తెలంగాణకు ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్య : కేసీఆర్
KCR Praja Ashirvada Sabha Meeting at Nagarkurnool : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రజాఆశీర్వాద సభ పేరిట సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. స్థానిక అభ్యర్థులను గెలిపించమని కోరుతూ.. 9 ఏళ్ల అభివృద్ధిని వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగర్ కర్నూల్లో బీఆర్ఎస్(BRS) నాయకులు నిర్వహించే బహిరంగ సభలో పాల్గొన్నారు. నాగర్కర్నూల్లో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపిస్తే.. నెల రోజుల్లోనే ఇంజినీరింగ్ కళాశాల నిర్మాణానికి జీఓ విడుదల చేస్తానని తెలిపారు. దీంతో పాటు వట్టం రిజర్వాయర్ పనులు చేయిస్తానని హామీ ఇచ్చారు. మనదేశ ప్రజాస్వామ్యంలో తగినంత పరిణతి రాలేదని అన్నారు. ప్రజల్లో పరిణతి వస్తేనే.. దేశం, రాష్ట్రం బాగుపడుతుందని చెప్పారు. సరిగ్గా ఆలోచించి ఓటు వేయకపోతే బతుకులు ఆగమైపోతాయాని సూచించారు.
KCR Comments on Congress : ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు.. వారి పార్టీల చరిత్రను చూసి ఓటు వేయాలని కేసీఆర్(KCR) తెలిపారు. 50 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏం చేసిందో ఆలోచించాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణను సాధించుకున్నామని వివరించారు. ఆర్థిక నిపుణులతో చర్చించి సంక్షేమ పథకాలు రూపొందించామని పేర్కొన్నారు. 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేయించి.. 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశామని గుర్తు చేశారు. రాష్ట్రంలో 60 లక్షల మందికి రైతుబంధు ఇస్తున్నామని తెలిపారు. ఈ ఎన్నికలు తెలంగాణకు జీవన్మరణ సమస్య వంటివని అన్నారు.