ETV Bharat / sukhibhava

దంపుడు బియ్యంతో ఆరోగ్యం పదిలం

author img

By

Published : Nov 20, 2020, 12:56 PM IST

దంపుడు బియ్యంలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చూడ్డానికి దుమ్ము పట్టినట్టుగా, ముదురు రంగులో కనిపిస్తుండొచ్చు గానీ.. నిజానికివి మంచి పోషకాల గనులు. వీటిని తినడం వల్ల మధుమేహం ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.

దంపుడు బియ్యంతో ఆరోగ్యం పదిలం
Health benefits from waffle rice

బియ్యం అనగానే మనకిప్పుడు బాగా పాలిష్‌ పట్టిన తెల్లటి బియ్యమే గుర్తుకొస్తాయి. కానీ ఒకప్పుడు దంపుడు బియ్యమే తినేవారు. చూడ్డానికి దుమ్ము పట్టినట్టుగా, ముదురు రంగులో కనిపిస్తుండొచ్చు గానీ.. నిజానికివి మంచి పోషకాల గనులు. వరి పొట్టు కింద ఉండే తవుడు పొరలో విటమిన్లు, ఖనిజాలు దండిగా ఉంటాయి. పాలిష్‌ పట్టినపుడు తవుడుతో పాటు ఇవన్నీ తొలగి పోతాయి. అందుకే తెల్ల బియ్యం కన్నా దంపుడు బియ్యమే మంచివని పరిశోధకులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. వారానికి ఐదు, అంతకన్నా ఎక్కువసార్లు తెల్లబియ్యం తీసుకోవటం వల్ల మధుమేహం ముప్పు పెరుగుతున్నట్టు హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌ పరిశోధకులు గుర్తించారు. తెల్లబియ్యాన్ని 50 గ్రాములు తగ్గించి, వాటి స్థానంలో దంపుడు బియ్యాన్ని చేర్చుకుంటే మధుమేహం ముప్పు 16శాతం వరకు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు, రక్తపోటు పెరగటానికి దోహదం చేసే సోడియం పాళ్లు కూడా దంపుడు బియ్యంలో తక్కువే.

ఇక పోషకాల పరంగా చూస్తే- మనం తిన్న ఆహారాన్ని శక్తిగా మలచటంలో కీలకపాత్ర పోషించే నియాసిన్‌, విటమిన్‌ బి3 వీటిల్లో చాలా ఎక్కువ. వీటిల్లోని మెగ్నీషియం ఎముకల ఆరోగ్యానికి ఎంతగానో దోహదం చేస్తుంది. థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తికి, విశృంఖల కణాలను అడ్డుకోవటానికి తోడ్పడే సెలీనియం కూడా దంపుడు బియ్యంలో దండిగానే ఉంటుంది. వీటిల్లోని లిగ్నాన్లనే పాలీఫెనాల్స్‌ పేగుల్లోకి చేరిన తర్వాత ఫైటోఈస్ట్రోజన్‌ ఎంటెరోలాక్టేన్‌గానూ మారతాయి. ఇవి క్యాన్సర్‌ నివారకంగా పనిచేయటమే కాకుండా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ దోహదం చేస్తాయి. ఇక వీటిలోని పిండి పదార్థం నెమ్మదిగా జీర్ణమవుతుంది. అందువల్ల రక్తంలో గ్లూకోజు స్థాయులు అంత త్వరగా పెరగవు. కడుపు నిండిన భావన కలిగించటం వల్ల వెంట వెంటనే ఆకలి వేయదు కూడా.

ఇదీ చూడండి: అల్పాహారంతో అనంతమైన శక్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.