ETV Bharat / state

Telangana Projects Floods : తెలంగాణ ప్రాజెక్టుల్లో జల సవ్వడులు

author img

By

Published : Jul 22, 2023, 12:48 PM IST

Updated : Jul 22, 2023, 1:42 PM IST

Projects Water Levels in Telangana
Projects Water Levels in Telangana

Telangana Projects Water Level Today : గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులకు వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదులు ఉప్పొంగుతుండగా.. రెండ్రోజులుగా ప్రధాన గోదావరికీ ప్రవాహం మొదలైంది. ఎస్సారెస్పీకీ వరద ఇదే స్థాయిలో ఉంటే రెండు మూడ్రోజుల్లో గేట్లు ఎత్తే అవకాశం ఉంది. ముందు జాగ్రత్తగా బ్యారేజీల్లోని నీట మట్టాలను తగ్గిస్తున్న అధికారులు.. కాళేశ్వరం ఎత్తిపోతలలోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లనూ ఎత్తేశారు. ఎల్లంపల్లి నుంచి విడుదలైన నీరు ప్రాణహితతో కలిసి భద్రాచలం వద్ద నీటిమట్టం మళ్లీ పెరిగే అవకాశముంది.

Telangana Projects Floods : తెలంగాణ ప్రాజెక్టుల్లో జల సవ్వడులు

SRSP Project Water Level Today : నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. లక్షా 49 వేల 995 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుండగా.. నీటి మట్టం 49 టీఎంసీలు దాటింది. భారీ వర్షాలు, ఎగువన ప్రవాహంతో వరద మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది ఇలాగే కొనసాగితే మరో ఐదారు రోజుల్లో ఎస్సారెస్పీ నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంటుంది. నిర్మల్‌ జిల్లాలో కడెం ఉప్పొంగుతుండటంతో 14 గేట్లు ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. నిన్న ఉదయం వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో 18 గేట్లు ఎత్తేందుకు అధికారులు యత్నించినా.. సాంకేతిక సమస్యలతో కొన్ని ఎత్తడం ఇబ్బందికరమైంది. పని చేసిన 14 గేట్ల ద్వారా ఎగువ నుంచి వచ్చిన వరదను కిందికి వదులుతున్నారు. ఇదే జిల్లాలో స్వర్ణ జలాశయం 2 గేట్ల ద్వారా 10వేల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. గడ్డెన్న జలాశయానికి పెద్ద ఎత్తున వరదను అదే స్థాయిలో దిగువకు వదులుతున్నారు.

Kadem Project Water Level Today : కడెం జలాశయం గేట్లు ఎత్తడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. కడెంతో పాటు మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాల్లోని అటవీ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరదతో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. పుష్కర ఘాట్ల మీదుగా నీరు నిలవగా.. గోదావరి గుండా భారీగా ఎల్లంపల్లి జలాశయంలోకి వరద నీరు చేరుతుంది. ధర్మపురి వద్ద పరిస్థితులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌ పరిశీలించారు. తీర ప్రాంతాల ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని.. అధికార యంత్రాంగం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. ధర్మపురి క్షేత్రానికి భక్తుల రాక దృష్ట్యా ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Telangana Projects Floods : రెండు రోజుల క్రితం వరకు గోదావరిలోకి ప్రాణహిత, ఇంద్రావతి ఉప నదుల నుంచి అధిక వరద రాగా.. గురువారం నుంచి ప్రధాన గోదావరికి ప్రవాహం మొదలైంది. కడెం ప్రాజెక్టు నుంచి 1.50 లక్షల క్యూసెక్కులు, ఎల్లంపల్లి పరివాహక ప్రాంతం నుంచి మరో లక్ష క్యూసెక్కులు రావడంతో ఎల్లంపల్లిలోని 25 గేట్లను ఎత్తారు. ఎల్లంపల్లిలోకి 2.50 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో 25 గేట్లు ఎత్తి మొత్తం నీటిని దిగువకు వదులుతున్నారు. దీంతో కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా నిర్మించిన సుందిళ్ల, అన్నారం బ్యారేజీల గేట్లనూ ఎత్తేశారు. ముందు జాగ్రత్త చర్యగా అన్ని బ్యారేజీల్లోని నీటి మట్టాలను తగ్గించి, దిగువకు అధిక నీటిని వదిలేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం సిరిపురం వద్ద పార్వతీ బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఎప్పటికప్పుడు బ్యారేజ్ సామర్థ్యాన్ని పరిశీలిస్తున్న అధికారులు.. అదేస్థాయిలో దిగువకు నీటిని వదులుతున్నారు. శుక్రవారం సాయంత్రం నుంచి 60 గేట్లు ఎత్తి నిరంతరాయంగా వచ్చిన వరదను వచ్చినట్లుగా పంపుతున్నారు.

తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరం త్రివేణీ సంగమం వద్ద గోదావరి, ప్రాణహిత నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. తెలంగాణ, మహారాష్ట్ర, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రాణహిత నుంచి భారీగా వరద వచ్చి చేరుతుంది. పుష్కరఘాట్​ల మెట్లపై నుంచి నదీ ప్రవాహం కొనసాగుతుంది. ఎగువ ప్రాజెక్టులో గేట్లు ఎత్తి నీటిని విడుదల చేయడంతో గోదావరి వరద భారీగా వస్తుంది. పుష్కరఘాట్​ల వద్ద జలకళ సంతరించుకుంది. త్రివేణీ సంగమం వద్ద నీటిమట్టం క్రమక్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం కాళేశ్వరం వద్ద 11.580 మీటర్ల మేర నీటి మట్టం నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను మంథని ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు సందర్శించారు. వెనక జలాలతో ప్రజలు ముంపు బారిన పడకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

భద్రాచలం వద్ద తగ్గిన గోదావరి నీటిమట్టం.. : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 39 అడుగులకు తగ్గింది. శుక్రవారం 43 అడుగులు దాటి ప్రవహించగా.. సాయంత్రానికి 42 అడుగులకు చేరుకోవటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. నిన్నటి నుంచి క్రమంగా తగ్గుతూ.. ఈ ఉదయం 6 గంటలకు 39.8 అడుగుల మేర ప్రవహించిన గోదావరి ప్రస్తుతం 39.4 అడుగుల వద్ద తగ్గింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టు నుంచి నీటిని కొంతమేర గోదావరిలోకి వదులుతున్నారు. ఇంద్రావతి, ప్రాణహిత నుంచి కొనసాగుతున్న ప్రవాహానికి తోడు ఎగువన ఎల్లంపల్లి గేట్లు ఎత్తటంతో భద్రాచలం వద్ద వరద ప్రవాహం మళ్లీ పెరిగే అవకాశం ఉందని కేంద్ర జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇవీ చూడండి..

Hyderabad Rains : వర్షంలో పిల్లల్ని బయటకు పంపిస్తున్నారా.. బీ కేర్​ఫుల్

TU Hostel Problems : ఇదేందయ్యా ఇది.. హాస్టలా..? సమస్యల అడ్డానా..?

Last Updated :Jul 22, 2023, 1:42 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.