ETV Bharat / state

రుద్రారంలో జపాన్​ నైపుణ్య శిక్షణ కేంద్రం

author img

By

Published : Mar 27, 2021, 8:58 PM IST

harish rao, malla reddy
హరీశ్​ రావు, మల్లారెడ్డి

ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు, ఆధునీకరణకు అనుగుణంగా మన విద్యావిధానంలో మార్పు రావాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో జపాన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న మొట్టమెదటి నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మంత్రి మల్లారెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఇటువంటి కేంద్రాలు యువతరం ఉద్యోగాల్లో ఉన్నత స్థానాలు చేరేందుకు ఉపయోగపడుతాయని ఆయన అభిప్రాయ పడ్డారు.

భారత దేశంలో ఏర్పాటు చేసిన జపాన్ పరిశ్రమల్లో పని చేసే స్థానిక యువతకు నైపుణ్య అభివృద్ధి కోసం ప్రత్యేక శిక్షణ ఇచ్చేలా జపాన్-భారత్ ప్రభుత్వాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులో భాగంగా పరిశ్రమలు తమ ప్రాంగాణాల్లో జపాన్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఫర్ మ్యానుఫ్యాక్చరింగ్ పేరుతో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా 14 శిక్షణ కేంద్రాలు ప్రారంభించగా.. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి కేంద్రాన్ని సంగారెడ్డి జిల్లా రుద్రారంలోని తోషిబా పరిశ్రమలో మంత్రులు హరీశ్ రావు, మల్లారెడ్డి, జపాన్ దేశ ప్రతినిధులు ప్రారంభించారు.

జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన హరీశ్​

ఈ శిక్షణ కేంద్రం గ్రామీణ యువతకు వరం లాటిందని.. ప్రతిష్టాత్మక సంస్థల్లో ఉద్యోగాలు పొందడానికి ఇక్కడ ఇచ్చే శిక్షణ ఉపయోగపడుతుందని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్​ రావు అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి శిక్షణ కేంద్రాన్ని తెలంగాణాలో ఏర్పాటు చేసినందుకు జపాన్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేటు రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. సరైన నైపుణ్యం ఉంటే వాటిని అందిపుచ్చుకోవ్చని హరీశ్ రావు సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచానికి తగినట్టుగా యువత నైపుణ్యాలు పెంపొందించుకోవాలన్నారు.

విజయానికి కష్టం ఒక్కటే మార్గం

విజయానికి కష్టం ఒక్కటే మార్గం అని దానికి అడ్డదారులు ఉండవని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కార్మికులకు, ఉద్యోగులకు సూచించారు. తాను కష్టపడి పాలు అమ్ముకునే వ్యక్తి నుంచి మంత్రి వరకు ఎదిగానన్నారు. స్థానికంగా ఉన్న ఐటీఐ కళాశాలలను దత్తత తీసుకుని అందులోని విద్యార్థులకు మొదటి నుంచే పరిశ్రమ అవసరాలకు తగ్గట్టు వారికి శిక్షణ ఇవ్వాలని తోషిబా పరిశ్రమ ప్రతినిధులకు సూచించారు. ఉద్యోగాల్లో స్థానికులకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని వారిని ఉన్నత స్థానాలకు తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. శిక్షణ కేంద్రం ప్రారంభించిన అనంతరం మంత్రులు విద్యార్థులకు స్టడీ మెటిరియల్ అందించారు.

ఇదీ చదవండి: కరోనా వ్యాప్తి దృష్ట్యా పండుగలు, ర్యాలీలపై ప్రభుత్వం నిషేధం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.