ETV Bharat / sukhibhava

పెరుగు.. రొమ్ముకు ఎంతో మేలు!

author img

By

Published : Nov 24, 2020, 10:31 AM IST

CURD PROTECTS FOR BREAST
రొమ్ములకు పెరుగు రక్ష!

మానవ శరీరంలో మంచి బ్యాక్టీరియాను అభివృద్ధి చేయడంలో పెరుగు, మజ్జిగ వంటివి ఎంతగానో ఉపకరిస్తాయి. అయితే.. ఇటీవలి పరిశోధనల్లో రొమ్ము క్యాన్సర్ ముప్పు నుంచీ రక్షణ కల్పిస్తాయని వెల్లడైంది. ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌ నివారణకు పెరుగు అనేది ఓ తేలికైన, చవకైన మార్గం కాగలదని పరిశోధకులు భావిస్తున్నారు.

మంచి బ్యాక్టీరియాను వృద్ధి చేసే పెరుగు, మజ్జిగ వంటి పదార్థాలు చేసే మేలు అంతా ఇంతా కాదు. వీటి గురించి మరో కొత్త విషయం బయటపడింది. ఇవి వాపు ప్రక్రియను(ఇన్‌ఫ్లమేషన్‌) ప్రేరేపించే బ్యాక్టీరియా స్థానంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చేస్తున్నాయని.. ఫలితంగా రొమ్ము క్యాన్సర్‌ ముప్పు తగ్గే అవకాశముందని తాజా అధ్యయనంలో తేలింది. రొమ్ముల్లోని క్షీర నాళాల్లో అపరిపక్వ కణాలను(ప్రత్యేక నైపుణ్య కణాలుగా మారటానికి సిద్ధంగా ఉన్న మూలకణాలను) బ్యాక్టీరియా ప్రేరిత వాపు ప్రక్రియ అస్తవ్యస్తం చేస్తోందని.. ఇది క్యాన్సర్‌కు దారితీస్తుండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. అందువల్ల రోజూ పెరుగు, చిక్కటి మజ్జిగ వంటివి తీసుకోవటం మేలని సూచిస్తున్నారు.

రొమ్ము క్యాన్సర్‌ నివారణకు ఇది తేలికైన, చవకైన మార్గం కాగలదని ఆశిస్తున్నారు శాస్త్రవేత్తలు. పాలలో ల్యాక్టోజ్‌ అనే చక్కెర ఉంటుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా దీన్ని పులిసేలా చేస్తుంది. బిడ్డకు పాలు పట్టే తల్లుల రొమ్ముల క్షీరనాళాల్లోనూ ఇలాంటి బ్యాక్టీరియానే ఉంటోందని పరిశోధకులు చెబుతున్నారు. పాలివ్వటం మానేసిన తర్వాత అది కొంతకాలం అక్కడే ఉంటుండటం గమనార్హం. బిడ్డకు పాలు పట్టే ప్రతి ఏడాది కాలానికి రొమ్ము క్యాన్సర్‌ ముప్పు సుమారు 5% వరకు తగ్గుముఖం పడుతున్నట్టు గత అధ్యయనాలూ చెబుతున్నాయి. ఇందుకు మంచి బ్యాక్టీరియానే మూలమన్నది పరిశోధకుల భావన. పెరుగుతోనూ ఇలాంటి ప్రయోజనమే కనిపిస్తోందని, చెడు బ్యాక్టీరియా స్థానంలో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందేలా చూడటమే దీనికి కారణం కావొచ్చని వివరిస్తున్నారు.

ఇదీ చదవండి: దంపుడు బియ్యంతో ఆరోగ్యం పదిలం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.