అచ్చంపేటలో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్‌ఎస్- ఎమ్మెల్యే గువ్వల బాలరాజుకు స్వల్ప గాయాలు
Attack on Achampet MLA Guvvala Balaraju : నాగర్కర్నూల్ జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. అచ్చంపేటలో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అచ్చంపేటలో ఓ కారును హస్తం శ్రేణులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యే బాలరాజు డబ్బు తరలిస్తున్నారని వారు ఆరోపిస్తూ.. వాహనంపై రాళ్ల దాడి చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న బీఆర్ఎస్ కార్యకర్తలు.. వారితో వాగ్వాదానికి దిగారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాలు పరస్పరం ఒకరిపై మరొకరు రాళ్లు వేసుకోగా కొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
Clash Between BRS Congress Leaders at Achampet : దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అభ్యర్థి బాలరాజు, కాంగ్రెస్ అభ్యర్థి వంశీచందర్ రెడ్డిలు అక్కడికి చేరుకున్నారు. దీంతో కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేస్తూ.. నేతల సమక్షంలో మరోసారి ఘర్షణకు దిగారు. పోలీసులు వారందరిని చెదరగొట్టి పరిస్థితులను అదపులోకి తెచ్చారు. ఈ దాడిలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(BRS Candidate Balaraju)కు స్వల్ప గాయాలయ్యాయి. హస్తం పార్టీ కార్యకర్తలు తనపై దాడి చేశారని ఎమ్మెల్యే పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలరాజును చికిత్స నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రాథమికి చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్లోని ఆసుపత్రికి తరలించారు.