Dil Raju TFCC Elections : 'ఏ పార్టీలోకి వెళ్లినా ఎంపీగా గెలుస్తాను'..దిల్​ రాజు హాట్ కామెంట్స్

By

Published : Jul 29, 2023, 8:34 PM IST

Updated : Jul 30, 2023, 6:20 AM IST

thumbnail

Dil Raju TFCC Elections : తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఎన్నికల్లో అధ్యక్షుడి పదవికి పోటీ పడుతున్న ప్రముఖ నిర్మాతలు దిల్‌రాజు, ఆదివారం ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తన ప్యానెల్‌ సభ్యులతో మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో అడుగుపెడితే ఏ పార్టీ నుంచైనా ఎంపీగా గెలుస్తానని అన్నారు. అయితే తన తొలి ప్రాధాన్యత సినిమా రంగానికే ఉంటుందంటూ పేర్కొన్నారు. అంతే కాకుండా సినిమాలు వేరు,రాజకీయాలు వేరని వ్యాఖ్యానించారు. 

సీనియర్లెవరూ ముందుకు రాకపోవడం వల్ల ఈ సారి తాను ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు. ఒకవేళ తాను అధ్యక్షుడిగా ఎన్నికైనా కూడా తనకేం కిరీటాలు పెట్టరని, తనకు కొత్త సమస్యలు వచ్చినట్టేనంటూ వ్యాఖ్యానించారు. అయితే, సినీ పరిశ్రమ అభివృద్ధి, సంక్షేమం కోసమే తాను ఈ సారి ఎన్నికల్లో నిలబడినట్లు పేర్కొన్నారు. గతంలో సీనియర్లు ఎవరైనా ముందుకు వస్తే ఏకగ్రీవంగా ఎన్నుకునే వారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి లేనందున ఈ ఎన్నికలు అనివార్యమైనట్లు దిల్ రాజు వివరించారు. 

అధ్యక్షుడిగా పోటీ చేయడం తన కార్యాలయంలోని సిబ్బందికి, కుటుంబసభ్యులకు ఇష్టం లేకపోయినప్పటికీ.. సినీ పరిశ్రమ భవిష్యత్​ కోసం ముందడుగు వేసినట్లు తెలిపారు. తెలుగు సినీ పరిశ్రమ ప్రపంచస్థాయిలో ముందుకెళ్తున్నందున తెలుగు ఫిల్మ్ ఛాంబర్​ను బలోపేతం చేసి రానున్న తరాలకు అందించే బాధ్యత తమపై ఉందన్నారు. రెండేళ్ల పదవికాలంలో ఒక సంవత్సరం తనకు ఇస్తే ఫిల్మ్ ఛాంబర్​ బై లాస్ సవరించి చిత్ర పరిశ్రమ ఎలా ముందుకెళ్తే బాగుంటుందో నిర్దేశిస్తాతనని దిల్ రాజు పేర్కొన్నారు. 

TFCC Elections 2023 : మరోవైపు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు  ఫిల్మ్‌ ఛాంబర్‌ ఎన్నికల పోలింగ్​ జరగనున్నాయి. అధ్యక్ష బరిలో సి.కళ్యాణ్ ప్యానెల్..  దిల్ రాజు ప్యానెల్ తో పోటీపడనుంది. మొత్తం 1560 మంది సభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సాయంత్రం 6 గంటలకు నూతన అధ్యక్షుడిని ప్రకటించనున్నారు.

Last Updated : Jul 30, 2023, 6:20 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.