ETV Bharat / state

వినూత్నంగా ఆలోచించాడు.. నెలకు లక్షల్లో సంపాదిస్తున్నాడు

author img

By

Published : Feb 27, 2023, 2:06 PM IST

Story about Koteshwar in WANAPARTHY: లక్షల్లో ఆదాయం సంపాదించాలంటే మీరైతే ఏం చేస్తారు? ఇంజినీరింగ్‌ కానిచ్చి కొలువు కొట్టాలి అనుకుంటారు. అంతే కదా. మీరెప్పుడైనా వ్యవసాయం చేయాలని ఆలోచించారా? ఓ యువకుడు వ్యవసాయంలో వినూత్నంగా ఆలోచించి కౌజు పిట్టలు, నాటుకోళ్లు, పొట్టేళ్ల పెంపకంతో లక్షలు సంపాదిస్తున్నాడు. మార్కెట్‌లో గిరాకీ ఉన్న రకాలే పెంచుతూ నెలనెలా మంచి ఆదాయం పొందుతున్నాడు. ఆ యువకుడే కోటేశ్వర్.

Koteshwar of Vanaparthi district
వనపర్తి జిల్లాకు చెందిన కోటేశ్వర్

కౌజుపిట్టల పెంపకం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్న కోటేశ్వర్

Story about Koteshwar in WANAPARTHY: ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొన్నేళ్లు చిన్నచిన్న ఉద్యోగాలు చేశాడు. అవేవీ సంతృప్తిని ఇవ్వలేదు. సొంతంగా ఏదైనా చేయాలనుకున్నాడు. పదిమందికి ఉపాధి కల్పించాలని సంకల్పించాడు. కొన్నినెలల శోధన తర్వాత కౌజుపిట్టల పెంపకం మొదలుపెట్టాడు. ఐదేళ్లుగా దిగ్విజయంగా వ్యాపారం చేస్తూ.. కార్పొరేటు జీతం కంటే ఎక్కువగానే సంపాదిస్తున్నాడు. సంప్రదాయ పద్ధతిలో వ్యవసాయం చేస్తే నష్టాలు తప్ప లాభాలు లేవని ఆ యువకుడు చెబుతున్నాడు. మిశ్రమసాగు వల్లే రైతులు నష్టపోకుండా ఉంటారని నిరూపించాడు.

కౌజుపిట్టల పెంపకం ఎలా ఎంచుకున్నాడు: వనపర్తి జిల్లా దత్తాయిపల్లి గ్రామానికి చెందిన మన్నెయ్య- నీలావతి దంపతుల కుమారుడు కోటేశ్వర్. 2012లోనే ఎలక్ట్రికల్ విభాగంలో ఇంజినీరింగ్‌ పూర్తి చేశాడు. కొన్నేళ్లు అక్కడా, ఇక్కడా ఉద్యోగాలు చేశాడు. కానీ చేస్తున్న ఉద్యోగం పట్ల అతనికి సంతృప్తి లేదు. ఎన్నేళ్లు ఒకరి కింద పనిచేస్తూ జీవితాన్ని వెళ్లదీయగలమని.. తన కాళ్లపై తాను నిలబడాలని నిశ్చయించుకున్నాడు. వారిది వ్యవసాయ కుటుంబం అందుకే తనూ ఆ బాటలో సాగుతూ ఊళ్లోనే ఏదో ఒక వ్యాపారం ప్రారంభించాలనుకున్నాడు. కౌజుపిట్టల పెంపకం బాగుందని ఆ రంగాన్ని ఎంచుకుని, దాంట్లో లాభాలు గడిస్తున్నాడు.

ఎప్పుడు ప్రారంభించాడు: 2017లో 10 లక్షల పెట్టుబడితో దీనిని ప్రారంభించినట్లు కోటేశ్వర్‌ చెబుతున్నాడు. అప్పటి నుంచి నూతనంగా ఆలోచించడం, మార్కెట్‌ నడిచే ట్రెండ్‌కు తగ్గట్టుగా మారితేనే వ్యాపారంలో విజయాలు సాధించగలమని తెలిపాడు. పలు ప్రాంతాల నుంచి వాటిని తీసుకువచ్చి దఫాల వారీగా పెంచుతున్నామని అన్నాడు. వాటి పెంపకం ఎలా చేయాలో తన అనుభవాన్ని యువకుడు వివరించాడు.

ఎలా లాభం పొందుతున్నాడు: కౌజు పిట్ట పిల్లల్ని10 రూపాయలకు కొని, వాటిని పెంచి 40 నుంచి 50 రూపాయలకు అమ్ముతున్నాడు. ప్రతి 10 రోజులకు ఒక బ్యాచ్ చొప్పున 2వేల పిల్లల్ని పెంచుతారు. నెల రోజుల్లో 3 బ్యాచ్‌లు చేతికి వస్తాయని కోటేశ్వర్‌ చెప్తున్నాడు. ఈ వ్యాపారంలో శ్రమ తక్కువ. వెచ్చించాల్సిన సమయం కూడా తక్కువే అంటున్నాడు. రోజుకి 4 నుంచి 5 గంటలు శ్రమిస్తే చాలని చెబుతున్నాడు. అలాగే కౌజు పిట్టలే కాకుండా నాటుకోళ్లు, పొట్టేళ్లు పెంచుతున్నామని అంటున్నాడు.

ఈ వ్యాపారానికి ప్రస్తుతం డిమాండ్​ ఎక్కువే: కౌజుపిట్టల్లో పోషక విలువలు ఎక్కువ ఉంటాయని అన్నాడు. వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని అంటున్నాడు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులకు వీటి మాంసం చాలా మేలు చేస్తుందని.. అందుకే కౌజు పిట్టలకు మార్కెట్​లో మంచి డిమాండ్​ ఉందని చెబుతున్నాడు. బ్రాయిలర్ కోళ్లు, మేక, గొర్రె, పొట్టేళ్ల మాంసాలతో విసిగిపోయిన జనం కౌజుపిట్టల్ని ఆదరిస్తున్నారని అంటున్నాడు.

తనతో పాటు పలువురికి ఉపాధి: తన షెడ్​లో పెంచిన కౌజుల్ని స్వయంగా ఆటోలో వనపర్తి, గద్వాల, కర్నూల్ ప్రాంతాలకు వెళ్లి అమ్ముకుని వస్తారు. తనకున్న 20 ఎకరాల్లో విభిన్న రకాల పంటలను సాగు చేస్తు మంచి ఆదాయం పొందుతున్నాడు. మిశ్రమ వ్యవసాయం అనే ఆలోచనే తనను ఈ వ్యాపారం వైపు నడిపిందని కోటేశ్వర్ చెబుతున్నాడు. దానివల్ల తనకు ఆత్మ సంతృప్తితో పాటు మరో 10 మందికి ఉపాధి లభిస్తుందని అంటున్నాడు.

"అబ్బాయి ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేస్తానంటే మొదట చాలా భయపడ్డాను. వ్యాపారంలో నష్టాలుంటాయని, మనకి తెలియని విషయం గురించి ఎలా చేస్తావని చెప్పాను. ప్రస్తుతం మార్కెట్లో మంచి డిమాండ్‌ ఉన్న వ్యాపారం వల్ల మంచి ఆదాయం సంపాదిస్తున్నాడు, మా కుటుంబం ఆనందంగా గడుస్తుంది." - నీలావతి,కోటేశ్వర్ తల్లి

"మనసుకు సంతృప్తిగా లేదనే ఏ ఉద్యోగం చేయలేకపోయాను. వ్యవసాయం, వ్యాపారం నాకు నచ్చిన రంగాలు, ఇవే ఈరోజు నన్ను విజయ తీరాలకు చేర్చాయి. అందరూ మనసుకు నచ్చిన పని చేసినప్పుడే ఆనందంగా ఉంటారు." - కోటేశ్వర్‌

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.