ETV Bharat / crime

ప్రసవ వేదనతో 5 ఆసుపత్రులకు.. అయినా దక్కని తల్లీబిడ్డల ప్రాణాలు..

author img

By

Published : Dec 28, 2022, 8:51 AM IST

Death of mother and child
Death of mother and child

Mother and Child Death : పుట్టబోయే బిడ్డ కోసం ఆ తల్లి గంపెడన్ని ఆశలతో ఎదురుచూసింది. కడుపులో చిన్నారి హాయిగా ఆడుకుంటుంటే ఎంతో సంబురపడింది. పుట్టబోయే బిడ్డ రూపాన్ని కళ్ల ముందు తల్చుకుంటూ రోజూ మురిసిపోయింది. చివరికి ఆ కలలు తీరకుండానే బిడ్డతో సహా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ఈ విషాద ఘటన నాగర్​కర్నూల్​ జిల్లాలో చోటుచేసుకుంది.​

Mother and Child Death : నవ మాసాలు మోసి, కన్నబిడ్డను కళ్లారా చూడాలని ఆమె ఎంతగానో ఆశించింది. తొలి కాన్పు నిమిత్తం కుటుంబసభ్యులు ఆమెను సర్కారీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కాన్పు క్లిష్టమయ్యేలా ఉందని వైద్యులు సూచించడంతో అక్కడి నుంచి మరో ఆసుపత్రికి.. తర్వాత ఇంకో ఆసుపత్రికి ఇలా నాలుగు ప్రభుత్వాస్పత్రులకు తిరిగారు. ఎక్కడా వైద్యం అందలేదు. చివరికి మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రి వైద్యులు ఆమెను చేర్చుకుని సాధారణ ప్రసవం చేసినా ప్రయోజనం లేకపోయింది. తల్లీబిడ్డలిద్దరూ కన్నుమూశారు. హృదయవిదారకమైన ఈ ఉదంతం వివరాలిలా ఉన్నాయి.

నాగర్‌ కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలంలోని ఎల్మపల్లికి చెందిన చారగొండ స్వర్ణ (24) కాన్పు కోసం పదర మండలం వంకేశ్వరంలోని పుట్టింటికి వెళ్లారు. సోమవారం రాత్రి ఆమె ప్రసవ వేదన పడుతుండటంతో తల్లిదండ్రులు 108 అంబులెన్సులో 4 కిలోమీటర్ల దూరంలోని పదర పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్య సిబ్బంది పరీక్షించి.. 10 కిలోమీటర్ల దూరంలోని అమ్రాబాద్‌ ఆసుపత్రికి పంపించారు.

అక్కడి సిబ్బంది తమ వద్ద సరైన సౌకర్యాలు లేవంటూ 25 కిలోమీటర్ల దూరంలోని అచ్చంపేట దవాఖానాకు పంపారు. అక్కడ ప్రాథమిక వైద్య సేవలందించిన సిబ్బంది.. బీపీ అదుపులోకి రాకపోవడంతో మరో 35 కిలోమీటర్ల దూరంలోని నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆసుపత్రికి రిఫర్‌ చేశారు. అక్కడ కూడా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో సిబ్బంది మరో 50 కి.మీ. దూరంలోని మహబూబ్‌నగర్‌ జనరల్‌ ఆసుపత్రికి వెళ్లమన్నారు. దీంతో స్వర్ణ కుటుంబీకులు ఆమెను తీసుకొని రాత్రి 2 గంటలకు మహబూబ్‌నగర్‌ ఆసుపత్రికి చేరుకోగా.. వైద్యులు ఆమెకు సాధారణ ప్రసవం చేశారు.

కుమారుడికి జన్మనిచ్చిన అనంతరం ఫిట్స్‌ రావడంతో స్వర్ణ మృతి చెందారు. కాసేపటికే శిశువు కూడా చనిపోయాడు. కాన్పు కోసం కష్టపడి 124 కి.మీ. దూరం వెళ్లినా తల్లీబిడ్డలు దక్కకపోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఐదు ఆసుపత్రులు తిరిగినా.. సరైన చికిత్స అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

మృతి చెందిన  చారగొండ స్వర్ణ
మృతి చెందిన చారగొండ స్వర్ణ

"అమ్రాబాద్‌ ఆసుపత్రిలో క్లిష్టమైన కాన్పులు చేసేందుకు అవసరమైన పరికరాలు, శస్త్రచికిత్స థియేటర్‌ అందుబాటులో లేవు. ప్రత్యేక వైద్యులూ లేరు. ఆసుపత్రికి వచ్చిన సమయంలో స్వర్ణ హైబీపీతో బాధపడుతున్నారు. కాన్పు కష్టమయ్యే అవకాశం ఉన్నందున అచ్చంపేట ఆసుపత్రికి తరలించాం. అమ్రాబాద్‌లో సాధారణ కాన్పులే చేస్తున్నాం."- డా.నాగరాజు, వైద్యాధికారి, అమ్రాబాద్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.