ETV Bharat / sukhibhava

CORONA: కొవిడ్ తర్వాత గుండె వేగం పెరుగుతుందా?

author img

By

Published : Jul 27, 2021, 7:05 AM IST

heart beat increased, cardiologists opinion
కరోనా తర్వాత గుండె దడ, కార్డియాలజిస్టుల అభిప్రాయం

ఎక్కువగా శ్రమిస్తే కొందరిలో గుండెవేగం ఒక్కోసారి 95 కంటే ఎక్కువవుతుంది. అయితే కరోనా నుంచి కోలుకున్న తర్వాత ఇంకాస్త పెరుగుతోందని బాధితులు చెబుతున్నారు. ఇది వంద దాటితే ప్రమాదమా? దీని పరిష్కారంపై నిపుణులు ఏమంటున్నారంటే...

సమస్య: నా వయసు 45 ఏళ్లు. రెండున్నర నెలల క్రితం కరోనా వచ్చి, తగ్గిపోయింది. అప్పట్నుంచీ గుండె దడగా ఉంటోంది. ఎప్పుడు చూసినా నిమిషానికి 95 సార్లు కొట్టుకుంటోంది. కాసేపు నడిచినా, చిన్న పనిచేసినా 130కి పెరుగుతోంది. అప్పుడప్పుడు ఛాతీలో నొప్పిగా అనిపిస్తోంది. దీంతో భయం వేస్తోంది. ఇదేమైనా గుండె సమస్యనా? పరిష్కారమేంటి?

-శ్రీనివాస్‌, హైదరాబాద్‌

సలహా: వివరాలను బట్టి చూస్తుంటే మీరు భయాందోళనలకు గురవుతున్నారని అనిపిస్తోంది. కొవిడ్‌-19 తగ్గిన తర్వాత (పోస్ట్‌, లాంగ్‌ కొవిడ్‌లో) మూడింట ఒకవంతు మందిలో గుండె దడ వంటి ఆందోళన లక్షణాలు చూస్తున్నాం. మీరు నిమిషానికి 95 సార్లు గుండె కొట్టుకుంటోందని, పని చేస్తే పెరుగుతోందని అంటున్నారు. నిజానికిది నార్మలే. ఇప్పుడు పల్స్‌ ఆక్సీమీటర్లు, స్మార్ట్‌వాచ్‌ల వంటి పరికరాలు వాడుకోవటం పెరిగింది. మీరు వీటితో అదేపనిగా గుండె వేగాన్ని గమనిస్తున్నట్టయితే మానెయ్యటం మంచిది.

ఎలా మారుతుంది?

నార్మల్‌ గుండె వేగం ఎంతన్నది తెలియకపోతే ఏమాత్రం ఎక్కువున్నా ఆందోళనకు దారితీస్తుంది. ఇది గుండె వేగం మరింత పెరిగేలా చేస్తుంది. గుండె నిమిషానికి 72 సార్లు కొట్టుకోవటం నార్మల్‌ అని చాలామంది భావిస్తుంటారు. దీనికి ఏమాత్రం అటుఇటైనా ఏదో అయిపోయిందని భయపడుతుంటారు. దీంతో గుండె దడ ఇంకాస్త పెరుగుతుంది కూడా. గుండె వేగం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వయసు, పనులు, శరీర ఉష్ణోగ్రతలను బట్టి మారిపోతుంటుంది.

సాధారణ గుండె వేగం ఎంత?

విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకోవటం సహజమే. ఏదైనా పని చేస్తున్నప్పుడు, శరీర ఉష్ణోగ్రత ఎక్కువైనప్పుడు గుండె వేగం పెరగటమూ మామూలే. ఒంట్లో ఉష్ణోగ్రత ఉండాల్సిన దాని కన్నా ఒక డిగ్రీ ఫారన్‌హీట్‌ పెరిగితే గుండె సుమారు 10 సార్లు ఎక్కువ వేగంగా కొట్టుకుంటుంది. కష్టమైన పనులు, వ్యాయామాలు చేసినప్పుడు గుండె 180 సార్ల వరకూ కొట్టుకోవచ్చు. దీన్నే గరిష్ఠ గుండె వేగం అంటారు. దీన్ని 220 నుంచి వయసును తీసేసి లెక్కిస్తారు. మీకు 45 ఏళ్లు. కాబట్టి 220 నుంచి 45ను తీసేస్తే 175 వస్తుంది. అంటే మీరు కష్టమైన పనులు, వ్యాయామాలు చేసినప్పుడు గుండె నిమిషానికి 175 సార్లు కొట్టుకున్నా నార్మల్‌గానే భావించాల్సి ఉంటుంది. భయపడాల్సిన పనిలేదు.

వైద్యులను సంప్రదించాలి

కొవిడ్‌ బారినపడ్డ కొందరిలో గుండె కండరం మందం కావటం (మయోకార్డయిటిస్‌) నిజమే. అయితే ఇందులో గుండె దడ కన్నా పనులు చేస్తున్నప్పుడు ఆయాసం పెరగటమే ప్రధానంగా కనిపిస్తుంది. ఏదేమైనా ఒకసారి గుండె నిపుణులను సంప్రదించటం మంచిది. అవసరమైతే ఈసీజీ, ఎకో పరీక్షలు చేసి ఏవైనా తేడాలున్నాయేమో గుర్తిస్తారు. గుండెజబ్బులేవీ లేకపోతే ఆందోళనను తగ్గించే మందులు, కౌన్సెలింగ్‌ ఉపయోగపడతాయి.

-ఎన్​.కృష్ణారెడ్డి, సీనియర్ కార్డియాలజిస్ట్

ఇదీ చదవండి: పార్లర్‌కు వెళ్లే ముందు ఇవి తెలుసుకుంటున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.