ETV Bharat / state

అత్యాచార బాధితుల జీవితాల్లో విద్యా వెలుగులు

author img

By

Published : Dec 28, 2022, 9:27 AM IST

Counseling For Rape Victims : మానవ మృగాల చేతిలో నలిగిపోయిన వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు వరంగల్​ మహిళా శిశు సంక్షేమ శాఖలోని బాలల పరిరక్షణ విభాగం అధికారులు. అత్యాచార బాధితులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం ఇవ్వడం, పునరావాసం కల్పించి వారికి తోడుగా ఉంటున్నారు. చీకటితో నిండుకున్న వారి జీవితాల్లో 'విద్యా' వెలుగులు నింపి వారి జీవితానికి మంచి భరోసా కల్పిస్తున్నారు.

rape victim women
rape victim women

Counseling For Rape Victims : విధులను సవ్యంగా, సంపూర్ణంగా నిర్వహించడమే గొప్ప విషయం కాగా.. అంతకుమించి సేవలందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారీ అధికారులు. అత్యాచార బాధితురాళ్లకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం సకాలంలో పరిహారం ఇవ్వడం, పునరావాసం కల్పించడమే కాకుండా.. వారిలో విద్యాజ్యోతులు వెలిగిస్తూ అండగా నిలుస్తున్నారు వరంగల్‌ జిల్లా మహిళాశిశు సంక్షేమ శాఖలోని బాలల పరిరక్షణ విభాగం (డీసీపీయూ) అధికారులు సిబ్బంది. బాధిత బాలికలకు సరైన కౌన్సెలింగ్‌ ఇచ్చి మళ్లీ చదువు కొనసాగించేలా చొరవ చూపుతున్నారు.

వీరు గతంలో ‘బాల్యానికి భరోసా’ పేరుతో మంచి స్పర్శ, చెడు స్పర్శ (గుడ్‌ టచ్‌, బ్యాడ్‌ టచ్‌)పై వందకుపైగా పాఠశాలల్లో బాలికలకు వీడియోల ద్వారా అవగాహన కల్పించారు. మరోవైపు బాల్యవివాహాలనూ అడ్డుకుంటూ.. వారి చదువులు కూడా కొనసాగేలా చూస్తున్నారు. లైంగిక దాడులకు గురైన బాలికలు ఎంతోమంది చదువు మానేయగా తిరిగి వారిని కళాశాలలు, పాఠశాల్లో చేర్పించడం తమకెంతో తృప్తినిస్తోందని.. జిల్లా కలెక్టర్‌ గోపి ప్రత్యేక శ్రద్ధ చూపుతూ వారి చదువుకు తోడ్పాటునందిస్తున్నారని జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారి మహేందర్‌రెడ్డి తెలిపారు. అత్యాచార బాధిత కుటుంబాల వారు సమాజంలో తీవ్ర వివక్షను ఎదుర్కొంటున్నారని, అమ్మాయిలు చదువుకు దూరమవుతున్నారని అన్నారు. వారితో ఆప్యాయంగా మాట్లాడి జీవితం, చదువు విలువ తెలియజేయడం వల్ల మంచి ఫలితాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఏమాత్రం ఆలస్యం లేకుండా: పద్దెనిమిదేళ్ల లోపు బాలలు లైంగిక నేరానికి గురైతే పోలీసులు పోక్సో కింద నిందితులపై కేసు నమోదు చేస్తారు. ఈ క్రమంలో నేరానికి గురైన బాలబాలికలకు రూ.లక్ష వరకు పరిహారం అందాల్సి ఉంటుంది. దీన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ అందిస్తుంది. వరంగల్‌ జిల్లాలో అత్యాచారానికి గురైన బాలికలకు ఈ పరిహారాన్ని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఇస్తున్నారు. గత ఆరేళ్లలో 87 మంది బాధితులకు రూ.40 లక్షల వరకు పరిహారం అందించారు.

ఇవీ ఉదాహరణలు: వరంగల్‌కు చెందిన ఇంటర్‌ చదివే పేదింటి అమ్మాయి రెండేళ్ల కిందట అత్యాచారానికి గురైంది. తండ్రి అనారోగ్యంతో పనికెళ్లలేని పరిస్థితి. తల్లి కూలీ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. ఆ అమ్మాయికి రెండు దఫాల్లో రూ.50 వేలు పరిహారం అందించారు. ఆమె చదువు మానేసినట్టు తెలిసి కౌన్సెలింగ్‌ ఇచ్చారు. పరిహారం డబ్బుతో ఇంజినీరింగ్‌లో చేరేలా ప్రోత్సహించడంతో ఇప్పుడామె చక్కగా చదువుకుంటోంది.

నర్సంపేట ప్రాంతానికి చెందిన కుటుంబం కొన్నేళ్ల కిందట వరంగల్‌ నగరానికి వలస వచ్చింది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై తెలిసిన వ్యక్తే అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కుటుంబం అవమానభారంతో సొంత ఊరికి వెళ్లిపోయింది. అక్కడ ఊరి బయట ఒక గుడిసె వేసుకొని బతుకుతున్నారు. అమ్మాయి చదువు కూడా మానేసింది. ఈ విషయం తెలిసి బాలల పరిరక్షణ విభాగం అధికారులు వాళ్ల దగ్గరికి వెళ్లి ధైర్యం చెప్పారు. ఆ అమ్మాయితో మాట్లాడి మళ్లీ చదువుకోవాలని నచ్చజెప్పారు. వీరి దయనీయ పరిస్థితిని కలెక్టర్‌ గోపికి వివరించారు. ఆయన చొరవ తీసుకొని ఆ అమ్మాయిని ఓ గురుకుల కళాశాలలో ఇంటర్‌లో చేర్పించారు. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడడంతో ఈమెకు రూ.లక్ష పరిహారం కూడా అందింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.