్పంచ్ నవ్య ఇండిపెండెంట్‌గా నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భర్తతో కలిసి నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన ఆమె.. రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నవ్య.. బీఆర్ఎస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా ప్రజలకు సేవ చేసానని.. ఇప్పుడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలనుకుంటున్నానని తెలిపారు.
ప్రతి ఒక్కరు తనను ఆదరించాలని.. తాను ఏ పార్టీకి వ్యతిరేకం కాదని వెల్లడించారు. ఎవరిమీద కోపం లేదని.. ఎవరికోసమో చేయడం లేదని.. ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో స్వంతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశానని జానకిపురం సర్పంచ్ నవ్య అన్నారు. సీఎం కేసీఆర్ తనకు అవకాశం ఇస్తే.. ఘనపూర్ ఎమ్మెల్యేగా నామినేషన్ వేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ గతంలో మీడియాతో తన అభిప్రాయాన్ని నవ్యం వ్యక్తం చేశారు. అదలా ఉండగా ఇప్పుడు ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగడం ఆసక్తికరంగా మారింది.